తప్పు చేసినట్లు నిరూపిస్తే జార్ఖండ్ వదిలి వెళ్లిపోతా : ఈడీకి సోరెన్ సవాల్

తప్పు చేసినట్లు నిరూపిస్తే జార్ఖండ్ వదిలి వెళ్లిపోతా : ఈడీకి సోరెన్ సవాల్

జార్ఖండ్ అసెంబ్లీకి హాజరయ్యారు మాజీ సీఎం హేమంత్ సోరెన్. ఈడీ అరెస్ట్ తర్వాత.. కోర్టు అనుమతితో సభకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన హేమంత్ సోరెన్.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.. ఈడీ తీరును తప్పుబట్టారు. మనీ ల్యాండరింగ్ ద్వారా స్థలం కొనుగోలు చేసినట్లు ఈడీ నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. అసలు జార్ఖండ్ లోనే ఉండనని సవాల్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగానే దర్యాప్తు సంస్థలతో.. నాపై దాడి చేయిస్తుందని.. జార్ఖండ్ ప్రజలకు అన్నీ తెలుసు అన్నారాయన. 

భూముల కొనుగోలుపై ఈడీ ఎన్నో ప్రశ్నలు వేస్తుందని.. సరైన ఆధారాలు, సాక్ష్యాలు చూపించలేకపోతుందని.. అవినీతి చేసినట్లు ఈడీ నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు సోరెన్. కోర్టుల్లో న్యాయం జరుగుతుందని.. ఆ నమ్మకం ఉందని.. జర్ఖండ్ ముక్తి మోర్చా ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. సభలో మాట్లాడిన సోరెన్.. ఎమోషన్ అయ్యారు. ఎలాంటి తప్పు చేయకుండానే.. ఢిల్లీ పెద్దల డైరెక్షన్ లో ఈడీ పని చేస్తుందని.. అలాంటి పార్టీలకు రాబోయే రోజుల్లో ప్రజలు గడ్డి పెట్టటం ఖాయం అన్నారా సోరెన్. 

భూ కుంభకోణంలో కేసులో ఈడీ అరెస్ట్ చేయటం వెనక.. జార్ఖండ్ గవర్నర్ పాత్ర కూడా ఉందని అసెంబ్లీలో ఆరోపించారు సోరెన్. భూ కుంభకోణంతో తనకు సంబంధం ఉందని నిరూపించాలంటూ.. సభ ద్వారా ఈడీకి సవాల్ చేయటం సంచలనంగా మారింది.