కేసీఆర్ను అసెంబ్లీకి తీసుకురా : ఆది శ్రీనివాస్

కేసీఆర్ను అసెంబ్లీకి తీసుకురా :  ఆది శ్రీనివాస్
  • అన్నింటికి ప్రభుత్వం జవాబిస్తది
  • హరీశ్​కు విప్ ఆది శ్రీనివాస్ సూచన

హైదరాబాద్, వెలుగు: పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై బీఆర్ఎస్ తప్పుడు కామెంట్లు చేస్తున్నదని, వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు కేసీఆర్ ను అసెంబ్లీకి తీసుకొచ్చి మాట్లాడించాలని హరీశ్ రావుకు విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ‘పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై హరీశ్ రావు.. తెలంగాణ భవన్ లో గొంతుచించుకొని విమర్శించాల్సిన అవసరం లేదు. ఈ రిపోర్టుపై అన్ని పార్టీల అభిప్రాయం తెలుసుకునేందుకే త్వరలో అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని చర్చకు పెడ్తాం. 

హరీశ్ చేసే విమర్శలన్నింటికీ అసెంబ్లీలో ప్రభుత్వం సమాధానం చెప్తది. జ్యుడీషియల్ కమిషన్ రిపోర్టును సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ రిపోర్టుగా హరీశ్ పేర్కొనడం సరికాదు. ఇది ఏకపక్షంగా ఇచ్చిన రిపోర్టు అసలే కాదు. కేసీఆర్, హరీశ్ తో పాటు ఎంతో మంది వాదనలు విన్న తర్వాత ఇచ్చిన రిపోర్టు అనే విషయం హరీశ్ మరిచిపోవద్దు. మేడిగడ్డ ఎందుకు కూలిపోయిందో.. తుమ్మిడిహెట్టి దగ్గర కాకుండా వేరేచోట బ్యారేజ్ లు ఎందుకు నిర్మించారో చెప్పకుండా ఘోష్ రిపోర్టుపై విమర్శలు చేయడం ఏంటి?’’అని విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు.