ప్రభాస్ హీరోగా నటించిన హారర్ ఫాంటసీ మూవీ ‘ది రాజా సాబ్’ సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా మొత్తం 189 నిమిషాల (3 గంటల 9 నిమిషాలు) రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్‌పై స్వల్ప మార్పులు చేయాలని సెన్సార్ బోర్డు సూచనలు ఇచ్చింది.
CBFC ఆదేశాల మేరకు.. రాజా సాబ్ చిత్ర బృందం వెంటనే అవసరమైన సవరణలు పూర్తి చేసింది. ఆ మార్పులు పూర్తయ్యాక, ఎలాంటి అభ్యంతరాలు లేకుండా సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ లభించిందని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. సాధారణంగా హారర్ కామెడీ సినిమాలకు ఇంత నిడివి ఉండదు. కానీ ప్రభాస్ హీరోయిజం, మారుతి మార్క్ కామెడీ, గ్రాండ్ విజువల్స్ ప్రేక్షకులను చివరి వరకు సీట్లకు అతుక్కుపోయేలా చేస్తాయని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.
ప్రభాస్ గత సినిమాల నిడివి చూసుకుంటే.. బాహుబలి 1 నిడివి "2 గంటల 45 నిమిషాలు", బాహుబలి 2 నిడివి "2 గంటల 47 నిమిషాలు", సలార్ మాత్రం 2 గంటల 55 నిముషాలు ఉంది. ఇక రాజాసాబ్ రన్ టైం (3గం9 నిమిషాలు).
'U/A' సర్టిఫికేట్: ఎవరైనా దీన్ని చూడవచ్చు.. కాకపోతే 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ చిత్రాన్ని వారి తల్లిదండ్రులతో కలిసొ లేదా పెద్దల తోడుతో చూడాలని సూచిస్తారు. ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాల్లో హింసాత్మక యాక్షన్ సన్నివేశాలు, కొంతవరకు నగ్నత్వం ఉంటుంది.
ప్రభాస్ ద్విపాత్రాభినయం..
ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం (Dual Role) చేస్తున్నారు. ఒకటి స్టైలిష్‌గా ఉండే యువకుడి పాత్ర కాగా, మరొకటి భయంకరమైన గెటప్‌లో ఉండే 'రాజా సాబ్' పాత్ర అని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ విజువల్స్లో ప్రభాస్ వింటేజ్ లుక్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఆయన బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారనున్నాయి.
ALSO READ : మన శంకర వరప్రసాద్ గారు’ బెనిఫిట్ షో టికెట్ వేలంపాట..
రాజాసాబ్ కథ ఇదేనా?
ఒకప్పుడు రాజవంశానికి చెందిన వారసత్వం ఉన్న రాజాసాబ్ (ప్రభాస్), ఆయన నానమ్మ గంగాదేవి అలియాస్ గంగవ్వ (జరీనా వాహెబ్) ఆర్థికంగా కష్టాల్లో పడి సాధారణ జీవితాన్ని గడుపుతుంటారు. అలాంటి సమయంలో, తమ కుటుంబానికి చెందిన మాయసభలాగే ఉన్న అతి పురాతన భవనంలోకి రాజాసాబ్ అడుగుపెడతాడు. ఆ ఇంటి నుంచి బయటకు రావాలంటే తాత (ప్రభాస్) సంతకం తప్పనిసరి అవుతుంది.
ఆ మర్మమైన భవనంలోకి వెళ్లిన తర్వాత ఏం జరిగింది? తమ కోల్పోయిన వారసత్వ సంపదను రాజాసాబ్ ఎలా తిరిగి దక్కించుకున్నాడు? తాతను రాజాసాబ్ ఎలా మెప్పించాడు? అన్నదే ఈ సినిమా ప్రధాన కథ. ఈ చిత్రం ప్రధానంగా తాత-మనవడు, నానమ్మ- మనవడు మధ్య ఉన్న భావోద్వేగ బంధాన్ని హృదయాన్ని తాకేలా చూపిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన భైరవి పాత్రలో మాళవిక, అనిత పాత్రలో రిద్ధి కుమార్ నటించగా, కీలక పాత్రల్లో సంజయ్ దత్, బోమన్ ఇరానీ, నిధి అగర్వాల్ కనిపిస్తారు.
