వాకింగ్ చేస్తున్న మహిళను బెదిరించి బంగారం చోరీ

వాకింగ్ చేస్తున్న మహిళను బెదిరించి బంగారం చోరీ
  • బాధితురాలి ఫోన్​ను మూసీ వైపు విసిరేసిన దుండగుడు

ఉప్పల్, వెలుగు: వాకింగ్ చేస్తున్న ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తి బెదిరించి బంగారం చోరీ చేశాడు. ఈ ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం నాగోల్ కు చెందిన ప్రవీణ తన భర్తతో వాకింగ్ చేస్తోంది. భర్త ఆగిపోగా తాను ఇంకొంత దూరం నడుస్తానని చెప్పి వెళ్లింది. 

ఆ సమయంలో దుండగుడు షార్ప్ స్టిక్ తో ఆమెను బెదిరించి చెవు రింగులు, పుస్తెలతాడు(2.75 తులాలు) లాక్కున్నాడు. బాధితురాలి ఐ ఫోన్​ను మూసీ నది వైపు విసిరేసి పారిపోయాడు. ప్రవీణ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.