ఎవరీ నిర్మలానందనాథ స్వామిజీ.. డీకే శివకుమార్ కు మద్దతు వెనక కారణాలు ఏంటీ..?

ఎవరీ నిర్మలానందనాథ స్వామిజీ.. డీకే శివకుమార్ కు మద్దతు వెనక కారణాలు ఏంటీ..?

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ సీఎం పదవి మార్పుపై అంచనాలు పెరుగుతుండటంతో  ప్రముఖ వొక్కలిగ మత గురువు నిర్మలానందనాథ స్వామీజీ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు బహిరంగంగా మద్దతు తెలిపారు. శివకుమార్ నెక్స్ట్ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం నా అభిప్రాయం మాత్రమే కాదు.. మొత్తం వొక్కలిగ సమాజం కోరిక అని అన్నారు.

2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య అలాగే ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య చెరొక రెండున్నర ఏళ్ళ పాటు సియం పదవిలో ఉండేలా ఒప్పందం జరిగిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు 2.5 సంవత్సరాలు పూర్తవడంతో సీఎం మార్పు జరగవచ్చునని అందరూ అనుకుంటున్నారు. అయితే శివకుమార్ వొక్కలిగ కమ్యూనిటీకి చెందిన ముఖ్య నాయకుడు. కర్ణాటకలోని మైసూర్ ప్రాంతంలో ఈ వర్గానికి చాలా బలం ఉంది.

ALSO READ : ఎయిర్ ప్యూరిఫైయర్లపై GST ఎత్తేయండి

ఆదిచుంచనగిరి మఠం పీఠాధిపతి అయిన నిర్మలానందనాథ స్వామీజీ మాట్లాడుతూ ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను నేను మీడియాలో చూస్తున్నాను. ఈ మఠం వొక్కలిగ సమాజానికి పెద్ద నమ్మకమైన కేంద్రం. 2023 ఎన్నికల్లో మా కమ్యూనిటీకి చెందిన వ్యక్తి సీఎం అవుతారని ఆశతో ప్రజలు ఓటు వేశారు, అప్పుడు జరగలేదు. ఇప్పుడు రెండున్నర సంవత్సరాల తర్వాత జరుగుతుందని మళ్ళీ ఆశ పుట్టింది. ఒకవేళ ఈసారి కూడా జరగకపోతే, వేల మంది మా భక్తులు బాధపడతారు. కాంగ్రెస్ హైకమాండ్ సరైన నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నాను అన్నారు. 

నిర్మలానందనాథ స్వామీజీ ఎవరు ?
నిర్మలానందనాథ 20 జూలై  1969న  కర్ణాటకలోని తుమకూరులో జన్మించారు. అయన ప్రస్తుతం శ్రీ ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠానికి 72వ, ప్రస్తుత పీఠాధిపతి. అలాగే ఆదిచుంచనగిరి విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్ &  శ్రీ ఆదిచుంచనగిరి శిక్షణా ట్రస్ట్ అధ్యక్షుడు. దాదాపు 500కు పైగా విద్యా సంస్థలను పర్యవేక్షిస్తున్నారు. నిర్మలానందనాథ సివిల్ ఇంజనీరింగ్‌లో బి.ఇ, చెన్నై ఐఐటీ నుండి ఎం.టెక్ (M.Tech), గుల్బర్గా విశ్వవిద్యాలయం నుండి తత్వశాస్త్రంలో పిహెచ్‌డి (Ph.D) పట్టా పొందారు.