- రాష్ట్రంలో 9 ఏండ్ల కనిష్టానికి పడిపోయిన రాత్రి టెంపరేచర్లు
- మూడు జిల్లాల్లో 7 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు
- ఆరు జిల్లాల్లో 8, నాలుగు జిల్లాల్లో 9 డిగ్రీలు రికార్డు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చలి విపరీతంగా పెరిగిపోతున్నది. రాత్రి ఉష్ణోగ్రతలతో పాటు పగటిపూట టెంపరేచర్లు దారుణంగా పడిపోతున్నాయి. ఆదివారం రాత్రి ఉష్ణోగ్రతలు గత 9 ఏండ్ల కనిష్టానికి పడిపోయాయి. దీంతో కోల్డ్ వేవ్ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. 2016 నవంబర్ 20న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవ్వగా.. తాజాగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లోనూ 7 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లోనూ 7.1 డిగ్రీలకు రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో 8 డిగ్రీలు, నాలుగు జిల్లాల్లో 9 డిగ్రీల రేంజ్‌లో టెంపరేచర్లు నమోదయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 7.7 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా నాగారంలో 8.1, రంగారెడ్డి జిల్లా మంగళపల్లిలో 8.2, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 8.4, కామారెడ్డి జిల్లా బీబీపేటలో 8.5, సిద్దిపేట జిల్లా బేగంపేటలో 8.6, నిజామాబాద్ జిల్లా మదనపల్లిలో 8.9, జగిత్యాల జిల్లా గోవిందారంలో 9, మెదక్ జిల్లా సార్ధానలో 9.3, నిర్మల్ జిల్లా కుంటాలలో 9.4, మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో 9.9, నారాయణపేట జిల్లా కొత్తపల్లిలో 10 డిగ్రీల మేర రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరో 13 జిల్లాల్లోనూ రాత్రి టెంపరేచర్లు 10 నుంచి 11.8 డిగ్రీల మధ్య నమోదయ్యాయి.
ఐదు జిల్లాల్లో 12 నుంచి 12.6 డిగ్రీల మధ్యన రికార్డు కాగా.. ఖమ్మం జిల్లాలో 13 డిగ్రీలే అత్యధిక రాత్రి ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. ఇటు హైదరాబాద్‌లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రత 8.8 డిగ్రీలు నమోదైంది. మరికొన్ని ప్రాంతాల్లోనూ 10 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదయ్యాయి.
అయితే, మరో మూడ్రోజుల పాటు చలి తీవ్రత ఇలాగే ఉంటుందని, ఈ మూడు రోజులు రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పగటి టెంపరేచర్లు 30 నుంచి 33 డిగ్రీల మధ్యే నమోదవుతున్నాయి. అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో 29.8 డిగ్రీల టెంపరేచర్ నమోదుకాగా.. అత్యధికంగా ఖమ్మం సిరిపురంలో 33 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది.
