కరోనా పై కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది

కరోనా పై  కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది

కరోనా థర్డ్ వేవ్ ముప్పుపై తెలంగాణ ప్రభుత్వంగా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు బీజేపీ నేత విజయశాంతి. హైకోర్టుకు ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి లేదన్నారు. రాజకీయ మీటింగ్‌లను మాత్రమే పట్టించుకుని ఇతర పబ్లిక్ ప్రదేశాలను గాలికి వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ, కేరళ, మహారాష్ట్రల్లో కరోనా కేసులు పెరుగున్నా.. ఆ పరిస్థితిలు తెలంగాణకు లేదని రాష్ట్ర  పబ్లిక్ హెల్త్ డైరక్టర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు విజయశాంతి. పక్క రాష్ట్రాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నప్పుడు అవి తెలంగాణకు వ్యాప్తి చెందకుండా సర్కారు తీసుకున్న ప్రత్యేక చర్యలేంటో చెప్పలేదన్నారు. రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే మీటింగులలో జనం గుమిగూడి కరోనా వ్యాప్తి చెందుతుందని.. కరోనా పెరిగితే లీడర్లదే బాధ్యత అని కూడా వ్యాఖ్యానించారు. అది నిజమైన ఆందోళనే అయితే, కేవలం రాజకీయ పార్టీల మీటింగుల్లో మాత్రమే జనం గుమిగూడుతున్నారా? రాష్ట్రంలోని పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కడా రద్దీ లేనే లేదా? అనేది సర్కారు ఆలోచించాలన్నారు. గతంలో వైరస్‌ల నివారణకు రోజు లేదా రోజు విడిచి రోజు సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేసేవారని.. ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వచ్చి ప్రజల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకునేవారన్నారు. ఈ చర్యలు క్రమక్రమంగా కనుమరుగవుతూ వస్తున్నాయని తెలిపారు. సర్కారు తీరు చూస్తుంటే అసలు కరోనా వ్యాప్తి నిరోధంపై పాలకులకు నిజంగా చిత్తశుద్ధి ఉందా? అనే సందేహాలు కలుగుతున్నాయన్నారు. థర్డ్ వేవ్ ఆందోళనల కారణంగానే కదా హైకోర్టు గురుకులాలు, హాస్టళ్లల్లో ప్రత్యక్ష బోధనకు బ్రేక్ వేసింది? హైకోర్టుకు ఉన్న ఆందోళన పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌కు లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కారుకు ఒక విధానమంటూ లేదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని విమర్శించారు విజయశాంతి.