భారత్‌కు మరో బిగ్ షాక్.. నాడా దెబ్బకి కామన్వెల్త్ గేమ్స్‌కు స్టార్ అథ్లెట్ దూరం!

భారత్‌కు మరో బిగ్ షాక్.. నాడా దెబ్బకి కామన్వెల్త్ గేమ్స్‌కు స్టార్ అథ్లెట్ దూరం!

Indian Athlete Ruled Out: 2022 కామన్వెల్త్ గేమ్స్ రజత పతక విజేత, భారత స్టార్ జూడో క్రీడాకారిణి తులికా మాన్ (27)కు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) షాక్ ఇచ్చింది. గత 12 నెలల కాలంలో మూడుసార్లు వేర్ అబౌట్స్ నమోదు చేయడంలో విఫలమైనందుకు గానూ నాడా ఆమెకు చార్జ్ నోటీసు జారీ చేసింది. మహిళల +78 కేజీల విభాగంలో పోటీపడాల్సిన తులికా, ఈ విషయంలో తన వైఖరిని చెప్పేందుకు NADA ఆఫీసుకి వెళ్లినప్పటికీ, ఆమె గ్లాస్గో వేదికగా జరగనున్న 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనడం దాదాపు అసాధ్యంగా మారింది.

రెండేళ్ల పాటు నిషేధం: 
వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (WADA) రూల్స్ ప్రకారం, రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (RTP)లో ఉన్న అథ్లెట్లు రాబోయే 3 నెలలకు సంబంధించిన తమ రోజువారీ సమాచారాన్ని యాంటీ-డోపింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ADAMS)లో తప్పనిసరిగా అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వారి ప్లాన్స్‌లో ఏమైనా మార్పులు ఉంటే వెంటనే సిస్టమ్‌లో చేంజ్ చేయాలి. 12 నెలల వ్యవధిలో మూడుసార్లు సమాచారం అందించడంలో ఫెయిల్ అయినా లేదా పరీక్షలకు అందుబాటులో లేకపోయినా దాన్ని డోపింగ్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. యాంటీ డోపింగ్ నిబంధనలలోని ఆర్టికల్ 2.4 ప్రకారం దీనికి గరిష్టంగా 2 ఏళ్ల పాటు నిషేధం విధించే ఛాన్స్ ఉంది. తులికా ముందు ప్రస్తుతం ఈ ఛార్జ్ నోటీసును సవాలు చేయడం లేదా సస్పెన్షన్‌ను ఒప్పుకోవడం అనే రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి.

కామన్వెల్త్ గేమ్స్ నుంచి తులికా ఔట్: 
ఈ పరిణామంపై జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (JFI) అధ్యక్షుడు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో  తులికా మాన్ ని టోర్నీకి పంపడం అత్యంత కష్టమని తెలిపారు. ఈ కారణంతో 2026 కామన్వెల్త్ గేమ్స్ నుంచి ఆమె పేరును ఉపసంహరించుకోక తప్పదని స్పష్టం చేశారు. కాగా, ఈ కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభానికి ముందు డోపింగ్ నిబంధనల ఉల్లంఘన కింద చిక్కుకున్న రెండో భారతీయ జూడో అథ్లెట్ తులికా.. అంతకు ముందు పారిస్‌లో శిక్షణ పొందుతున్న అరుణ్ కుమార్ అనే మరో జూడో ప్లేయర్ జూన్ 8, జులై 3న బళ్లారిలో జరిపిన పరీక్షల్లో నిషిద్ధ అనాబోలిక్ స్టెరాయిడ్స్ (మెస్టానలోన్, స్టానోజోలోల్) వాడినట్లు తేలడంతో NADA చర్యలు ఎదుర్కొంటున్నాడు.