అమెరికా వెళ్లే కొత్త జంటలకు ఇప్పుడు అంత ఈజీ కాదు: వీసా రూల్స్ మార్పు..

అమెరికా వెళ్లే కొత్త జంటలకు ఇప్పుడు అంత ఈజీ కాదు: వీసా రూల్స్ మార్పు..

యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ & ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) కుటుంబ వలస వీసా అప్లికేషన్లను ముఖ్యంగా పెళ్లి చేసుకున్న గ్రీన్ కార్డుదారుల అప్లికేషన్ల వెరిఫికేషన్ మరింత కఠినంగా పరిశీలించేందుకు కొత్త రూల్స్ విడుదల చేసింది. దీని ద్వారా నకిలీ అప్లికేషన్స్, అక్రమంగా దేశంలోకి వచ్చే వలసలను అరికట్టనుంది, అలాగే  నిజమైన పెళ్లి దంపతులకు మాత్రమే గ్రీన్ కార్డ్ ఆమోదం లభించేలా చూడనుంది. 

ఈ కొత్త మార్గదర్శకాలు USCIS పాలసీ మాన్యువల్‌లో ఆగస్టు 1 నుండి అమలులోకి వచ్చాయి. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న దరఖాస్తులకు అలాగే కొత్త అప్లికేషలన్లకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.

మోసాల ద్వారా లేదా అర్హత లేని దరఖాస్తులు చట్టబద్ధంగా గ్రీన్ కార్డ్ పొందే సరైన మార్గాలపై ప్రజల నమ్మకాన్ని తగ్గిస్తాయి. అలాగే  అమెరికాలో కుటుంబ ఐక్యతను దెబ్బతీస్తుంది.

చెడు ఉద్దేశాలతో వచ్చే వలసదారులను గుర్తించి వారిని యునైటెడ్ స్టేట్స్ నుండి పంపించేందుకు చర్యలు తీసుకోవడం ద్వారా అమెరికన్లను సురక్షితంగా ఉంచొచ్చు. 

 USCIS తీసుకునే చర్యలు ఏంటంటే :

*కుటుంబ వీసా అప్లికేషన్స్ కోసం అర్హతల వెరిఫికేషన్, వాటిని పరిశీలించి ఆమోదించే విధానాలను మెరుగుపరుస్తారు. దీనివల్ల నిజమైన దరఖాస్తులు మాత్రమే ఆమోదించబడతాయి.

*నిజమైన పెళ్లిని నిరూపించడానికి కచ్చితమైన డాక్యుమెంట్లు అవసరం. వీటిలో ఫోటోలు, ఇద్దరికీ ఉమ్మడిగా ఉన్న ఆర్థిక వివరాలు అంటే బ్యాంక్ అకౌంట్స్, ఆస్తులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల నుండి అఫిడవిట్లు వంటివి ఉంటాయి.

* పెళ్లి సంబంధం నిజమైనదా కాదా అని నిర్ధారించడానికి వీసా కోసం దరఖాస్తు చేసుకున్న జంటలు తప్పనిసరిగా వ్యక్తిగత ఇంటర్వ్యూలకు హాజరు కావాలి.

*పాత దరఖాస్తులను పరిశీలిస్తారు. దీనివల్ల ఏదైనా అక్రమాలు ఉంటే తెలుసుకోవచ్చు.

*ముఖ్యంగా పెళ్లి ద్వారా అమెరికాలో  గ్రీన్ కార్డ్ పొందాలని చూస్తున్న వారి గతంని పరిశీలిస్తారు. ఉదాహరణకు, H-1B వంటి ఇతర వీసాలపై ఇప్పటికే అమెరికాలో ఉన్న వారి వివరాలను చెక్ చేస్తారు.

*ఎవరైన గ్రీన్ కార్డ్ పిటిషన్ ఆమోదించి అతను అనర్హుడని తేలిన  లేదా దేశం నుండి పంపించడానికి అర్హుడని తేలితే నోటిస్ టు అప్పీర్ (NTA) జారీ చేస్తారు. అంటే కోర్టులో హాజరు కావాలని నోటీసు పంపుతారు.