హిట్ అయితే హీరో అకౌంట్లోకి..ఫట్ అయితే డైరెక్టర్ అకౌంట్లోకి..

హిట్ అయితే హీరో అకౌంట్లోకి..ఫట్ అయితే డైరెక్టర్ అకౌంట్లోకి..

సినిమా తీయాలంటే.. కథలో హీరో, హీరోయిన్ల నటనకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో... సినిమాని తెరకెక్కించే దర్శకునికి అంతకుమించి ఉంటుంది. కానీ మన తెలుగు ఇండస్ట్రీలో అలా కాదు. సినిమా హిట్ అయితే హీరో అకౌంట్లోకి..సినిమా ఫట్అయితే డైరెక్టర్ అకౌంట్లోకి వెళ్తుంది. ఇదేదో బయట అభిమాన సంఘాలంటే మామూలు విషయమే. కానీ మెగాస్టార్ లాంటివాళ్లు సైతం పదే పదే ఇదే కామెంట్ చేస్తుండటం పలు విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మూసధోరణి సినిమాలవైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. 

ప్రేక్షకులతో పాటు హీరోలు కూడా ఇప్పుడు ఇదే మాట మాట్లాడుతున్నారు. ఇటీవల బ్రహ్మాస్త్రం ప్రెస్ ఈవెంట్కి  ముఖ్య అతిథిగా హాజరైన జూనియర్ ఎన్టీఆర్.. ప్రపంచ సినిమా ఇండస్ట్రీ అంతా ప్రెజర్ లో ఉందన్నాడు. ప్రస్తుతం ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. ఇక డైరెక్టర్లు హీరో, హీరోయిన్లపై కాకుండా.. కథలపై దృష్టిపెట్టాలని మెగాస్టార్ చిరంజీవి పలుసార్లు చెప్పారు. అయితే హీరోలు ఇలా కామెంట్ చేస్తుండటంతో కొంతమంది దర్శకులు ప్రత్యారోపణలు చేస్తున్నారు. బడాహరోలకు భయపడి బహిరంగంగా మాట్లాడకున్నా... సినిమాలు హిట్ అయినప్పుడు వారి అకౌంట్లో వేసుకునే హీరోలు... అదే సినిమా ఆకట్టుకోలేకపోతే మాత్రం దర్శకులని విమర్శించడం కరెక్ట్ కాదంటున్నారు. 

చాలా సినిమాల విషయాల్లో స్టార్టింగ్ లో అనుకున్న స్టోరీకి రిలీజ్ అయ్యేలోపు ఎన్నో మార్పులు చెయ్యాల్సి వస్తోందని డైరెక్టర్స్ చెబుతున్నారు. ఇందుకు కారణం అయా హీరోల ఇన్వాల్మెంట్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమాల్లో డైరెక్టర్ చెప్పిందికాకుండా.. తమ ఇమేజ్ కోసం స్టోరీలో మార్పులు చేయమని కొందరు హీరోలు మెలిక పెడుతున్నారట. ఇక ఆచార్య మూవీ స్టోరీ విషయంలోనూ ఇదే కామెంట్స్ వినిపించాయి. 

కొంతకాలంగా టాలీవుడ్లో తరుచూ వినిపిస్తున్న మాట థియేటర్లకి జనాలు రావట్లేదని. కానీ ఇటీవల విడుదలైన బింబిసార, సీతారామం, కార్తికేయ-2 వంటి సినిమాలకి జనాలు క్యూ కట్టారు. ఇందుకు కారణం ఆయా సినిమాల్లో కంటెంట్ మంచిగుండటమే. దీంతో ఏ సినిమా బ్లాక్ బాస్టర్ కావాలన్నా... హీరో ఇమేజ్ కంటే ఎక్కువగా.. కథ, కథనమే ప్రధానం. ప్రేక్షకులు కూడా మూసధోరణి సినిమాలు కాకుండా కొత్తదనాన్నే కోరుకుంటున్నారు.