మహిళలు ఎదిగితే కుటుంబం బాగుపడ్తది : వివేక్ వెంకటస్వామి

మహిళలు ఎదిగితే కుటుంబం బాగుపడ్తది : వివేక్ వెంకటస్వామి
  • మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నం: వివేక్ వెంకటస్వామి
  • మహిళా సంఘాలకు రూ.17.21 కోట్ల రుణాల పంపిణీ
  • గిగ్ వర్కర్లకు సంక్షేమ నిధితో పాటు ప్రత్యేక పాలసీ తెస్తున్నం
  • మంచిర్యాల జిల్లా మందమర్రి, చెన్నూరు మండలాల్లో మంత్రి పర్యటన

కోల్​బెల్ట్, వెలుగు: మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబం బాగుపడుతుందని కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మహిళల సంక్షేమం కోసం కాంగ్రెస్​ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రి, చెన్నూరు మండలాల్లో పర్యటించిన ఆయన మందమర్రి మండలం అందుగులపేటలో ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో పాల్గొన్నారు. మందమర్రి, జైపూర్ మండలాలకు చెందిన మహిళా సంఘాలకు రూ.17.21 కోట్ల బ్యాంక్ లింకేజీ లోన్లు, వడ్డీ లేని రుణాలు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌‌‌‌‌‌‌‌తో కలిసి పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఇస్తున్న లోన్లను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని మహిళలకు సూచించారు. మహిళా శక్తి పథకం కింద మహిళలకు క్యాంటీన్లు, ఎలక్ట్రిక్ బస్‌‌‌‌‌‌‌‌లు, పెట్రోల్ బంక్‌‌‌‌‌‌‌‌లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ పదేండ్ల పాలనలో మహిళలను పట్టించుకోకుండా మోసం చేసిందని ఫైర్ అయ్యారు. గత పాలకులు రేషన్ కార్డు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామంటూ మాయమాటలతో మోసం చేశారని, కానీ తమ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌‌‌‌‌‌‌‌ కార్డులు ఇస్తోందని తెలిపారు. 

సింగరేణి ఔట్​సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపుకు కృషి..

సింగరేణిలో పనిచేస్తున్న ఔట్​సోర్సింగ్ కార్మికుల కనీస వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా రాష్ట్ర సర్కార్ చర్యలు చేపట్టిందని వివేక్ వెంకటస్వామి అన్నారు. కనీస వేతనాల పెంపు అంశంపై సీఎం రేవంత్​రెడ్డి, సింగరేణి సీఎండీ బలరాం నాయక్‌‌‌‌‌‌‌‌తో చర్చించామన్నారు. గత బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ సర్కార్ కనీస వేతనాల గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఆదేశాలతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో గిగ్ వర్కర్లకు ప్రత్యేకంగా సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని, వారికి ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించేలా పాలసీ తీసుకురానున్నట్లు వెల్లడించారు. 

ఇందుకోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. అనంతరం మందమర్రి, జైపూర్ మండలాలకు చెందిన 161 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.14.80 కోట్లు, 1,031 సంఘాలకు రూ.2.35 కోట్లు వడ్డీ లేని రుణం, రూ.6,30,487 రుణ బీమా చెక్కులను అందజేశారు. అంతకు ముందు మంత్రికి మహిళలు కొలాటం, బతుకమ్మలతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, ఆర్డీవో శ్రీనివాస్​రావు, డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీవో కిషన్, సెర్ప్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్ కృష్ణమూర్తి, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, మందమర్రి, జైపూర్, భీమారం మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మందమర్రి, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. 

ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూ హామీల అమలు.. 

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ విధానాల వల్ల రాష్ట్రం అప్పుల పాలైనప్పటికీ సీఎం రేవంత్​రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూనే.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని వివేక్ వెంకటస్వామి అన్నారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు చేస్తున్నామని చెప్పారు. రూ.23 వేల కోట్లతో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. రైతు భరోసా కింద రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని వెల్లడించారు. రూ.9 వేల కోట్లతో సన్నబియ్యం పంపిణీ చేపట్టామని తెలిపారు. 

మరోవైపు, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని, చెన్నూరు నియోజకవర్గానికి 3,500 ఇండ్లు సాంక్షన్ చేశామని మంత్రి వెల్లడించారు. బేస్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ వరకు నిర్మించుకున్న దాదాపు వేయి మంది లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశామన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తుందని చెప్పారు. 12 ఏండ్ల కింద అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు తప్ప ప్రజలకు వేరే ఇండ్లు రాలేదని గుర్తుచేశారు. చెన్నూరు నియోజకవర్గంలో 3,882 కొత్త రేషన్ కార్డులు అందించనున్నామని, 8,340 మంది పేర్లను కొత్తగా కార్డుల్లో నమోదు చేశామని వెల్లడించారు.