బ్రిక్స్+ దేశాల డిజిటల్ కరెన్సీ: డాలర్‌కి పోటీగా వస్తున్న ఈ కొత్త కరెన్సీ ‘యూనిట్’ ఏంటి ?

బ్రిక్స్+ దేశాల డిజిటల్ కరెన్సీ:  డాలర్‌కి పోటీగా వస్తున్న ఈ కొత్త కరెన్సీ ‘యూనిట్’ ఏంటి ?

గతేడాది రష్యాలో జరిగిన బ్రిక్స్ (BRICS) సమావేశంలో ఒక కొత్త నోటును ప్రదర్శించారు. ఇది కేవలం పేపర్  ముక్క కాదు, అమెరికా డాలర్‌తో సంబంధం లేని ఒక కొత్త ఆర్థిక వ్యవస్థను సృష్టించాలనే సంకల్పానికి ప్రతీక. దీనికి యూనిట్ (UNIT) అని పేరు పెట్టారు.

 అసలు ఏంటి ఈ  యూనిట్ ?
ఇది మనం రోజూ వాడే రూపాయలు లేదా డాలర్ల లాంటి కరెన్సీ కాదు. ఇది దేశాల మధ్య వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగపడే ఒక డిజిటల్ చెల్లింపు సాధనం. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా బంగారంకి  మద్దతుగా  దీని విలువలో 40% బంగారం మీద, 60% బ్రిక్స్ దేశాల కరెన్సీల మీద ఆధారపడి ఉంటుంది. ఇది బ్లాక్‌చైన్ అనే సురక్షితమైన డిజిటల్ పద్ధతిలో పనిచేస్తుంది. ఏ ఒక్క దేశం దీనిని కంట్రోల్ చేయదు. దీనివల్ల ఒక దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఈ యూనిట్ విలువ పెద్దగా పడిపోదు. అమెరికా 8134 టన్నులతో పోల్చితే 2024లో బ్రిక్స్+ దేశాల వద్ద దాదాపు 6143 టన్నుల బంగారం ఉంది.   చైనా, భారతదేశం కలిసి 2019 నుండి 2024 మధ్య అదనంగా 572.5 టన్నులను సేకరించాయి.

బ్రిక్స్+ దేశాల బలం ఎంత?
ఒకప్పుడు కేవలం ఐదు దేశాలతో అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాతో మొదలైన ఈ కూటమి, ఇప్పుడు బ్రిక్స్+ గా మారింది. ఇందులో ఇప్పుడు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, ఇరాన్ వంటి దేశాలు కూడా  చేరాయి. ప్రపంచ జనాభాలో సగం మంది ఈ దేశాల్లోనే ఉన్నారు. ఇంకా ప్రపంచంలోని బొగ్గులో 78%, గ్యాస్‌లో 36% ఈ దేశాల దగ్గరే ఉంది.

యూనిట్  డాలర్‌కు నిజంగా ముప్పేనా?
ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ వ్యాపారం చేయాలంటే అమెరికా డాలర్‌పైనే ఆధారపడుతున్నాయి. దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రూపాయలను డాలర్లుగా మార్చడానికి అదనపు ఛార్జీలు అవుతాయి. అదే యూనిట్ వస్తే ఆ ఖర్చు తప్పుతుంది. అమెరికాకు ఏదైనా దేశంపై కోపం వస్తే, డాలర్ వాడకుండా ఆంక్షలు విధిస్తుంది. అదే యూనిట్ వాడితే ఆ భయం ఉండదు.  అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు వస్తే ప్రపంచమంతా ప్రభావితం అవుతుంది. కానీ ఈ కొత్త పద్ధతి ఆ ప్రభావాన్ని తగ్గిస్తుంది.

డాలర్‌ను కాదని యూనిట్ వైపు వెళ్లడం అంత తేలిక కాదు. అన్ని దేశాలు ఈ కొత్త డిజిటల్ పద్ధతిని నమ్మాలి. దీనిని ఎలా వాడాలి అనే విషయంలో స్పష్టమైన చట్టాలు ఉండాలి. ఒకవేళ 'యూనిట్' వాడితే, అమెరికా ఆయా దేశాల మీద భారీ పన్నులు వేసే అవకాశం ఉంది. ఈ 'యూనిట్' అనేది ఒక గొప్ప ఆలోచన. ఇది నిజంగా అమల్లోకి వచ్చి సక్సెస్ అయితే, భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా ఆధిపత్యం తగ్గి, అన్ని దేశాలకు సమాన ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంది.