కొడుకుని ఆస్పత్రిలో చేర్పించి.. డ్యూటీకి హాజరైన అంబులెన్స్ డ్రైవర్

కొడుకుని ఆస్పత్రిలో చేర్పించి.. డ్యూటీకి హాజరైన అంబులెన్స్ డ్రైవర్
  • కరోనా సమయంలో అంబులెన్స్ సేవలు ఆగిపోరాదని నిర్ణయం
  • కన్న కొడుకు చనిపోవడంతో కన్నీరు మున్నీరైన అంబులెన్స్ డ్రైవర్
  • కరోనా ఫ్రంట్ వారియర్ సేవలపై అభినందించిన స్థానికులు

మైసూర్: తీవ్రంగా గాయపడిన రెండేళ్ల కొడుకును ఆస్పత్రిలో చేర్పించి.. అతడి బాధ్యతను డాక్టర్లు, సిబ్బందికి అప్పజెప్పి తాను డ్యూటీకి వెళ్లిపోయిన అంబులెన్స్ డ్రైవర్ ఉదంతం ఇది. అంబులెన్స్ డ్యూటీ నిర్వహిస్తూనే మధ్య మధ్యలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన కన్న కొడుకు పరిస్థితిపై డ్యూటీ డాక్టర్లకు, నర్సులతో ఆరా తీస్తూనే ఉన్నాడు. దగ్గరుండి భార్యా పిల్లలకు ధైర్యం అందించాల్సిన పరిస్థితి అయినప్పటికీ మరో వైపు అంబులెన్స్ డ్రైవర్ల కొరతతో తానే విధులు నిర్వహిస్తానని వెళ్లాడు. ఇంత చేసినా చివరకు తన కొడుకు చనిపోవడంతో అంబులెన్స్ డ్రైవర్ కన్నీరుమున్నీరవుతున్నాడు.
మైసూరు కు చెందిన సయ్యద్ ముబారక్ అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతని రెండేళ్ల కొడుకును స్నానం చేయించేందుకు సిద్దం చేస్తుండగా.. వేడినీటి టబ్ లో పడిపోయాడు. తల్లి వచ్చి గమనించేలోగానే తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడ్ని హాస్పిటల్ కు తరలించారు. ఈనెల 11వ తేదీన జరిగిందీ ఘటన. వెంటనే ఆస్పత్రికి వచ్చిన సయ్యద్ ముబారక్ తన కొడుకుకు దగ్గరుండి వైద్య చికిత్సలు చేయించుకుంటున్నాడు. రెండు మూడు రోజులకు మించి సెలవు దొరకడం కష్టం కావడంతో డ్యూటీకి వెళ్లాల్సి వచ్చింది. కరోనా ఫ్రంట్ లైన్ వారియర్లకు సెలవులు అరుదుగానే ఇస్తున్నారు. ఈ క్రమంలో ముబారక్ డ్యూటీకి హాజరు కావాల్సి ఉండగా.. పరిస్థితిని భార్య, కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. డాక్టర్లు, నర్సులతో ధైర్యం చెప్పి పంపడంతో ముబారక్ డ్యూటీకి వెళ్లిపోయాడు.

డ్యూటీలో భాగంగా మైసూరు నుంచి చామరాజనగర్ తదితర ప్రాంతాలకు పేషెంట్లను తరలిస్తూ.. అర్ధరాత్రి 2 గంటలకు వచ్చి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో నిన్న మంగళవారం డ్యూటీకి వెళుతుండగా కొడుకు మరణవార్త విని కుప్పకూలిపోయాడు. ఆస్పత్రిలోని సాటి రోగులు, సిబ్బంది అంబులెన్స్ డ్రైవర్ గొప్ప మనసుతో చేసిన సేవలను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కాస్త వైరల్ కావడంతో మైసూరు బీజేపీ అధ్యక్షుడు శ్రీవత్స తదితరులు స్పందించారు. సొంత కొడుకు ఆస్పత్రిలో ఉన్నా.. ఇతరుల కోసం విధులు నిర్వహించడం గొప్ప విషయమని, అతని సేవలను ఎవరైనా సరే మెచ్చుకోకుండా ఉండలేరని ప్రశంసించారు. బీజేపీ నేత శ్రీవత్స తదితరులు సయ్యద్ ముబారక్ కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.