యువతిని గొడ్డలితో చంపిన ఉన్మాది.. అడ్డొచ్చిన వదిన, ఆమె కొడుకుపైనా దాడి

యువతిని గొడ్డలితో చంపిన ఉన్మాది.. అడ్డొచ్చిన వదిన, ఆమె కొడుకుపైనా దాడి
  • అడ్డొచ్చిన వదిన, ఆమె కొడుకుపైనా దాడి
  • నిర్మల్ జిల్లా ఖానాపూర్​లో దారుణం

ఖానాపూర్, వెలుగు: తన ప్రేమను నిరాకరించి.. మరొకరితో పెండ్లికి సిద్ధమైందన్న కోపంతో ఓ యువకుడు గొడ్డలితో దాడి చేసి యువతిని హత్య చేశాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్​లో గురువారం ఈ దారుణం జరిగింది. ఖానాపూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన శెట్టిపల్లి అలేఖ్య (23), శ్రీకాంత్ (26) ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఇద్దరి మధ్య బంధుత్వం కూడా ఉంది. శ్రీకాంత్, అలేఖ్య కొంత కాలం ప్రేమించుకున్నట్టు సమాచారం. ఇటీవల అలేఖ్యకు ఆమె కుటుంబసభ్యులు మరొకరితో పెండ్లి కుదిర్చారు. దీంతో ఆమె శ్రీకాంత్​ను దూరం పెట్టింది. పెండ్లి సంబంధం చెడగొట్టేందుకు ప్రయత్నించడంతో అతనిపై అలేఖ్య కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అప్పటి నుంచి శ్రీకాంత్, అలేఖ్య మీద కోపం పెంచుకున్నాడు. గురువారం పెండ్లి పనులపై వదిన జయతో కలిసి మార్కెట్​కు వెళ్లిన అలేఖ్య.. తిరిగి వస్తుండగా శివాజీ నగర్ వద్ద శ్రీకాంత్ గొడ్డలితో దాడి చేశాడు. అడ్డొచ్చిన జయ, ఆమె కొడుకు రియాన్స్ పైనా దాడి చేసిన పారిపోయాడు. అలేఖ్య అక్కడికక్కడే చనిపోగా.. గాయపడిన ఇద్దరిని హాస్పిటల్​కు తరలించారు. నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి ఖానాపూర్ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఇన్​చార్జ్ మంత్రి సీతక్క పోలీసులను అడిగి తెలుసుకున్నారు. నిందితుడిని పట్టుకోవాలని ఆదేశించారు.