సౌతాఫ్రికాతో జరగబోయే రెండో టెస్టుకు టీమిండియాకు బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తుంది. భారత కెప్టెన్ శుభమాన్ గిల్ రెండో టెస్టుకు దూరం కానున్నట్టు సమాచారం. బుధవారం (నవంబర్ 19) అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రేపు (నవంబర్ 19) జట్టుతో కలిసి గిల్ గౌహతికి ప్రయాణించడం లేదని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) వర్గాలు ధృవీకరించాయి. గిల్ తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతున్నాడని, మెడకు ఇంకా పట్టీ ఉందని తెలిపాయి. ‘గిల్‌కు మరో మూడు నుంచి నాలుగు రోజులు పూర్తి విశ్రాంతి అవసరం. విమాన ప్రయాణాలు చేయవద్దని సూచించారు.
గౌహతి వేదికగా రెండో టెస్ట్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ ఓడిపోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న టీమిండియా రెండో టెస్ట్ గెలవడం చాలా కీలకం. గౌహతి టెస్టుల్పో గెలిస్తేనే ఇండియా సిరీస్ సమం చేసుకుంటుంది. లేకపోతే 0-2 తేడాతో సిరీస్ కోల్పోయి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో వెనకపడుతుంది. గిల్ దూరం కావడం దాదాపు కన్ఫర్మ్ కావడంతో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ టీమిండియాను నడిపించనున్నాడు. కెప్టెన్ గా పంత్ కు ఇదే తొలి టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. ఇక గిల్ స్థానంలో తుది జట్టులోకి ఎవరు వస్తారనే విషయంలో ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతుంది.
పడికల్ కు ఛాన్స్:
గిల్ అందుబాటులో లేకపోతే తుది జట్టులోకి దేవదత్ పడిక్కల్‌ను తీసుకునే అవకాశం ఉంది. తొలి టెస్టులో సాయి సుదర్శన్ స్థానంలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన వాషింగ్ టన్ సుందర్ టీమిండియా టాప్ స్కోరర్. సాయి సుదర్శన్ కు నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన అనుభవం లేదు. మరోవైపు పడికల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయగలడు. దీంతో సుదర్శన్ కంటే పడికల్ వైపే జట్టు యాజమాన్యం మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. స్వదేశీ పిచ్ లపై పడికల్ అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడని పేరుంది. సోమవారం ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పడికల్, సుదర్శన్ లతో చాలాసేపు మాట్లాడాడు.
►ALSO READ | రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్–డి మ్యాచ్లో హైదరాబాద్ 121 ఆలౌట్
అసలేం జరిగిందంటే..?
శనివారం (నవంబర్ 15) రెండో రోజు ఆటలో భాగంగా గిల్ కు గాయమైంది. వాషింగ్ టన్ సుందర్ కు ఔటైన తర్వాత నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన గిల్.. మూడో బంతికే ఫోర్ కొట్టి పరుగుల ఖాతా తెలిచాడు. బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా స్వీప్ షాట్ ఆడడంతో గిల్ మెడ నొప్పితో ఇబ్బందిగా కనిపించాడు. రాహుల్ తో కాసేపు చర్చించిన ఈ టీమిండియా కెప్టెన్ గ్రౌండ్ వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గిల్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరాగాల్సి వచ్చింది. గిల్ రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ కు చేరడంతో అతని స్థానంలో పంత్ బ్యాటింగ్ కు వచ్చాడు. రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగిన గిల్.. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు రాలేదు.ఆ తర్వాత గిల్ కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేరాడు.
