
- విద్యార్థుల్లో ఆహారం పట్ల అవగాహన పెంచేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: 15 ఏండ్లకే ఒబెసిటీ, 20 ఏండ్లకే గుండె జబ్బులు.. ఇవి ప్రస్తుత కాలపు పిల్లల్లో కనిపిస్తున్న అనారోగ్య సమస్యలు. మారిన లైఫ్ స్టైల్ తో విద్యార్థులు రోజూ తీసుకునే ఆహారం ద్వారానే అనేక రోగాల బారిన పడుతున్నారని వివిధ పరిశోధనల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా ప్రోత్సహించేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. దేశంలోని హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ‘ఆయిల్ అండ్ షుగర్ బోర్డులు’ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ డిజిటల్, స్టాటిక్ బోర్డుల ద్వారా అధిక ఆయిల్, షుగర్ కలిగిన పదార్థాలు తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు, ఒబెసిటీ, క్యాన్సర్, డయాబెటీస్, బీపీ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని తెలియజేయనున్నది. అలాగే, మంచి ఆహారం, పండ్లు, కూరగాయలు తీసుకోవడంతో కలిగే ప్రయోజనాలు, ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి పలు సూచనలు చేసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ బోర్డులు విద్యార్థులకు కనిపించేలా ఇన్స్టిట్యూషన్స్లోని కారిడార్లు, క్యాంటీన్లు, మీటింగ్ రూముల్లో ఏర్పాటు చేయనున్నది. న్యూట్రిషన్ ఫుడ్ కు సంబంధించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సెక్రటరీ మనీశ్ ఆర్.జోషీ వర్సిటీలకు ఉత్తర్వులు జారీ చేశారు.