సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసేందుకు దళపతి విజయ్ 'జననాయగన్', శివకార్తికేయన్ ' పరాశక్తి' తో రెడీ అయ్యాయి. అయితే ఈ చిత్రాల విడుదలకు ముందే ఇప్పుడు కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్ద దుమారమే రేగుతోంది. ఒకవైపు ఈ రెండు భారీ చిత్రాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తుంటే.. థియేటర్ల యాజమానులు మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సినిమా రెవెన్యూ షేరింగ్ లో తలెత్తెన వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
లాభాలు ఎవరికి? నష్టాలు ఎవరికి?
తమిళనాడు థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తిరుప్పూర్ సుబ్రమణ్యం ఇటీవల ఒక ఇంటర్వ్యూలో థియేటర్ల యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే థియేటర్లకి కూడా లాభాలు రావాలి. కానీ 'జననాయకన్' చిత్ర నిర్మాతలు వసూళ్లలో 75 శాతం నుండి 80 శాతం వరకు వాటా అడుగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో విజయ్ నటించిన 'గోట్' మూవీకి కూడా 75:25 నిష్పత్తిలో షేరింగ్ ఇచ్చామని, దానివల్ల థియేటర్లకి నష్టాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఒక టికెట్ ధర రూ. 190 అనుకుంటే, అందులో ట్యాక్స్ రూ. 42 పోతుంది. మిగిలిన మొత్తంలో నిర్మాతలు 75 శాతం అడిగితే.. థియేటర్ యజమానికి కేవలం రూ. 37 మాత్రమే మిగులుతుంది. ఈ చిన్న మొత్తంతో కరెంటు బిల్లులు, సిబ్బంది జీతాలు ఎలా చెల్లించాలి అని ఆయన ప్రశ్నించారు.
Also Read : ‘ది రాజా సాబ్’ సెన్సార్ క్లియర్
'పరాశక్తి' పోటీతో మారిన లెక్కలు
కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం.. 'జననాయకన్' చిత్రానికి 75 శాతం ఆడియన్స్ రెస్పాన్స్ ఉంటే, శివకార్తికేయన్ 'పరాశక్తి' కి ఏకంగా 80 శాతం మేర ఆసక్తి కనిపిస్తోంది. కేరళ, పాలక్కాడ్ వంటి ప్రాంతాల్లో విజయ్ సినిమాకు 60 శాతం క్రేజ్ ఉండగా, కోయంబత్తూర్ వంటి చోట్ల అది 75 శాతం వరకు ఉంది. ఇంత భారీ క్రేజ్ ఉన్నప్పటికీ, నిర్మాతలు అడుగుతున్న అసాధారణమైన వాటా కారణంగానే అడ్వాన్స్ బుకింగ్స్ మందకొడిగా సాగుతున్నాయని సుబ్రమణ్యం స్పష్టం చేశారు.
శివకార్తికేయన్ ఏమన్నారంటే?
ఈ రెండు చిత్రాల క్లాష్ గురించి హీరోశివకార్తికేయన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేము మొదట 'పరాశక్తి'ని 2025 దీపావళికి విడుదల చేయాలనుకున్నాం. కానీ 'జననాయకన్' టీమ్ అప్పటికే ఆ డేట్ ఫిక్స్ చేయడంతో, మేము తప్పుకొని పొంగల్ రేసులోకి వచ్చాం. కానీ ఇప్పుడు ఆ టీమ్ కూడా సంక్రాంతికి రావాలని నిర్ణయించుకోవడం నాకు షాక్ ఇచ్చింది అని ఆయన పేర్కొన్నారు.
Also Read : విడుదలకు ముందే చిక్కుల్లో ‘జన నాయగన్’..
విజయ్ 'జననాయగన్' జనవరి 9, శివకార్తికేయన్' పరాశక్తి' జనవరి 10 థియేటర్లో సందడి చేయనుంది. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు థియేటర్లు కళకళలాడాలి. కానీ నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు మధ్య జరుగుతున్న ఈ 'పర్సంటేజ్' వార్ వల్ల సామాన్య ప్రేక్షకుడు ఇబ్బంది పడే అవకాశం ఉంది. 60:40 లేదా 50:50 నిష్పత్తిలో లాభాలు పంచుకుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందని థియేటర్ యజమానులు అభిప్రాయపడుతున్నారు. మరి సంక్రాంతి బరిలో నిలిచిన ఈ రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాయో చూడాలి.
