అమూల్ పాలలో పురుగులు ? వైరల్ వీడియోతో కలకలం.. కంపెనీ ఏమందంటే?

అమూల్ పాలలో పురుగులు ? వైరల్ వీడియోతో కలకలం.. కంపెనీ ఏమందంటే?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. మనం రోజూ వాడే పాల ప్యాకెట్లలో పురుగులు ఉన్నాయనే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన ఓ వీడియోలో ఒక మహిళ   అమూల్ గోల్డ్ పాల ప్యాకెట్‌ను పట్టుకుని కనిపిస్తోంది. పక్కనే ఉన్న  గిన్నెలో పోసిన పాలలో పురుగులులాంటివి పాలలో తేలుతూ, కదులుతూ  కనిపిస్తున్నాయి. పాల ప్యాకెట్ కట్ చేసి గిన్నెలో  పోయగానే ఈ పురుగులు ఉన్నాయని ఆమె చెబుతుంది. ఈ ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ 8 డేట్  మార్చి  2026 అని ఉంది. ఆమె పాడైపోయిన పాలు అమ్మారంటూ  అక్కడి స్థానిక దుకాణదారుడిని నిలదీశారు.

అమూల్ కంపెనీ స్పందన
ఈ వీడియో వైరల్ కావడంతో అమూల్ కంపెనీ  సోషల్ మీడియా ద్వారా స్పందించింది. ఈ విషయం మా దృష్టికి వచ్చింది. మా బృందం దీనిపై విచారణ చేస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తాం అని కంపెనీ పేర్కొంది.

ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు భయపడుతుంటే, మరికొందరు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ గిన్నెలో ముందే పురుగులు ఉండొచ్చు, పాలలో రావడం ఏంటి ? అని ఒకరు కామెంట్ చేయగా... ఏదైనా వాడే ముందు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది అని మరొకరు సూచించారు. అసలు ఈ రోజుల్లో ఏది నమ్మాలో అర్థం కావడం లేదు, అన్నీ కల్తీ అవుతున్నాయి అని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ పాలలో కనిపించేవి నిజంగా పురుగులేనా? లేక మరేదైనా కారణమా ? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.