బెంగళూరులో ఓ హిట్ అండ్ రన్ కేసు తీవ్ర చర్చనీయాంశమైంది. కన్నడ సినీ ఇండస్ట్రీతో పాటు టెలివిజన్ రంగంలో కలకలం రేపుతోంది. లేటెస్ట్ గా ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ 'బిగ్ బాస్ కన్నడ' కంటెస్టెంట్, నటి దివ్య సురేష్ ఈ ఘటనలో కారు నడిపినట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. అక్టోబర్ 4వ తేదీ తెల్లవారుజామున నగరంలోని బైటరాయణపుర ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడగా, వారిలో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది.
ప్రమాదం జరిగిన తీరు
అక్టోబర్ 4న తెల్లవారుజామున సుమారు 1:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కిరణ్ (25), అనూష (24), అనిత (33) మోటార్‌సైకిల్‌పై ఆసుపత్రికి వెళ్తుండగా.. నలుపు రంగు కియా కారు వారి బైక్‌ను వేగంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే, కారు ఆపకుండా అక్కడి నుంచి పారిపోయిందని బాధితులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బండిని ఢీకొట్టిన లేడీ డ్రైవర్ ఆపమని పిలిచినా ఆగకుండా పారిపోయింది అని బాధితురాలి బంధువు వెల్లడించారు.
దివ్య సురేష్‌పై కేసు..
ఈ ప్రమాదంలో కిరణ్, అనూష స్వల్ప గాయాలతో బయటపడగా, అనిత కాలు విరిగి తీవ్రంగా గాయపడింది. తొలుత న్యూ లైఫ్ ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం బీజీఎస్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం అక్టోబర్ 7న బైటరాయణపుర పోలీస్ స్టేషన్‌లో కిరణ్ ఫిర్యాదు దాఖలు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఫుటేజీ ఆధారంగా ఆ కారు దివ్య సురేష్‌ది అని తేల్చారు.
ప్రమాద సమయంలో ఆమెనే స్వయంగా కారు డ్రైవింగ్ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదానికి గురైన కారును పోలీసులు స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపారు. కిరణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై సెక్షన్ 281 (రాష్ డ్రైవింగ్), 125(a) తో పాటు మోటార్ వెహికల్స్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసులో మరింత విచారణ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
తప్పు నాదికాదు.. బైకర్ దే?..
ఈ ఆరోపణలపై నటి దివ్య సురేష్ స్పందించారు. ఈ సంఘటనలో తనను తప్పుగా నిందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ 24న ఆమె సోషల్ మీడియాలో సీసీటీవీ ఫుటేజ్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేశారు. తప్పు బైకర్ వైపే ఉంది... బైక్‌పై ముగ్గురు ఉన్నారు, హెల్మెట్లు లేవు. కారు డ్రైవర్ లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నప్పుడు, బైకర్ తనంతట తానుగా వచ్చి కారును ఢీకొట్టాడు. ఇప్పుడు కారులో ఉన్న వ్యక్తిని నిందించడం మూర్ఖత్వం. దయచేసి వీడియో చూడండి. కారణం లేకుండా తనను తప్పుగా నిందిస్తున్నారని అన్నారు. "సత్యమే జయిస్తుంది" అంటూ ఆమె వ్యాఖ్యానించారు.
దివ్య సురేష్ మాజీ ప్రొఫెషనల్ కబడ్డీ క్రీడాకారిణిగా, 2021లో 'బిగ్ బాస్ కన్నడ 8'లో పాల్గొని ప్రజాదరణ పొందారు. ఆమె 'చిట్టే హెజ్జే', 'ఓం శక్తి, ఓం శాంతి' వంటి టీవీ సీరియల్స్‌తో పాటు 'హుళీరాయ', 'ఫేస్ 2 ఫేస్' వంటి కన్నడ చిత్రాలలో నటించారు. ప్రస్తుతం పోలీసులు తదుపరి దర్యాప్తులో భాగంగా ఆమెను ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.
