క్రిప్టోలో ట్రేడింగ్ వద్దు SIP ముద్దు.. ట్రెండ్ మార్చేసిన భారత ఇన్వెస్టర్లు..

క్రిప్టోలో ట్రేడింగ్ వద్దు SIP ముద్దు.. ట్రెండ్ మార్చేసిన భారత ఇన్వెస్టర్లు..

దేశంలో క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల తీరు మారుతోంది. గతంలో కేవలం తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు సంపాదించాలనే ఉద్దేశంతో ట్రేడింగ్ చేసిన ఇన్వెస్టర్లు.. ఇప్పుడు క్రమబద్ధమైన పెట్టుబడి విధానం(SIP) వైపు మొగ్గు చూపుతున్నారు. 2025లో భారతీయ క్రిప్టో ఎక్స్ఛేంజీలలో క్రిప్టో SIPలు ఏకంగా 60 శాతానికి పైగా పెరగడం విశేషం. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక సంపద సృష్టి కోసం ఈ పద్ధతిని ఎంచుకుంటున్నారని మారిన ట్రెండ్ గురించి నిపుణులు చెబుతున్నారు. 

కాయిన్‌డిసిఎక్స్, కాయిన్‌స్విచ్, ముడ్రెక్స్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లు ఈ ఏడాది భారీ వృద్ధిని నమోదు చేశాయి. ఉదాహరణకు.. కాయిన్‌డిసిఎక్స్‌లో మాత్రమే 2025లో 5.72 లక్షలకు పైగా కొత్త SIPలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఫీచర్ ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే 600 శాతం వృద్ధి కావడం గమనార్హం. కేవలం వంద రూపాయల నుంచి 500 రూపాయల వంటి చిన్న మొత్తాలతో కూడా పెట్టుబడి పెట్టే అవకాశం ఉండటంతో.. సామాన్య ఇన్వెస్టర్లు సైతం క్రిప్టో మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు. ముడ్రెక్స్ ప్లాట్‌ఫారమ్‌లో SIPల సంఖ్య 220 శాతం పెరగగా, కాయిన్‌స్విచ్‌లో 59 శాతం పెరుగుదలను చూసింది. 

ఇన్వెస్టర్లు ప్రధానంగా బిట్‌కాయిన్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీర్ఘకాలికంగా స్థిరమైన లాభాలు ఇస్తుందనే నమ్మకంతో బిట్‌కాయిన్‌ను మొదటి ప్రాధాన్యతగా ఎంచుకుంటున్నారు చాలా మంది క్రిప్టో పెట్టుబడిదారులు. దీని తర్వాత ఎథీరియం, సొలానా వంటి పాపులర్ డిజిటల్ అసెట్స్ టాప్ లిస్టులో ఉన్నాయి. అంతర్జాతీయంగా క్రిప్టో నిబంధనలు సడలింపులు.. అమెరికా వంటి దేశాల్లో క్రిప్టో ఈటీఎఫ్ లకు అనుమతులు లభించడం వంటి పరిణామాలు భారతీయ ఇన్వెస్టర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయని నిపుణులు అంటున్నారు.

ALSO READ : జనవరి 31నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..

గ్లోబల్ ఎక్స్ఛేంజీలు కూడా భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించాయి. బైబిట్ ఇండియా తన ఆటోమేటెడ్ డాలర్ కాస్ట్ యావరేజింగ్ బాట్ ద్వారా 25-30 శాతం యూజర్ల వృద్ధిని సాధించగా, బైనాన్స్ వంటి సంస్థలు 'రికరింగ్ బై' ఫీచర్ ద్వారా భారతీయులను ఆకర్షిస్తున్నాయి. ధరల హెచ్చుతగ్గుల వల్ల కలిగే భయాన్ని అధిగమించేందుకు 'రూపీ కాస్ట్ యావరేజింగ్' పద్ధతి ఇన్వెస్టర్లకు రక్షణ కవచంలా పనిచేస్తోంది. కేవలం రిటైల్ ఇన్వెస్టర్లే కాకుండా.. ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కూడా క్రిప్టో మార్కెట్లో 30-50 శాతం మేర తమ పెట్టుబడులను పెంచడం ఈ రంగం పరిణతికి సంకేతంగా క్రిప్టో నిపుణులు అంటున్నారు. దీర్ఘకాలిక వ్యూహంతోనే ఇన్వెస్టర్లు ఇలా చేస్తున్నారని వారు చెబుతున్నారు.