ఏజెన్సీలో ఏకగ్రీవాల జోరు.. నామినేషన్ల మొదటిరోజే గ్రామ సర్పంచ్ల ఏకగ్రీవం

ఏజెన్సీలో ఏకగ్రీవాల జోరు.. నామినేషన్ల మొదటిరోజే గ్రామ సర్పంచ్ల ఏకగ్రీవం
  • నామినేషన్ల మొదటిరోజే గ్రామ సర్పంచ్​ల ఏకగ్రీవం
  • గ్రామాల అభివృద్ధి కోసం ఏకమవుతున్న గిరిజనులు 
  • పార్టీలు సైతం మద్దతు 
  • జిల్లాలో ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ

ఆదిలాబాద్/ఇంద్రవెల్లి, వెలుగు: ఆదిలాబాద్​జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవాల జోరు షురైంది. నామినేషన్లు ప్రారంభమైన రోజే జిల్లాలోని నాలుగు ఏజెన్సీలోని గ్రామాల్లో సర్పంచ్, వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్యంగా ఈ గ్రామాలన్నీ ఎస్టీ రిజర్వ్​డ్​ కాగా.. గిరిజనులు ఎన్నికలకు వెళ్లకుండా ఏకగ్రీవాల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇంద్రవెల్లి మండలంలోని తేజాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సాలెగూడ, మోహన్ గూడ, తేజాపూర్, దోభిగూడ గ్రామాల పటేళ్లు, గ్రామస్తులు గురువారం సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. 

చర్చలు జరిపి తీర్మానం చేసుకొని మాజీ ఎంపీటీసీ కోవ రాజేశ్వర్​ను ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకున్నారు. ఇదే మండలంలోని వాల్గోండా గ్రామ పంచాయతీ పరిధిలోని ఐదు గ్రామాల పటేళ్లు సమావేశమై వాల్గోండా సర్పంచ్​గా కనక సునీతను ఏకగ్రీవం చేశారు. ఇంద్రవెల్లి మండలంలోని మెండపల్లి గ్రామ సర్పంచ్​గా కొడప శ్రీరామ్, ఉప సర్పంచ్​గా ముండె మొహన్ రావును పంచాయతీ పరిధిలోని దుర్వాగూడ, మెండపల్లి (గోండుగూడా), మెండపల్లి గ్రామస్తులు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సిరికొండ మండలంలోని రాయిగూడ సర్పంచ్​గా పెందూర్ లక్ష్మణ్ ను, 8 మంది వార్డు సభ్యులను పెద్దల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

చివరిసారి 167 పంచాయతీలు ఏకగ్రీవం

జిల్లాలో నామినేషన్ల మొదటి రోజు నుంచే ఏకగ్రీవ సర్పంచ్ లను ఎన్నుకుంటున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ మండలాల్లోనే ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత పంచాయతీ ఎన్నికల్లో 467 గ్రామాలకు గాను 167 పంచాయతీలు ఏకగ్రీవమవయ్యాయి. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షల నజరానా అందిస్తామని ప్రకటించడంతో చాలా మంది తమ గ్రామాభివృద్ధికి ఈ నిధులు ఉపయోగపడుతాయని గ్రామ ప్రజలంతా ఏకమై సర్పంచ్ లను ఎన్నుకున్నారు.

 కానీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుండటంతో ఏకగ్రీవ పంచాయతీలపై ఆయా గ్రామాలు దృష్టిపెడుతున్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు వస్తే గ్రామాలు అభివృద్ధి చేసుకోవచ్చనే ఉద్దేశంతో సర్పంచ్ లను ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. ఏకగ్రీవం చేసుకుంటే ఎన్నికల నిర్వహణ భారంతో పాటు.. గ్రామాభివృద్ధి కోసం ఏకతాటిపైకి వచ్చినట్లుంటుందని భావిస్తున్నారు. 

పార్టీలకు అతీతంగా..

ఏకగ్రీవ పంచాయతీలను ఎన్నుకునేందుకు ప్రజలతో పాటు పార్టీలు సైతం మద్దతు తెలుపాల్సి ఉంటుంది. ఏజెన్సీల్లో అన్ని స్థానాలు ఎస్టీలకు కేటాయించడంతో అక్కడ గ్రామ పటేళ్లు, గ్రామ పెద్దలంతా కలిసి అభిప్రాయాలు సేకరించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. గ్రామ పెద్దల మాటలకు పార్టీలు సైతం కట్టుబడుతుండడంతో ఏకగ్రీవంగా సర్పంచ్ లను ఎన్నుకుంటున్నారు. అయితే మిగతా ప్రాంతాల్లో మాత్రం పోటీ కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధించాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందిస్తోంది.

ఈ నేపథ్యంలోనే గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదిలాబాద్ రూరల్, మావల, సాత్నాల మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీల ముఖ్య కార్యకర్తలతో స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశం నిర్వహించి నేతలు దిశానిర్దేశం చేశారు. మెజార్టీ గ్రామాల్లో పార్టీ మద్దతుదారులను గెలిపించేలా కార్యకర్తలు కష్టపడాలని డీసీసీబీ చైర్మన్  అడ్డి బోజారెడ్డి పిలుపునిచ్చారు.