రైతుల కోసం రూ. 500 కోట్లు ఖర్చు పెట్టలేరా?: షర్మిల 

రైతుల కోసం రూ. 500 కోట్లు ఖర్చు పెట్టలేరా?: షర్మిల 

మల్లాపూర్/ఇబ్రహీంపట్నం, వెలుగు:  రైతుల మేలు కోసం రూ. 500 కోట్లు ఖర్చు పెట్టి నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని వైఎస్సార్టీపీ ప్రెసిడెంట్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా శనివారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రాఘవపేట్ గ్రామం నుండి హుస్సేన్ నగర్, ముత్యంపేట్ మీదుగా యాత్ర నిర్వహించారు. ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ ముందు మహాధర్నా చేపట్టారు. ఇబ్రహీంపట్నం మండలం గోధూర్​లో మాట ముచ్చట కార్యక్రమంలో గ్రామస్తులతో చర్చించి సమస్యలను తెలుసుకున్నారు.

2014 ఎన్నికల సందర్భంగా వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్​రెడ్డి పాలనలో ఇన్​పుట్ సబ్సిడీ, ఎరువులపై, విత్తనాలపై సబ్సిడీ, పంట నష్టపరిహరం ఉండేవని కేసీఆర్ పాలనలో అవన్నీ కనుమరుగు చేశారన్నారు. రూ. 5 వేల రైతుబంధు ఇస్తూ.. రూ.40 వేలు ఇచ్చే పథకాలను పక్కనపెట్టారని విమర్శించారు. ఎనిమిదేళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్టీపీ అధికారంలోకి వస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయిస్తామన్నారు.