- వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, వెలుగు : ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు, స్కానింగ్ కేంద్రాలు క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్-2010 ప్రకారం తప్పనిసరిగా రేట్ చార్టులను ప్రదర్శించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన పలు దరఖాస్తులను సమీక్షించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న కిరణ్ గ్యాస్ట్రో క్లినిక్, రవీంద్రబాబు హాస్పిటల్, హైందవ్ న్యూరో హాస్పిటల్ సహా మొత్తం మూడు ఆస్పత్రులు, మూడు క్లినిక్‌లు, ఒక డయాగ్నస్టిక్ సెంటర్, నాలుగు స్కానింగ్ కేంద్రాలకు ఆమోదం తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రులలో పార్కింగ్ వసతులు ఉండాలని, స్కానింగ్ కేంద్రాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ లింగ నిర్ధారణ పరీక్షలు చేయకూడదని స్పష్టం చేశారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ సాయినాథ్ రెడ్డి, డీఎస్పీ బాలాజీ నాయక్, ఇతర వైద్య అధికారులు పాల్గొన్నారు.
