- ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుతో సంతోష్‌రావు సీక్రెట్ మీటింగ్స్
- నియోజకవర్గాల వారీగా నిఘాపెట్టాల్సిన ప్రత్యర్థుల పేర్లతో స్లిప్పుల అందజేత
- వాట్సాప్ కాలింగ్, సిగ్నల్, స్నాప్ చాట్‌తో ముఖ్య నేత తరఫున ఆదేశాలు
- కేవలం నిఘా పెట్టాలని చెప్పాం తప్ప ట్యాపింగ్ చేయమన్లేదు
- సిట్ ముందు సంతోష్‌రావు స్టేట్మెంట్.. ఏడున్నర గంటలపాటు విచారణ
- ఎవరి ఆదేశాల మేరకు ట్యాపింగ్ చేశారనే కోణంలో ప్రశ్నించిన అధికారులు
- ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు స్టేట్మెంట్లు, టెక్నికల్ ఎవిడెన్స్ ముందుపెట్టి ప్రశ్నలు
హైదరాబాద్, వెలుగు: ప్రగతిభవన్ కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్వ్యూహాలు నడిచాయని, పై నుంచి వచ్చిన ఆదేశాలకనుగుణంగానే ఈ వ్యవహారంలో సంతోష్‌రావు చక్రం తిప్పారని సిట్ విచారణలో తేలింది. ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు సహా ప్రణీత్‌రావు, రాధాకిషన్ రావుతో తాను పలుమార్లు సమావేశమై, ప్రత్యర్థులపై నిఘా కోసం స్లిప్పులు అందించిన మాట వాస్తవమని, కానీ ఫోన్ ట్యాపింగ్ చేయాలని ఎప్పుడూ చెప్పలేదని సంతోష్‌రావు వెల్లడించినట్లు తెలిసింది. ఈ మేరకు మంగళవారం సిట్ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసింది.
ఏడున్నర గంటల పాటు విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు అందుకున్న సంతోష్‌రావు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్‌లోని సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వెనుక ఎవరు కీలకంగా ఉన్నారనే కోణంలో ఐదుగురు సభ్యులతో కూడిన సిట్ బృందం.. రాత్రి 10.30 గంటల దాకా సుమారు ఏడున్నర గంటలపాటు ఆయనను విచారించింది. ఈ సందర్భంగా సంతోష్‌రావుకు పలు కీలక ప్రశ్నలు సంధించింది.
‘బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ట్యాపింగ్వ్యవహారంలో మీ పాత్ర కీలకంగా ఉన్నట్లు గుర్తించాం.. ఎస్వోటీ ఏర్పాటు మొదలుకొని ఎస్‌ఐబీ లాగర్రూం ధ్వంసం చేసే దాకా మీ సూచనల మేరకే నడుచుకున్నట్లు నిందితులు కూడా అంగీకరించారు.. ట్యాప్చేయాల్సిన వారి వివరాలను సైతం ఎప్పటికప్పుడు ప్రభాకర్‌రావు, ప్రణీత్రావులకు మీరే పంపించినట్లు చెప్పారు.. వారంతా మీకే రిపోర్ట్చేసేవారు.. ఇదంతా మీరు ఎవరి ఆదేశాలమేరకు చేశారు? మీ వెనుక ఉన్నది ఎవరు? ’ అని అడిగినట్లు తెలిసింది.
హోంశాఖకు సంబంధించిన వివరాలను తనను ఎందుకు అడుగుతున్నారంటూ మొదట సంతోష్ తప్పించుకునే ప్రయత్నం చేయగా, సిట్ అధికారులు సంతోష్‌రావు కాల్ డిటెయిల్ రికార్డులు(సీడీఆర్), ఇంటర్నెట్ ప్రొటోకాల్ డేటా రికార్డ్స్ (ఐపీడీఆర్), వాట్సాప్ డేటా, చాటింగ్స్, తదితర ఆధారాలను ముందరపెట్టి ప్రశ్నలు అడగడంతో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పక తప్పలేదు.
స్లిప్పుల రూపంలో సమాచారం ఇచ్చేవాడిని..
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సిట్ఎదుట విచారణ సందర్భంగా సంతోష్‌రావు పలు కీలక అంశాలు వెల్లడించినట్లు తెలిసింది. పొలిటికల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం వివిధ ఉప ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన బలాబలాలను ప్రగతి భవన్లో ప్రభాకర్‌రావుతో చర్చించామని, ఈ సమాచారాన్ని స్లిప్స్ రూపంలో ఆయనకు అందించి, బీఆర్ఎస్వీక్గా ఉన్నచోట్ల ప్రత్యర్థులపై నిఘా పెట్టాలని ఆదేశించామని సంతోష్‌రావు అంగీకరించారు. ప్రత్యర్థుల కదలికలపై నిఘా పెట్టుమని చెప్పామే తప్ప ఫోన్ట్యాపింగ్చేయాలని ఎప్పుడూ ఆదేశించలేదని స్పష్టంచేసినట్లు తెలిసింది.
ఈ విషయాలపై అధికారులతో తాను కేవలం వాట్సాప్ , సిగ్నల్, స్నాప్ చాట్ లాంటి సోషల్ మీడియా యాప్స్‌లో మాత్రమే మాట్లాడేవాడినని, అధికారులకు తానెప్పుడూ ఫోన్‌నంబర్లను నేరుగా పంపించలేదని అన్నట్లు సమాచారం. అలాగే ప్రత్యర్థుల దగ్గర పట్టుబడిన క్యాష్ గురించి పలు సందర్భాల్లో మాట్లాడుకున్నామని సంతోష్ రావు సిట్ విచారణలో ఒప్పుకున్నట్లు తెలిసింది.
6 వేల ప్రొఫైల్స్ ఎందుకు.. ఆ అవసరం ఎవరికుంది..?
రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేయడం ద్వారా రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి తిరుగులేకుండా చేసేందుకే ఎస్‌ఐబీ ఆపరేషన్లు నిర్వహించినట్లు ఇప్పటికే ప్రధాన నిందితులైన పోలీస్ అధికారులు సిట్‌ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేతలు, సొంత పార్టీలోని అసంతృప్తుల ఫోన్లు ట్యాపింగ్చేసినట్లు, ఆర్థిక వనరులే లక్ష్యంగా వ్యాపారవేత్తల వ్యక్తిగత వివరాలతో ప్రొఫైలింగ్ చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. దాదాపు 4,200కు పైగా ఫోన్ నంబర్లు సహా 6 వేల ప్రొఫైళ్లను క్రియేట్ చేసినట్లు బయటపడింది. ఇవే కాకుండా ప్రణీత్‌రావు టీమ్ ధ్వంసం చేసిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ హార్డ్ డిస్కుల్లో మరో 2 వేలకు పైగా ఫోన్ నంబర్లు, వ్యక్తిగత సమాచారం ఉన్నట్లు సిట్ గుర్తించిన సంగతి తెలిసిందే. ఎస్‌ఐబీ పొలిటికల్ వింగ్ తయారు చేసిన చాలా ప్రొఫైల్స్.. సంతోష్‌రావు అందించిన ఫోన్ నంబర్లు కూడా ట్యాపింగ్ లిస్టుతో మ్యాచ్ అయినట్లు సిట్ గుర్తించింది. ‘ఈ సమాచారం అంతా మీ ద్వారానే నిందితులకు చేరినట్లు మా దర్యాప్తులో తేలింది.. ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా చేశారు, ఇన్ని ఫోన్లను ట్యాపింగ్చేయాల్సిన అవసరం ఏంటి? దీని ద్వారా ఎవరికి లాభం? ’ అనే కోణంలో సంతోష్‌రావును సిట్ అధికారులు గట్టిగా ప్రశ్నించినట్లు తెలిసింది.
కాగా, తాము కేవలం ఆయా వ్యక్తులపై నిఘా పెట్టుమని చెప్పామే తప్ప వారి ఫోన్లు ట్యాపింగ్చేయమని చెప్పలేదని సంతోష్ మరోసారి చెప్పినట్లు సమాచారం. మాజీ సీఎం కేసీఆర్ ను ఆత్మలా అంటిపెట్టుకొని ఉండే సంతోష్‌రావు పదేండ్ల పాటు పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో అత్యంత కీలకంగా వ్యవహరించారు. పై నుంచి వచ్చే ఆదేశాల మేరకు ఫోన్ట్యాపింగ్ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించినట్లు సిట్నిర్ణయానికి వచ్చింది.
ఇవాళ (జనవరి 28) సిట్ కీలక భేటీ
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా సంతోష్‌రావు స్టేట్‌మెంట్ల ఆధారంగా సిట్ తదుపరి విచారణకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ సీపీ, సిట్ చీఫ్ సజ్జనార్ నేతృత్వంలో బుధవారం కీలక సమావేశం నిర్వహించనుంది. సిట్ దర్యాప్తు ప్రారంభించిన నాటి నుంచి సేకరించిన ఆధారాలు, సాక్షులు, బాధితులు ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా చట్టపరంగా ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది. కాగా, ఈ ముగ్గురిని మరోసారి విచారించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
