
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రధాన అనుచరుడు, బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్ రావు ఫోన్ ను గత బీఆర్ఎస్ హయాంలో ట్యాపింగ్ చేసినట్లు నిర్ధారించారు. ఈ యన ఫోన్ ద్వారానే సంజయ్ కాల్స్ మాట్లాడేవారు. ఈ క్రమంలో వ్యక్తిగతంగా హాజరు కావాలని ప్రవీణ్ కు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు పంపించారు. ఇప్పటికే తన ఫోన్ ట్యాపింగ్ అయిందని సంజయ్ ఆరోపణలు చేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావును ఇప్పటికి నాలుగు సార్లు విచారించింది. మళ్లీ ఈ రోజు ( జూన్ 20) కూడా ఆయనను విచారిస్తున్నారు. నిన్న ( జూన్ 19) 9 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన సిట్ బృందం పలు కీలకమైన ప్రశ్నలు అడిగిందని సమాచారం అందుతోంది.
ప్రభాకర్ రావు టీం బీఆర్ఎస్ హయాంలో 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు దాదాపు 4200 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది . ఇందులో 600 మంది కాంగ్రెస్ నేతల ఫోన్లు ఉన్నట్లు గుర్తించారు. పలువురు బీఆర్ఎస్ నేతలు,బీజేపీనేతలు, జడ్జీలు, పోలీసులు, జర్నలిస్టులు, పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ ట్యాపింగ్ బాధిత లిస్టులో ఉన్నారు.