ఎన్ని అడ్డంకులు వచ్చినా చెరువుల చెర విడిపిస్తం.. మూసీ ప్రక్షాళన చేసి తీరుతం: సీఎం రేవంత్ రెడ్డి

 ఎన్ని అడ్డంకులు వచ్చినా  చెరువుల చెర విడిపిస్తం.. మూసీ ప్రక్షాళన చేసి తీరుతం:  సీఎం రేవంత్ రెడ్డి
  • హైదరాబాద్​లో లేక్​ ఎకానమీ సృష్టిస్తం 
  • కబ్జాదారులను ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించం
  • మేం ప్రకృతిని రక్షిస్తుంటే తిట్లు , శాపనార్థాలా?
  • త్వరలోనే మూసీ పునరుజ్జీవం తొలి దశ పనులు
  • రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలు కలిసిరావాలి
  • నిన్నటి వరకు శిల్పారామం గురించే మాట్లాడుకున్నరు 
  • ఇప్పటి నుంచి తమ్మిడి కుంట విషయమే మాట్లాడుకుంటరు
  • తమ్మిడి కుంట ప్రారంభోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి
  • అభివృద్ధికి సహకరించిన నటుడు నాగార్జునకు సీఎం థ్యాంక్స్

 

హైదరాబాద్ , వెలుగు: హైదరాబాద్ మహా నగరంలో చెరువులను కబ్జా చేసి కోట్లు గడించిన కబ్జాదారులను,  రియల్ ఎస్టేట్ మాఫియాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, తనను ఎంతమంది తిట్టుకున్నా, శాపనార్థాలు పెట్టినా ప్రకృతిని కాపాడే పోరాటంలో ముందుంటానని సీఎం రేవంత్‌‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా చెరువుల చెర విడిపిస్తామని, మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని అన్నారు. హైదరాబాద్​లోని మాదాపూర్‌‌లో కబ్జాదారుల నుంచి విముక్తి కల్పించి హైడ్రా అభివృద్ధి చేసిన ‘తమ్మిడికుంట’ చెరువును సీఎం  బుధవారం సాయంత్రం  ప్రారంభించారు. 

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, హైడ్రా చేపట్టిన ఎన్-కన్వెన్షన్ కూల్చివేతలు సినీ నటుడు అక్కినేని నాగార్జున మనసుకు కొంత కష్టం, నష్టం కలిగించి ఉండవచ్చని, కానీ చనిపోయాక ఎవరూ డెబిట్ కార్డులు, ఆర్టీజీఎస్‌‌లతో పైకి డబ్బులు తీసుకెళ్లలేరన్నారు.  సంపాదించిన దాంట్లో సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలన్న సదుద్దేశంతో నాగార్జున పెద్ద మనసు చేసుకొని దాదాపు 2 ఎకరాల విలువైన స్థలాన్ని ప్రభుత్వానికి అందించారని ప్రశంసించారు. 

కార్యక్రమానికి ఆహ్వానించగానే షూటింగ్‌‌ రద్దు చేసుకొని  ప్రత్యేక విమానంలో వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 14 ఎకరాలున్న తమ్మిడికుంటను 30 ఎకరాల మహా సరస్సుగా మార్చేందుకు సహకరించిన నాగార్జున సినిమాల్లోనే కాక రియల్ లైఫ్​​లోనూ నిజమైన హీరోగా నిరూపించుకున్నారని  కొనియాడారు.  

ఎన్ని విమర్శలు వచ్చినా ప్రజా ప్రభుత్వం తలపెట్టిన ఈ పర్యావరణ మహాయజ్ఞం ఆగదని, హైదరాబాద్‌‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ జీవన ప్రమాణాలున్న నగరంగా తీర్చిదిద్ది తీరుతామని సీఎం రేవంత్‌‌రెడ్డి స్పష్టం చేశారు.

గత పాలకుల నిర్లక్ష్యమే..

హైదరాబాద్ నగరం పట్ల గత పాలకులు వ్యవహరించిన తీరుపై సీఎం రేవంత్‌‌రెడ్డి మండి పడ్డారు. "గతంలో చెరువులను చెరబట్టి అమ్ముకున్న దొంగలు, పాలకుల నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యం.. ఇవన్నీ కలిస్తేనే నేడు మూసీ మురికిగా మారింది. హైదరాబాద్‌‌లో చిన్నపాటి వర్షం వస్తే చాలు బస్తీలు మునిగిపోయి, పేదల ఇళ్లలోని టీవీలు, ఫ్రిజ్‌‌లు, నిత్యావసరాలు, పిల్లల చదువుల సర్టిఫికెట్లు మురుగునీటిలో కొట్టుకుపోతుంటే గత పాలకులకు చీమ కుట్టినట్లయినా అనిపించలేదా?" అని నిలదీశారు.

 ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 1,372 చెరువుల్లో సగానికి పైగా చెరువులు కబ్జాదారుల జేబుల్లోకి వెళ్లిపోయాయని మండిపడ్డారు. వరద నీరు వెళ్లే సహజ ఆవాసాలను ఆక్రమించి విల్లాలు, కాంక్రీట్ భవంతులు కడితే ప్రకృతి చూస్తూ ఊరుకోదని, అందుకే నీళ్లు మన రోడ్లను, బస్తీలను ముంచెత్తుతున్నాయని హెచ్చరించారు. కబ్జాల కోరల్లో చిక్కుకుని మెడికల్ వేస్ట్, చెత్తాచెదారంతో డంపింగ్ యార్డుల్లా మారిన 20 భారీ చెరువులను హైడ్రా ద్వారా ఇప్పటికే విముక్తి కల్పించామని, ఎన్ని శక్తులు అడ్డుపడినా మిగిలిన చెరువులనూ రక్షించి తీరుతామని తేల్చిచెప్పారు.

నల్గొండ జిల్లా ప్రజలకు శాపంగా మూసీ కాలుష్యం 

నల్లగొండ జిల్లా ప్రజల జీవితాలతో గత ప్రభుత్వాలు చెలగాటమాడాయని సీఎం  ఆగ్రహం వ్యక్తం చేశారు. "హైదరాబాద్ మురుగు, పరిశ్రమల విష వ్యర్థాలు, పశువుల కళేబరాలు, మనుషుల శవాలు నేడు మూసీ నదిలో తేలియాడుతున్నాయి. ఆ విషపు నీరు వాడపల్లి వరకు ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంటే.. ఆ నీటిని తాగుతున్న నల్లగొండ జిల్లా ప్రజల గతి ఏం కావాలి?" అని నిలదీశారు. ఒకప్పుడు ఫ్లోరైడ్ రక్కసితో పోరాడిన నల్లగొండ ప్రజలకు ఇప్పుడు మూసీ కాలుష్యం మరో శాపంగా మారిందని.. ఆ విష జలాల ప్రభావంతో అక్కడ  బిడ్డలు కన్ను వంకర, కాలు వంకర, చెయ్యి వంకర, నడుము వంకరులతో పుడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

  పుట్టే బిడ్డలు వికలాంగులుగా మారుతారన్న భయంతో కొత్తగా పెళ్లయిన జంటలు ఊళ్లు విడిచి పారిపోతున్న దౌర్భాగ్య స్థితి దాపురించిందన్నారు. అక్కడ పండిన వడ్లను, కూరగాయలను అక్కడి రైతులే విషమని తినలేక, మార్కెట్లో అమ్ముకుని బయటి నుంచి కొనుక్కుంటున్నారని తెలిపారు. మహాకవి సి.నారాయణరెడ్డి తన ముగ్గురు కుమార్తెలకు గంగ, యమున, సరస్వతి అని నదుల పేర్లు పెట్టుకున్నారని, మరి మన ప్రాంతంలో పారే మూసీ పేరును ఏ తల్లయినా తన బిడ్డకు పెట్టుకుందా? మూసీ అంటే రోత పుట్టే మురికి కాలువగా మార్చడం వల్లే  ఆ పేరు పెట్టుకోవట్లేదన్నారు.

సుందరీకరణ కాదు.. మూసీ పునరుజ్జీవం

 "ప్రకృతిని రక్షించేందుకు నేను ముందుకు వెళ్తుంటే.. నాపై కొందరు కోపంతో ఊగిపోతున్నారు, తిట్లు, శాపనార్థాలు పెడుతున్నారు. నాపై రాజకీయ దాడికి దిగుతున్నారు. కొందరికి రాజకీయ లబ్ధి కావాలి కాబట్టి ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తున్నారు. కానీ స్పష్టంగా చెబుతున్నా.. నాకేం ఫామ్‌‌హౌస్‌‌లు లేవు, నాకంటూ ఏ స్వార్థం లేదు. ఎవరి మీదా వ్యక్తిగత కక్షలు లేవు. హైదరాబాద్‌‌లోని 1.34 కోట్ల మందికి, నల్లగొండలోని 30 లక్షల మందికి స్వచ్ఛమైన జీవితాన్ని ఇవ్వడమే నా సంకల్పం" అని సీఎం స్పష్టంచేశారు. 

55 కిలోమీటర్ల మూసీ ప్రక్షాళనలో భాగంగా తొలి దశ కింద 21 కిలోమీటర్ల పనులకు అంతర్జాతీయ స్థాయి టెండర్ల ప్రక్రియ నడుస్తోందని, ఇది కేవలం రంగులద్దే సుందరీకరణ కాదని, నదికి జీవం పోసే అసలైన పునరుజ్జీవమని స్పష్టం చేశారు. బాధితులయ్యే ఏ ఒక్క పేదవాడికీ అన్యాయం జరగకుండా ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే ముందుకెళ్తామన్నారు. ఆరు నూరైనా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని సీఎం స్పష్టంచేశారు.

అభివృద్ధికి కలిసిరండి.. 

నగరాభివృద్ధి విషయంలో రాజకీయాలను పక్కనబెట్టాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌‌రెడ్డి, ఇతర విపక్ష నేతలకు సీఎం పిలుపునిచ్చారు. "విశ్వేశ్వర్‌‌రెడ్డి గారూ.. సిద్ధాంతాలు వేరైనా, మీది చదువుకున్న అభిప్రాయం.. నాది ప్రజా జీవితంలో గడించిన అనుభవం. ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు, సీట్ల పంచాయితీ చూసుకుందాం. అప్పుడు కొట్లాడుకుందాం. కానీ విశ్వనగర నిర్మాణంలో మాత్రం అందరం ఒకే వేదికపైకి రావాలి" అని విజ్ఞప్తిచేశారు. 

అమెరికాలో హడ్సన్, లండన్‌‌లో థేమ్స్, అహ్మదాబాద్‌‌లో సబర్మతి రివర్‌‌ఫ్రంట్ తరహాలోనే మూసీ పరీవాహక ప్రాంతాన్ని అంతర్జాతీయ వాణిజ్య, పర్యాటక కేంద్రంగా మారుస్తామన్నారు. చారిత్రక చార్మినార్, సాలార్‌‌జంగ్ మ్యూజియం, ఉస్మానియా, బ్రిటీష్ రెసిడెన్సీ, చూడీ బజార్ల ఘనతను ప్రపంచానికి చాటుతామన్నారు. 1908 వరదల తర్వాత నిజాం నవాబు మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహాతో గండిపేట, హిమాయత్‌‌సాగర్‌‌లను నిర్మించి నగరానికి ప్రాణం పోశారని, అదే స్ఫూర్తితో తాము మూసీని పునరుజ్జీవింపజేస్తున్నామని వివరించారు.

ఇకపై వర్క్​ ఫ్రం తమ్మిడికుంట..

నిన్నటివరకు హైటెక్ సిటీ, శిల్పారామం గురించే మాట్లాడుకున్న ప్రపంచం.. ఇకపై తమ్మిడికుంట వైపు చూస్తుందని సీఎం రేవంత్‌‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఐటీ ఉద్యోగులు నాలుగు గోడల మధ్యే కాకుండా ఆహ్లాదకరమైన సరస్సు పక్కన కూర్చుని ల్యాప్‌‌టాప్‌‌లతో పనిచేసుకునేలా 'వర్క్ ఫ్రమ్ తమ్మిడికుంట' వాతావరణాన్ని తీసుకొచ్చామన్నారు. ఈ సరస్సు పరిసరాల్లో భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని సైబరాబాద్ సీపీ, మున్సిపల్ కమిషనర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌‌లకు కరాఖండీగా ఆదేశాలు జారీ చేశారు.

 "సాయంత్రం వేళల్లో ఇక్కడికి వచ్చే ఆడబిడ్డలకు, కుటుంబాలకు వంద శాతం భద్రత ఉండాలి. పోకిరీలు, ఆకతాయిలు ఎవరైనా మహిళలను వేధించే ప్రయత్నం చేస్తే ఎంతటివారైనా సరే కఠినంగా వ్యవహరించండి, తోలు తీయండి" అని పోలీసులను ఆదేశించారు. సరస్సు ప్రాంగణంలోని 3.5 ఎకరాలను ‘ఇందిరా మహిళా శక్తి’ సంఘాలకు కేటాయించి రాత్రి వేళల్లో టీ, కాఫీ, చిరుతిళ్లు, నిత్యావసరాలు విక్రయించుకునేలా నైట్ మార్కెట్ ఎకానమీని సృష్టించాలన్నారు.

జమ్మి చెట్టు నాటండి.. 

నగరంలో స్థిరపడిన గ్రామీణ ప్రజలు తమ సంస్కృతిని కాపాడుకునేలా తమ్మిడికుంట వద్ద పెద్ద జమ్మి చెట్టును నాటి, దసరా నాడు అధికారికంగా అలాయ్ బలాయ్, పాలపిట్ట దర్శనం ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. సంక్రాంతి పండుగకు ఇక్కడి చల్లని గాలికి ఆకాశమంతా రంగురంగుల పతంగులు ఎగరేసేలా 'కైట్ ఫెస్టివల్' నిర్వహించాలని చెప్పారు. ఇదే క్రమంలో సరదాగా నవ్వులు పూయిస్తూ.. "పతంగులు ఎగరేయండి కానీ.. ఇక్కడ కోడిపందాలు మాత్రం పెట్టకండి. 

ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆంధ్రా నుంచి వచ్చిన రాజులు ఎక్కువయ్యారు. మళ్లీ వాళ్లు కోళ్లు పట్టుకొచ్చి పందాలు పెడితే అది కొత్త సమస్య అవుతుంది. కోసుకుని తినడానికి తెచ్చుకుంటే నాకేం అభ్యంతరం లేదు కానీ పందాలు మాత్రం వద్దే వద్దు" అంటూ సీఎం చమత్కరించారు. ఈ కార్యక్రమానికి హైడ్రా కమిషనర్​ రంగనాథ్​, సినీ నటుడు నాగార్జున, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

 

చెరువుకు పూర్వవైభవం తెస్తాం:హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్  

తమ్మడికుంట చెరువులాగే  ఇతర చెరువులను కబ్జాదారుల నుంచి కాపాడి, వాటికి పూర్వవైభవం తీస్తామని హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ స్పష్టంచేశారు. మాదాపూర్‌‌లో హైడ్రా ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన తుమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవ వేడుకలో ఆయన మాట్లాడారు. సిటీలో కబ్జాల బారిన పడిన జలవనరులను కాపాడటంలో హైడ్రా సాధించిన విజయాలు, తుమ్మిడికుంట అభివృద్ధి ప్రయాణాన్ని ఆయన వివరించారు. సుమారు రూ.20 కోట్ల వ్యయంతో తుమ్మిడికుంట చెరువును అత్యంత సుందరంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. చెరువులో పేరుకుపోయిన పూడికను పూర్తిగా తొలగించడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం, లోతు గణనీయంగా పెరిగాయని చెప్పారు. 

రంగనాథ్​ను తప్పుగా అర్థం చేసుకున్న

తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవంలో హీరో నాగార్జున

హైదరాబాద్​లో పర్యావరణాన్ని కాపాడేందుకు, ముఖ్యంగా చెరువుల పరిరక్షణను సీఎం రేవంత్​రెడ్డి సర్కారు చేస్తున్న కృషి అభినందనీయమని సినీ నటుడు నాగార్జున కొనియాడారు. తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘గతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌‌ను తప్పుగా అర్థం చేసుకున్నాం.  నేను తొలిసారి  రంగనాథ్​ను కలిసినప్పుడు నా మైండ్‌‌లో వేరే ఆలోచన ఉంది. కొంత అసంతృప్తితో వెళ్లాను. హైడ్రా ఆలోచనను నాకు రంగనాథ్​ వివరించారు. 

ఆ తర్వాతే నగర ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి ఏంటో నాకు అర్థమైంది. దీంతో సిటీ కోసం, పర్యావరణం కోసం మన వంతుగా ఏదైనా చేయాలనే నిర్ణయానికి వచ్చాను" అని పేర్కొన్నారు. సిటీలో చెరువుల అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఈ చెరువు పక్కనే సినిమా షూటింగులు నిర్వహిస్తానని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం చాలా గొప్పదని ప్రశంసించారు. త్వరలో చేపట్టబోయే మూసీ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాక ఆ  ప్రారంభోత్సవానికి కూడా తనను ఆహ్వానిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలో దాదాపు 2000 చెరువులను ఇలాగే పునరుద్ధరిస్తే సిటీకి అవసరమైన 42 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుందని, నగరానికి ఎప్పటికీ నీటి సమస్య రాదన్నారు.  

చెరువుల పరిరక్షణకు అందరూ ముందుకురావాలి: కొండా విశ్వేశ్వర్ రెడ్డి 

హైదరాబాద్ సిటీలో కబ్జాల బారిన పడుతున్న చెరువులను పరిరక్షించడం అత్యంత కీలకమైన పరిణామం అని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి  అన్నారు. దశాబ్దాలుగా మురికి కూపాలుగా మారిన జలవనరులను గుర్తించి, వాటికి పూర్వవైభవం తీసుకురావడం ద్వారా నగర ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. పార్టీలకు అతీతంగా నగర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.