కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని పెంచే లక్ష్యంతో 'పీఎం ఈ-డ్రైవ్' అనే కొత్త పథకాన్ని ప్రకటించింది. దీని కింద 2వేల కోట్ల ఖర్చుతో దాదాపు 72 వేల పబ్లిక్ EV ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఛార్జింగ్ స్టేషన్లను ముఖ్యంగా ఎక్కువ రద్దీ ఉండే ప్రాంతాలలో అంటే 50 జాతీయ రహదారి కారిడార్లు, మెట్రో నగరాలు, టోల్ ప్లాజాలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, పెట్రోల్ బంకులు, రాష్ట్ర రహదారుల్లో ఏర్పాటు చేయనున్నారు.
కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి వివిధ మంత్రిత్వ శాఖల (పెట్రోలియం, రోడ్డు రవాణా & భారీ పరిశ్రమలు) అధికారులతో కలిసి ఈ పథకం అమలు వేగవంతం చేయాలన్నారు.
ఈ పథకం కోసం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) ఒక నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. EV వినియోగదారుల కోసం BHEL ఒక డిజిటల్ సూపర్ యాప్‌ను అభివృద్ధి చేయనుంది.ఈ యాప్ ద్వారా రియల్-టైమ్ స్లాట్ బుకింగ్ (ఛార్జింగ్ కోసం టైం కేటాయించుకోవడం), ఆన్‌లైన్ పేమెంట్స్, ఛార్జర్ లభ్యత తెలుసుకోవడం వంటి సదుపాయాలు లభిస్తాయి.
మంత్రి కుమారస్వామి మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా భారతదేశం సుస్థిర రవాణాకు (Sustainable Transportation) ప్రపంచ నమూనాగా మారుతుందని, ప్రజలకు చౌకైన, సౌకర్యవంతమైన ఎలక్ట్రిక్ మొబిలిటీ అప్షన్స్ అందుబాటులోకి వస్తాయని అన్నారు.
ఈ పథకం శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం, వాహనాల కాలుష్యాన్ని తగ్గించడం, దేశీయ EV తయారీని ప్రోత్సహించడం, దేశవ్యాప్తంగా EVలకు మౌలిక సదుపాయాల వ్యవస్థను ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం.
