మిస్టరీ.. గ్రీకుల కంప్యూటర్​

మిస్టరీ.. గ్రీకుల కంప్యూటర్​

కొన్నేండ్ల క్రితమే ప్రపంచంలో అందరికీ క్యాలిక్యులేటర్ అందుబాటులోకి వచ్చింది. కానీ.. గ్రీకులు మాత్రం 2 వేల ఏండ్ల క్రితమే ఖగోళ క్యాలిక్యులేటర్​ని వాడారు. దాన్ని ‘యాంటికితెరా మెకానిజం’ అని పిలుస్తుంటారు. అప్పట్లో దాన్ని ఉపయోగించి ఎన్నో ఖగోళ రహస్యాలను తెలుసుకున్నారు. గ్రహాల మధ్య దూరాలు, నక్షత్రాల కదలికలు, క్యాలెండర్ తేదీలు, సూర్యచంద్రుల పరిభ్రమణాలు, ఖగోళ వస్తువుల స్థానాలు.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో తెలుసుకునేవాళ్లు. అయితే.. దాన్ని ఎవరు తయారు చేశారు? దాంతో ఇంకేం చేయొచ్చు? అనే ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ సమాధానం దొరకడంలేదు. 

అప్పటి గ్రీకుల మేధస్సుకు, ఇంజనీరింగ్ పరిజ్ఞానానికి ‘యాంటికితెరా మెకానిజం’ అనే గాడ్జెట్​ నిదర్శనం. 1900లో డైవర్ ఎలియాస్ స్టేడియాటిస్​కి ఇది దొరికింది. ఎలియాస్​ మరికొంతమంది డైవర్లతో కలిసి న్యాచురల్​ స్పాంజ్ కోసం సముద్రంలో వెతుకుతున్నప్పుడు అతనికి ఒక పురాతన గ్రీకు ఓడ కనిపించింది. అతను భయంతో పైకి వచ్చి ఆ విషయాన్ని అందరికీ చెప్పాడు. అది  యాంటికితెరా ప్రాంతంలో 60 మీటర్ల లోతులో ఉంది. ఆ ఓడ రోమన్ గాలెయన్ (లార్జ్ మల్టీ డెక్ సెయిలింగ్ షిప్స్) అని నిర్ధారించారు. అందులో కాంస్య, పాలరాయి విగ్రహాలు, కుండలు, గాజు వస్తువులు, నగలు, నాణేలు... ఇలా చాలానే దొరికాయి. వాటి మీద పరిశోధనలు చేసిన ఆర్కియాలజిస్ట్​లు అవి క్రీస్తుపూర్వం 150 నుండి 100 మధ్య నాటివని తేల్చారు.

ఓడలో దొరికిన విలువైన కళాఖండాల మధ్య ఇత్తడి, కాంస్యాలతో పాటు, కలపతో చేసిన ఓ శిథిలమైన వస్తువు దొరికింది. అది ఒక పెద్ద డిక్షనరీ సైజులో ఉంది. ఎక్కువ రోజులు నీళ్లలో ఉండడం వల్ల ఒక మెటల్​ ముద్దలా అయ్యింది. మొదట్లో దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అందరూ అందులో దొరికిన వస్తువులు, విగ్రహాల మీదే రీసెర్చ్​ చేశారు. తర్వాత అక్కడ దొరికిన వస్తువులన్నీ ఏథెన్స్‌‌లోని నేషనల్ ఆర్కియాలజికల్ మ్యూజియంలో పెట్టారు. వాటితోపాటే ఆ మెటల్​ గడ్డ కూడా మ్యూజియంలో ఉంచారు. 

గేర్ వీల్ 

ముందుగా దాన్ని అందరూ ఒక మెటల్​ ముద్ద అనే అనుకున్నారు. కానీ.. 17 మే 1902న ఆర్కియాలజిస్ట్​ వలేరియోస్ స్టెయిస్ ఆ పెద్ద ముద్దకు ఒక చిన్న గేర్ వీల్ అతుక్కుని ఉన్నట్టు గుర్తించాడు. దాంతో అది ఒక గడియారమని నమ్మాడు. కానీ.. అప్పట్లో గడియారం లేదు. కాబట్టి అది గ్రీకుల కాలంనాటి వస్తువు కాదేమో అనుకున్నారు. కానీ.. ఆ షిప్​లో దొరికిన అన్ని వస్తువుల్లాగే పాతగా ఉండడంతో దాని మీద రీసెర్చ్​ చేయాలని డిసైడ్​ అయ్యారు. 

ఆర్కియాలజిస్ట్​లకు దీనిలో ఉన్న వీల్స్​ కొత్తగా అనిపించాయి. ఎందుకంటే.. అప్పటివరకు అలాంటి గేర్లు పురాతన గ్రీస్‌‌ ఆధారాల్లో లేదా ప్రపంచంలో ఎక్కడా లభ్యం కాలేదు. దాంతో అప్పటివరకు దాని గురించి పట్టించుకోని వాళ్లు కూడా దానిపై రీసెర్చ్​ చేయడం మొదలుపెట్టారు. అయినా.. దానిమీద ఎక్కువగా పరిశోధనలు చేసింది మాత్రం 1951 తర్వాతే. ఎందుకంటే.. అప్పుడు బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్​ ప్రొఫెసర్ డెరెక్ జే.డి. సోల్లా ప్రైస్ దీనిపై ఎక్కువ రీసెర్చ్​ చేశాడు. యాంటికితెరా పాయింట్​కి దగ్గర్లో దొరకడం వల్ల దాన్ని ‘యాంటికితెరా మెకానిజం’ అని పిలుస్తున్నారు. 

రెండోసారి

యాంటికితెరా మెకానిజం దొరికిన ప్రాంతంలో దాని మరికొన్ని పార్ట్స్​ దొరుకుతాయనే ఉద్దేశంతో 2012, 2015ల్లో మళ్లీ సముద్రంలో గాలించారు. ఈసారి ఎద్దు బొమ్మతో అలంకరించిన ఒక కాంస్య(బ్రాంజ్​) డిస్క్ దొరికింది. ఆ డిస్క్​లో నాలుగు ‘‘చెవులు’’ ఉన్నాయి. వాటికి రంధ్రాలు ఉన్నాయి. ఆ డిస్క్​ కూడా యాంటికితెరా మెకానిజంలో భాగమై ఉండవచ్చని అనుకున్నారు. కానీ.. అది ఏ భాగంలో ఉంటుందో ఎలా ఫిక్స్​ చేయాలో తెలియలేదు. 

ఏంటది? 

యాంటికితెరా మెకానిజం దొరికి ఇప్పటికి 120 ఏండ్లు దాటింది. అయినా.. దాన్ని ఎందుకు వాడారు? ఎలా వాడేవాళ్లు? అనే విషయాలు పూర్తిగా తెలుసుకోలేకపోయారు సైంటిస్ట్​లు. కొన్నేండ్ల నుంచి ఆర్కియాలజిస్ట్​లు, సైంటిస్ట్​లు దానిపై రీసెర్చ్​ చేస్తూనే ఉన్నారు. అది మొత్తం 82 ముక్కలుగా విడిపోయింది. దాన్ని తిరిగి కలపడానికి సైంటిస్ట్​లకు చాలా కష్టమైంది. దాని నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంది. ఇప్పుడున్న టెక్నాలజీతో కూడా దాని ఉపయోగాలు తెలుసుకోలేకపోయారు. ఇది కనీసం క్రీస్తు పూర్వం 60,  70  దశకాల్లో తయారైందని ఆర్కియాలజిస్ట్​​లు చెప్తున్నారు. అయితే.. దీన్ని తిరిగి నిర్మించలేకపోవడానికి మరో కారణం కూడా ఉంది. ఈ పరికరంలో మూడో వంతు మాత్రమే ఓడలో దొరికింది. ఇందులో మొత్తం 30 గేర్లు ఉన్నాయి. చాలా చిన్నగా ఉండడం, సంక్లిష్టమైన నిర్మాణం వల్ల దీని పూర్తి రూపం ఎలా ఉండేదో, ఇది ఎలా పనిచేసేదో పరిశోధకులు గుర్తించలేకపోయారు. కానీ.. దీని వెనుక కవర్ మీద విశ్వంతో పాటు, ముఖ్యంగా ఐదు గ్రహాల కదలికల గురించి ఉంది. 

పురాతన కంప్యూటర్ 

యాంటికితెరా మెకానిజం సైంటిస్ట్​లను ఆశ్చర్యపరుస్తోంది. దీన్ని ప్రపంచంలోని మొట్టమొదటి అనలాగ్ కంప్యూటర్‌‌ అని చాలామంది చెప్తున్నారు. కొందరేమో ఖగోళ కాలిక్యులేటర్ అంటున్నారు. దీన్ని క్యాలెండర్ తేదీలు, గ్రహాల స్థితిగతులు, గ్రహణాలు, ఖగోళ ఘటనల గురించి అంచనా వేయడానికి వాడేవాళ్లని మరికొందరు అంటున్నారు. ఇది పనిచేయాలంటే చేతితో తిప్పితే చాలు. దీని వెనుక భాగం మెకానిజం ఎలా ఉంటుందో సైంటిస్ట్​లు కనుగొన్నారు. కానీ.. లోపలి భాగాన్ని కనుక్కోలేకపోతున్నారు. ఇక ముందు భాగంలో ఉన్న గేర్ సిస్టమ్ పనిచేసే విధానం ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే ఉండిపోయింది. ‘యాంటికితెరా మెకానిజం’  గురించి  తెలుసుకోవాలని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్​ లండన్ సైంటిస్ట్​లు త్రీడీ కంప్యూటర్ మోడల్​ని తయారు చేశారు. 

ప్రాచీన ఖగోళ శాస్త్రం

గ్రీకులు ఖగోళ శాస్త్రంలో నిష్ణాతులు. అందుకే కంటికి కనిపించని ఎన్నో ఖగోళ అంశాల గురించి తెలుసుకున్నారు. ఖగోళశాస్త్రం బాబిలోన్, ఉరుక్ ప్రాంతాల్లో బాగా డెవలప్​ అయ్యింది. బాబిలోనియన్లు బంకమట్టి పలకలపై ఖగోళ వస్తువుల రోజువారీ స్థానాలను రికార్డ్​ చేశారు. వాళ్ల పరిశోధనల ఆనవాళ్లు ఈ మెకానిజంలో కూడా ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు రిపీట్​ అయ్యే చక్రాల్లో కదులుతున్నాయని ఈ మెకానిజం తెలుపుతోంది. 

క్యాలిక్యులేటర్​గా..

దీనిపై స్టడీ చేసిన జర్మన్ ఫిలాలజిస్ట్ ఆల్బర్ట్ రెహ్మ్ దీన్ని క్యాలిక్యులేటర్​గా గుర్తించిన మొదటి వ్యక్తి. 1905– 1906 మధ్య ఆయన పబ్లిష్​ చేసిన నోట్స్‌‌లో ఈ విషయాన్ని చెప్పాడు. యాంటికితెరా శకలాల్లో ఒకదానిపై 19 సంఖ్యను చెక్కినట్లు ఆయన కనుగొన్నాడు. ఈ సంఖ్య మెటోనిక్ సైకిల్ అని ఆయనే నిర్ధారించారు. 
బ్రిటిష్ సైంటిస్ట్​ డెరెక్ జే.డి. సోల్లా ప్రైస్  20 సంవత్సరాలు దీని మీద రీసెర్చ్​ చేసి, ‘‘గేర్స్ ఫ్రమ్ ది గ్రీక్స్” అనే పేపర్​ని పబ్లిష్​ చేశాడు. అంతేకాదు.. దీంతో సూర్యుడు, చంద్రులతోపాటు ఐదు నక్షత్రాల  కదలికలను తెలుసుకోవచ్చని ఆయనే చెప్పాడు. 

ఆర్కిమెడిస్​ తయారు చేశాడా? 

వాస్తవానికి అప్పట్లో గ్రీకులు ఇలాంటి మెషీన్లు తయారుచేశారు, వాడారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కేవలం ఆ ఓడ గ్రీకులది కావడంతోనే ఆ యంత్రాన్ని వాళ్లు తయారు చేశారని నమ్ముతున్నారు. అందుకే పురాతన గ్రీకు సిద్ధాంతాలతో ఈ యంత్రం పనితీరును అంచనా వేస్తున్నారు. కానీ.. దీన్ని ఎవరు తయారుచేశారు అనేదానిపై అనేక చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా దీన్ని ఆర్కిమెడిస్​ తయారుచేశాడని చాలామంది అంటున్నారు. ఎందుకంటే.. ఆ కాలంలో ఉన్న జీనియస్ ఇంజనీర్ ఆర్కిమెడిస్. ఆయనే ఇలాంటి పరికరం తయారుచేయగలడని చాలామంది సైంటిస్ట్​లు చెప్తున్నారు. ఆర్కిమెడిస్​ చెప్పిన కొన్ని సూత్రాలు ఈ మెషిన్​తో సరిపోతున్నాయని కొందరు సైంటిస్ట్​లు చెప్తున్నారు. 

ఇన్‌‌స్ట్రక్షన్ మాన్యువల్​ 

ఈ మెషిన్​కు ముందు, వెనుక చెక్కతో చేసిన తలుపులు ఉన్నాయి. ఈ రెండింటిపై ఏదో రాసి ఉందని ఆర్కియాలజిస్ట్​లు చెప్తున్నారు. వెనుక తలుపు మీద ఉన్నదాన్ని ‘ఇన్‌‌స్ట్రక్షన్ మాన్యువల్’గా చెప్తున్నారు. దాని శకలాల్లో ఒకదానిపై ‘‘76 సంవత్సరాలు, 19 సంవత్సరాలు” అని కాలిపిక్, మెటోనిక్ చక్రాలను సూచిస్తుంది. సరోస్ చక్రం కోసం ‘‘223’’ అని కూడా రాసి ఉంది. మరో శకలం మీద మెటానిక్ డయల్‌‌ను సూచిస్తూ ‘‘స్పైరల్ సబ్​ పార్ట్స్​ 235’’ అని రాసి ఉంది. వీటిని బట్టి దీనిపై దీన్ని ఎలా వాడాలో పూర్తి వివరాలు ఉండేవని తెలుస్తోంది.