రేపటి తరాల భవిష్యత్ కోసమే హిల్ట్ పాలసీ.. లేదంటే హైదరాబాద్‎కు ఢిల్లీ పరిస్థితి తప్పదు: మంత్రి శ్రీధర్ బాబు

రేపటి తరాల భవిష్యత్ కోసమే హిల్ట్ పాలసీ.. లేదంటే హైదరాబాద్‎కు ఢిల్లీ పరిస్థితి తప్పదు: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని భూగర్భ జలాల్లో విషపూరిత పదార్ధాలు ఉన్నాయని.. పారిశ్రామిక రసాయల వల్లే భూగర్భ జలాల్లో విషపూరిత పదార్థాలు చేరాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇప్పటికీ మేల్కొకపోతే హైదరాబాద్‎ కూడా ఢిల్లీ పరిస్థితి ఎదుర్కొవాల్సి వస్తోందని హెచ్చరించారు. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రతి ఇంటికి ఒక ఆసుపత్రి ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. 

మంగళవారం (జనవరి 6) అసెంబ్లీలో హిల్ట్ పాలసీపై షార్ట్ డిస్కషన్ నడిచింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హిల్ట్ పాలసీ ద్వారా పారిశ్రామిక ప్రాంతం నివాస ప్రాంతంగా మారుతోందని.. సిటీలోని పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలివైపునకు తరలిస్తామన్నారు. ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాల్లో కాలుష్యం లేకుండా చేసేందుకు సీఎం యత్నిస్తున్నారని చెప్పారు. జీడీమెట్ల, ఉప్పల్, సనత్ నగర్, చర్లపల్లి ప్రాంతాలు గతంలో ఇండస్ట్రీయల్ జోన్లుగా జనవాసాలకు దూరంగా ఉండేవి కానీ 50 ఏళ్లలో హైదరాబాద్ మహానగరంగా విస్తరించిందని అన్నారు.

ALSO READ : హైదరాబాద్లో విషాద ఘటన..

 ఒకప్పుడు నగర శివారు ప్రాంతాలు ప్రస్తుతం రెసిడెన్షియల్ కాలనీస్‎గా మారాయని.. ప్రస్తుతం పరిశ్రమలకు పక్కనే అపార్ట్ మెంట్లు ఉన్నాయని తెలిపారు. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యాన్నిప్రత్యక్షంగా పీలుస్తున్నారని.. ఇండస్ట్రీలు, రెసిడెన్షియల్ ప్రాంతాలకు మధ్య బఫర్ జోన్లు లేవన్నారు. బఫర్ జోన్లు లేకపోవడం వల్లే ఎల్జీ పాలిమర్స్, భోపాల్ గ్యాస్ దుర్ఘటన వంటివి జరిగాయని గుర్తు చేశారు. హిల్ట్ పాలసీ విషయంలో ప్రతిపక్షాలు రాజకీయాలు పక్కన పెట్టాలని కోరారు. 

చైనాలో బ్లూస్కై పాలసీ ద్వారా భారీ పరిశ్రమలను నగరం అవతలివైపునకు తరలించారని గుర్తు చేశారు. పారిశ్రామిక ప్రగతి కంటే.. ప్రజల ప్రాణాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ఢిల్లీలో జనవాసాల మధ్య ఉన్న 168 పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు.  

ALSO READ : రేబిస్ మరణాల్లో భారత్ టాప్..

సుప్రీం కోర్టు తీర్పు ప్రాతిపదికన హిల్ట్ పాలసీ తీసుకొచ్చామని.. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు ఓఆర్ఆర్ లోపల ఉండకూడదనే హిల్ట్ పాలసీ తీసుకొచ్చామని స్పష్టం చేశారు. పూర్వీకులు స్వచ్ఛమైన ప్రకృతిని మనకు వారసత్వంగా అందించారని.. మనం కూడా రేపటి తరానికి స్వచ్ఛమైన ప్రకృతిని అందజేస్తున్నామా లేదా అని ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. 

ప్రకృతి ఒకసారి నాశనమైతే తిరిగి తీసుకురాలేమని అన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ప్రకృతి అందించడం మన బాధ్యత అని.. రేపటి తరాల భవిష్యత్, నేల మనుగడ కోసం హిల్ట్ పాలసీ తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు హిల్ట్ పాలసీని సాదాసీదా భూమార్పిడిగా చూస్తున్నారన్నారు. హిల్ట్ పాలసీపై సద్విమర్శలు చేస్తే స్వీకరిస్తామని తెలిపారు. మాపై బురద చల్లాలని విమర్శలు చేసే వారు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు.