భారతీయులు భౌతిక బంగారం అంటే నగలు, నాణేలు, బార్లతో పాటు డిజిటల్ బంగారం, గోల్డ్ ETFలు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు, సావరిన్ గోల్డ్ బాండ్లు (SGB) ద్వారా బంగారంలో పెట్టుబడి పెడుతుంటారు. అయితే ఈ బంగారం లేదా వెండి అమ్మడం ద్వారా లాభం వస్తే, ప్రభుత్వం దానికి పన్ను విధిస్తుంది. అది కూడా మీరు ఏ రూపంలో అంటే నగలు, బాండ్లు, లేదా డిజిటల్ గా బంగారం కొన్నారు, ఎంతకాలం మీ దగ్గర పెట్టుకున్నారు అనే దానిపై ఈ పన్ను మారుతుంది. ఈ పన్ను రేట్లు ఎలా ఉంటాయంటే....
1. బంగారు నగలు, నాణేలు, వెండి సామాన్లు
రెండేళ్ల ఏళ్ల కంటే ఎక్కువ కాలం పాటు అంటే మీరు కొని రెండేళ్లు దాటితే, దాని పై వచ్చే లాభంపై 12.5% పన్ను కట్టాలి. గతంలో ఉన్న 'ఇండెక్సేషన్' సదుపాయం ఇప్పుడు లేదు. రెండేళ్ల ఏళ్ల లోపు అంటే బంగారం కొని రెండేళ్ల కంటే ముందే అమ్మేస్తే, ఆ లాభాన్ని మీ మొత్తం ఆదాయానికి కలిపి, టాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను వేస్తారు.
2. డిజిటల్ బంగారం & వెండి
వీటికి కూడా నగలకు వర్తించే నియమాలే అంటే రెండేళ్ల నిబంధన వర్తిస్తాయి. రెండేళ్ల దాటితే 12.5% పన్ను, 2 ఏళ్ల లోపు అయితే టాక్స్ స్లాబ్ రేటు ఉంటుంది.
3. గోల్డ్/సిల్వర్ ETFలు & మ్యూచువల్ ఫండ్స్
ఏడాది దాటితే లేదా మీరు ఒక సంవత్సరం తర్వాత అమ్మితే 12.5% పన్ను పడుతుంది. 1 ఏడాది లోపు అమ్మితే ఇన్కమ్ టాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను కట్టాలి.
4. సావరిన్ గోల్డ్ బాండ్లు (SGB) :
బంగారం పెట్టుబడుల్లో వీటికి పన్ను ప్రయోజనాలు ఎక్కువ. ఏటా వచ్చే 2.5% వడ్డీకి మాత్రం మీ స్లాబ్ ప్రకారం పన్ను కట్టాలి. మెచ్యూరిటీ వరకు ఉంటే అంటే 8 ఏళ్ల తర్వాత బాండ్ గడువు ముగిశాక మీరు తీసుకునే లాభంపై ఒక్క రూపాయి కూడా పన్ను కట్టక్కర్లేదు. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఒక ఏడాది తర్వాత అమ్మితే 12.5%, అంతకంటే ముందే అమ్మితే స్లాబ్ ప్రకారం పన్ను పడుతుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే మనము బంగారం కొనేటప్పుడే 3% GST కడతాము. కాబట్టి అమ్మేటప్పుడు GST కట్టక్కర్లేదు. కొన్నాక కొన్ని నెలల తేడాతో అమ్మినా పన్ను భారం పెరగొచ్చు. ఉదాహరణకు, ఏదైనా నగలను 24 నెలల లోపు అమ్మితే ఎక్కువ పన్ను పడే అవకాశం ఉంది. ఇప్పుడు చాలా రకాల బంగారం పెట్టుబడులపై దీర్ఘకాలిక పన్ను (LTCG) 12.5% గా ఉంది.
