డబ్బు, లిక్కర్​ను ఓడిస్తం

డబ్బు, లిక్కర్​ను ఓడిస్తం
  • మాజీ మంత్రి ఈటల హెచ్చరిక
  • ఆత్మగౌరవాన్ని గెలిపించుకుంటం
  • వీణవంకలో ఘన స్వాగతం పలికిన ప్రజలు, బీజేపీ లీడర్లు

వీణవంక, జమ్మికుంట, వెలుగు: చిల్లర రాజకీయాలు చేసే వాళ్లకు భవిష్యత్ ఉండదని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ‘‘నేను వస్తున్నానని తెలిసి అక్కడి పెద్ద దొరకు ఇక్కడ చిన్న దొర సన్నాయి పలుకులు పలుకుతున్నారు. మేం ఎవరి జోలికి వెళ్లం. మా జోలికి వస్తే ఊరుకునేది లేదు. మీకు దమ్ముంటే మీ మంచితనం గురించి చెప్పుకోవాలి” అని హెచ్చరించారు. మంగళవారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరులో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. డబ్బు, లిక్కర్‌‌‌‌ను తొక్కిపడేసి ఆత్మగౌరవాన్ని గెలిపించుకుంటామని పేర్కొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏం జరుగుతున్నదో విదేశాల్లో తెలిసేలా సత్తా చాటుతామని ధీమా వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తొలిసారి వీణవంకకు వచ్చిన ఈటలకు స్థానిక ప్రజలు, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.
జమ్మికుంటలోనూ ఘనస్వాగతం
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు జమ్మికుంట పట్టణంలో ఘన స్వాగతం లభించింది. వీణవంకకు వెళ్తూ.. జమ్మికుంటలో గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఈటల.. 
పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ ముస్లిం మహిళలు ఈటలపై పూలు చల్లి ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు చదువు రాజేందర్ రెడ్డి, ఎర్రబెల్లి సంపత్ రావు, మల్లేశ్, సంపత్ సంపత్ రావు, బీజేపీ మహిళా మోర్చా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈటలను అడ్డుకున్న పోలీసులు
వీణవంక మండలంలోని వల్బాపూర్ దగ్గర ఈటల రాజేందర్‌‌‌‌ను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన డీజేకి అనుమతి లేదంటూ ఎస్ఐ కృష్ణారెడ్డి అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నాయకులు ఎస్ఐ కారుకు ఎదురెళ్లారు. జై ఈటల అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.