వాటర్ ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్.. సిటీలో రోజుకు 8 వేల ట్యాంకర్ల బుకింగ్

వాటర్ ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్.. సిటీలో రోజుకు 8 వేల ట్యాంకర్ల బుకింగ్
  • మేలో 12 వేలకుచేరుతుందని అంచనా 
  • వెస్ట్​ సిటీలో గ్రౌండ్​ వాటర్​ లేక 
  • ట్యాంకర్ల వైపే చూపు  
  • రోజుకు 13 వేల ట్యాంకర్లయినా 
  • డెలివరీ చేసేలా వాటర్​ బోర్డు ప్లాన్
  • ఆలస్యం కాకుండా నోడల్​ఆఫీసర్ల నియామకం​

హైదరాబాద్​సిటీ, వెలుగు :  గ్రేటర్ లో నీటి ట్యాంకర్ల డిమాండ్​రోజు రోజుకూ డిమాండ్​పెరుగుతోంది. ముఖ్యంగా వెస్ట్​సిటీ వైపు నీటి కొరత మళ్లీ తీవ్ర రూపం దాలుస్తున్నది. ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో ఈసారి కూడా ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ట్యాంకర్ల బుకింగ్​లు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా మాదాపూర్​, కొండాపూర్​, మణికొండ, శేరిలింగంపల్లి, కూకట్​పల్లి, నానక్​రామ్​గూడ, ఎస్​ఆర్​నగర్​, జూబ్లీహిల్స్​ తదితర ప్రాంతాల నుంచి భారీగా బుకింగ్​లు జరుగుతున్నాయి. గత సంవత్సరం జనవరి లో 1,21,911 ట్యాంకర్లు బుక్​కాగా, ఫిబ్రవరిలో 1,83,805కు చేరింది. దీంతో అధికారులు రాత్రింబవళ్లు ట్యాంకర్ల సరఫరా చేయాల్సి వచ్చింది.

అయితే, ఈసారి కొంత తగ్గి  జనవరిలో 1,11,550 , ఫిబ్రవరిలో 1,39,456 ట్యాకర్లు బుక్​అయ్యాయి. మార్చి నుంచి ఏప్రిల్​2వ తేదీ వరకు 1,65,234 ట్యాంకర్ల బుక్​చేసుకున్నారు. ప్రస్తుతం రోజుకు 8వేల నుంచి 8500 ట్యాంకర్లు బుక్​అవుతుండగా, మే మాసం నాటికి రోజుకు 12వేలు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో డిమాండ్​ను తట్టుకునేందుకు వాటర్​బోర్డు సమ్మర్​ మేనేజ్​మెంట్​ప్లాన్​అమలు చేస్తోంది. ఇక నుంచి బుక్​చేసుకున్న 24 గంటల్లోగా ట్యాంకర్లను సరఫరా చేసే విధంగా సిద్ధమవుతోంది. గత ఏడాది కొందరు ట్యాంకర్ల నిర్వాహకులు ట్యాంకర్లను బ్లాక్​లో అమ్ముకోగా, ఈసారి అలా జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. 

వెస్ట్​ సిటీనే పెద్ద సమస్య

ప్రతి ఏడాది వెస్ట్​సిటీకి నీటి సరఫరా చేయడం వాటర్​బోర్డుకు తలనొప్పిగా మారుతోంది. ఐటీ కారిడార్, నానక్​రామ్​గూడ, గండిపేట, కొండాపూర్​,శేరిలింగంపల్లి, కూకట్ పల్లి వంటి ప్రాంతాల నుంచి రోజుకు 4500 నుంచి 6500 వరకూ ట్యాంకర్ల బుకింగ్​జరుగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలతో పోల్చుకుంటే మార్చిలో ఇప్పటికే వెస్ట్​సిటీ నుంచి 20 శాతం బుకింగ్​ పెరిగింది. ఇక ఈ నెల (ఏప్రిల్), మేలో ఈ ఏరియాల నుంచి రోజుకు 9 వేల వరకు ట్యాంకర్లు బుక్​అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో బోర్డుపై పెరిగే ఒత్తిడిని తట్టుకునేందుకు ప్లాన్​చేసుకుంటున్నారు. బోర్డుకు వచ్చే అత్యధిక ఆదాయం కూడా ఈ ప్రాంతాల నుంచే ఉండడంతో ప్రత్యేక దృష్టి పెట్టారు. 

నోడల్​ ఆఫీసర్ల నియామకం

వెస్ట్​సిటీలో ట్యాంకర్లను మేనేజ్​ చేసేందుకు కొందరు అధికారులను నోడల్​ఆఫీసర్లుగా నియమించారు. వీరు ప్రత్యేక బాధ్యతలు తీసుకుని ఈ 2 నెలల పాటు రాత్రింబవళ్లు ట్యాంకర్ల సరఫరా చేసేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా పగలు కంటే రాత్రి సమయాల్లో ఎక్కువ ట్యాంకర్లను నడపాలని నిర్ణయించారు. అలాగే ప్రస్తుతమున్న ఫిల్లింగ్​ స్టేషన్ల స్థానంలో మరికొన్ని టెంపరరీ ఫిల్లింగ్​పాయింట్లను ఏర్పాటు చేయాలని డిసైడ్​అయ్యారు. ట్యాంకర్ల సంఖ్యను కూడా 1135 నుంచి 1250కి పెంచడానికి ప్లాన్​చేశారు. నీటి నిల్వలకు కొదవ లేదని, కానీ ఆయా ప్రాంతాల నుంచి వస్తున్న ఒత్తడిని తట్టుకునేందుకే తాము ప్రణాళికలు రచిస్తున్నట్టు వాటర్​బోర్డు ఎండీ  అశోక్​రెడ్డి తెలిపారు. 

ట్యాంకర్​ ట్రాకింగ్​ యాప్​

ట్యాంకర్లు పక్కదారి పట్టకుండా వాటర్​బోర్డు అధికారులు ట్యాంకర్​ ట్రాకింగ్​ యాప్​ను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఈ యాప్​ద్వారా ఎవరైనా ట్యాంకర్ ​బుక్​ చేసుకుంటే స్టార్టయ్యిందా లేదా?  ఎక్కడ ఉంది? ఎక్కడిదాకా వచ్చింది అన్న వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే, ఫిల్లింగ్​ పాయింట్​వద్ద సీసీ కెమెరాలను అమర్చి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.  

వేసవిలో వాటర్​ ట్యాంకర్ల మేనేజ్​ మెంట్​ ఇలా

విషయం         మార్చి    ఏప్రిల్​
ఫిల్లింగ్​ స్టేషన్​లు    82    89
ఫిల్లింగ్​ పాయింట్స్​    129    143
ట్యాంకర్లు        1135    1250