జీ20 కారిడార్ చైనా రోడ్ కు పోటీగా.. ఇండియా- యూరప్ రైల్వే’ డీల్

జీ20 కారిడార్ చైనా రోడ్ కు   పోటీగా.. ఇండియా- యూరప్ రైల్వే’ డీల్
  • గల్ఫ్ మీదుగా రెండు ఎకనమిక్ కారిడార్​లు  
  • రైల్వే, పోర్టుల అనుసంధానం.. ఎలక్ట్రిక్ కేబుల్స్, పైప్​లైన్ల నిర్మాణం 
  • మెగా ప్రాజెక్టుకు ఇండియా, యూఎస్, సౌదీ, యూఏఈ, యూరప్ దేశాల అంగీకారం

న్యూఢిల్లీ: జీ20 వేదికగా చైనాకు మరో షాక్ నిస్తూ కూటమి దేశాలు చరిత్రాత్మకమైన ‘ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరప్ ఎకనమిక్ కారిడార్’ను ప్రకటించాయి. ఇండియా నుంచి గల్ఫ్ దేశాల మీదుగా యూరప్ వరకూ రైల్వేలు, పోర్టులను అనుసంధానం చేసే ఈ ప్రాజెక్టుకు శనివారం జీ20 సమిట్ లో అమెరికా, ఇండియా, సౌదీ అరేబియా, యూఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ ఆమోదం తెలిపాయి. ఈ ప్రాజెక్టుతో ఆసియా, అరేబియన్ గల్ఫ్, యూరప్ మధ్య వాణిజ్యాన్ని పరుగులుపెట్టించే లక్ష్యంతో ఈ దేశాలు ఎంవోయూపై సంతకాలు చేశాయి. చైనా తలపెట్టిన ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా జీ20 దేశాలు తెచ్చిన ఈ ప్రాజెక్టుతో ఇటు ఇండియాకు, అటు యూరప్ దేశాలకు పరస్పర ప్రయోజనం కలగనుంది. 

రెండు కారిడార్ లు 

ఇండియా–యూరప్ ఎకనమిక్ కారిడార్ ప్రాజెక్టును ఈస్ట్, నార్త్ అనే రెండు వేర్వేరు భాగాలుగా అమలు చేయనున్నారు. ఈస్ట్ కారిడార్ లో ఇండియా నుంచి వెస్ట్ ఆసియా(మిడిల్ ఈస్ట్)కు కనెక్టివిటీపై దృష్టిపెడతారు. రెండోదైన నార్తర్న్ కారిడార్ లో వెస్ట్ ఆసియా నుంచి యూరప్ దాకా కనెక్టివిటీకి ఏర్పాట్లు చేస్తారు. ప్రాజెక్టులో భాగంగా ఆయా దేశాల మధ్య రైల్వే నెట్ వర్క్ లను ఏర్పాటు చేస్తారు. దీంతోపాటు షిప్పింగ్ తోపాటు మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ రూట్లను విస్తరిస్తారు. ఎలక్ట్రిసిటీ కేబుల్స్, డిజిటల్ కనెక్టివిటీ, క్లీన్ హైడ్రోజన్ సరఫరా కోసం పైప్ లైన్లు కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంటాయి. ప్రాంతీయంగా సప్లై చైన్ లను మెరుగుపరిచి ఆయా దేశాల మధ్య వాణిజ్యం వేగవంతం చేస్తుంది. ఇండియా నుంచి యూరప్​కు ఏకంగా 40% వేగంగా వాణిజ్యం జరుగుతుందని చెప్తున్నారు.