
- రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలకు కేంద్రమంత్రి నడ్డా హామీ
- మా పోరాటంతో కేంద్రం దిగొచ్చింది: ఎంపీలు
న్యూఢిల్లీ, వెలుగు: యూరియా కోసం వారం రోజులుగా తాము చేస్తున్న పోరాటంతో కేంద్రం దిగొచ్చిందని రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు అన్నారు. వారంలో 62 వేల టన్నుల యూరియాను తెలంగాణకు ఇస్తామని చెప్పిందని తెలిపారు. స్టేట్ కాంగ్రెస్ ఎంపీల ఫోరం చైర్మన్ మల్లు రవి నేతృత్వంలో ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, రామసహాయం రఘురాంరెడ్డి, కడియం కావ్య, బలరాంనాయక్, అనిల్‌కుమార్ యాదవ్, రఘువీర్ రెడ్డి, సురేశ్ షెట్కర్ వరుసగా రెండోరోజు మంగళవారం కేంద్రమంత్రి జేపీ నడ్డాను కలిశారు. రాష్ట్రంలో యూరియా కొరతపై ఆయనకు వివరించారు.
అనంతరం ఎంపీలు మాట్లాడుతూ.. వారం రోజుల్లో 62 వేల టన్నుల యూరియా ఇస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో 14 వేల టన్నులు, వారం రోజుల్లో మరో 48 వేల టన్నుల యూరియా ఇస్తామన్నారని చెప్పారు. ‘‘యూరియా కోసం వారం రోజులుగా మేం పోరాడుతున్నాం. పార్లమెంట్‌లో వాయిదా తీర్మానం కూడా ఇచ్చాం. పలుమార్లు నడ్డాను కలిశాం. మా ఒత్తిడితో కేంద్రం దిగొచ్చింది” అని అన్నారు.