
గడిచిన పదకొండు ఏండ్ల ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ పరిపాలనలో దేశవ్యాప్తంగా ఎంతోమంది పౌర హక్కుల నాయకులను, మేధావులను, అకారణంగా సుదీర్ఘకాలం పాటు జైళ్లలో బంధించడం పరిపాటిగా మారింది. పౌర హక్కులను కాలరాస్తూ భారతదేశ జీవన విధాన విలువలైన భిన్నత్వంలో ఏకత్వం, లౌకిక వాదం, స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం వంటి విలువలను విస్మరిస్తున్నారు.
దేశానికి వెన్నెముకలా నిలిచే రైతుల హక్కుల పోరాటాలపై నిర్బంధాలు, లాఠీ చార్జీలు, విధిస్తూ రైతు సంఘాల నాయకులపై తీవ్రవాదులనే ముద్ర, మోదీ పదేళ్ల పరిపాలనలో నిత్య కృత్యం అయ్యాయి. ఆర్మీ రిక్రూట్మెంట్ ని అగ్నిపథ్ పేరు మీద నిరుద్యోగులను అబాసు పాలు చేయడం, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా బలమైన ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడానికి కుట్రలు చేస్తూ , రాష్ట్రాల పరిపాలన భాగస్వామ్యం లేకుండా రాష్ట్రాల హక్కులను కాలరాసే విధంగా వ్యవహరించారు.
జిఎస్టి, నీట్ లాంటివి ప్రవేశపెట్టడం, ఈడీ, సీబీఐ వంటి సెంట్రల్ ఏజెన్సీ సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని రాజకీయాలు నడపడం సరికాదు. క్విడ్ ప్రోకో చేసి ఎలక్ట్రో బ్రాండ్లు ఒకవైపు పేపర్ లీకేజీలు, ముఖ్యంగా ఓబీసీ, ఎస్సీ, మైనార్టీ విద్యార్థులకు విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించకుండా, పరిశోధనకు అందించాల్సిన ఫెలోషిపులు తీసివేయడం నియంతృత్వ నిర్ణయాలు, విధానాలు సరికావు.
11 సంవత్సరాల మోదీ పరిపాలన కాలంలో రూపాయి విలువ పడిపోవడం, జాతీయ స్థూల జాతీయ ఉత్పత్తి క్షీణించడం, నిత్యవసర ధరలు పెరుగుదల వంటివే కాకుండా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీలను విస్మరించారు. దేశంలో ప్రజాస్వామ్య పాలనను ప్రజలు కోరుకుంటున్నారు. నిర్బంధాలను వీడాలి. ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాలకు ప్రాధాన్యమివ్వాలి.
- వలిగొండ నరసింహ-