డొమినికన్ రిపబ్లిక్‌లోని ‘లా రొమానా’ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ప్రైవేట్ జెట్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అవుతుండగా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విమాన పైలట్, కో-పైలట్ ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ప్రయాణికులు ఎవరూ లేరని, కేవలం ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉన్నారని అధికారులు చెప్పారు.
విమానాశ్రయంలో రన్‌వేపై విమానం దిగిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు అంటుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరో వీడియోలో విమానాశ్రయం మొత్తం భారీగా పొగ కమ్ముకోగా, ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పుతున్నట్లు కనిపించింది.
WATCH: Private jet crashes while emergency landing at La Romana International Airport in Dominican Republic. pic.twitter.com/oiaEIRPjes
— AZ Intel (@AZ_Intel_) June 7, 2026
ఏం జరిగిందంటే?
అమెరికా మీడియా కథనాల ప్రకారం.. అమెరికాలో రిజిస్టర్ అయిన ‘గల్ఫ్‌స్ట్రీమ్ G200’ అనే ఈ జెట్ విమానం టెక్సాస్‌లోని ఆస్టిన్ నగరానికి బయలుదేరింది. అయితే ప్రయాణంలో ఉండగా విమానంలో తీవ్రమైన సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్లు వెంటనే స్పందించి, ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రకటించారు.
విమానాన్ని తిరిగి సురక్షితంగా దించేందుకు లా రొమానా విమానాశ్రయానికి వైపు మళ్లించారు. కానీ, విమానం రన్‌వేపై నేలను తాకగానే ఒక్కసారిగా మంటలు చెలరేగి, అగ్నిగోళంలా మారిపోయింది.
దర్యాప్తు ప్రారంభం
ఈ ప్రైవేట్ జెట్ విమానం కూలిపోవడానికి అసలు కారణాలను తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. డొమినికన్ సివిల్ ఏవియేషన్ సంస్థలు (IDAC, CIAA) ఈ ప్రమాదంపై పూర్తి విచారణ జరుపుతున్నామని, మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాయి. గతంలో 2021లో కూడా ఇక్కడి రాజధాని శాంటో డొమింగోలో జరిగిన ఒక ప్రైవేట్ విమాన ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
Los dos tripulantes mueren en el accidente del avión en La Romana pic.twitter.com/y3n4mIixoc
— Rafael Grullón (@rafael_gru76469) June 8, 2026
