బీఆర్ఎస్ సర్పంచ్ను చెప్పుతో కొట్టిన యువకుడు

 బీఆర్ఎస్ సర్పంచ్ను చెప్పుతో కొట్టిన యువకుడు

రాష్ట్రంలోని గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై రోజు రోజుకు వ్యతిరేకత పెరిగిపోతోంది. అభివృద్ధి పేరిట నిధులు దోచుకుంటున్నారని ఆరోపిస్తూ ప్రజాప్రతినిధులను బహిరంగంగానే నిలదీస్తున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఓ యువకుడు గ్రామసభలో సర్పంచ్ ను చెప్పుతో కొట్టాడు. గ్రామంలో అభివృద్ధి పనుల్లో నిధులు గోల్ మాల్ చేశారని ఆరోపిస్తూ  అందరిముందు చెప్పుతో కొట్టాడు. 

మహబూబాబాద్ మండలం మోట్ల తండాలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో గ్రామంలో జరిగిన అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా  సర్పంచ్ బానోత్ సుమన్ నాయక్ను వర్రే మహేష్ అనే యువకుడు నిధులపై ప్రశ్నించాడు. అభివృద్ధి పేరుతో నిధులను మింగేశారని ఆరోపిస్తూ చెప్పుతో దాడి చేశాడు.  అయితే గ్రామంలో చేసిన అభివృద్దిని చూసి ఓర్వలేకనే వ్యక్తిగత కక్షతో తనపై చెప్పుతో దాడి చేశారని- సర్పంచ్ బానోతు సుమన్ నాయక్ మండిపడ్డారు.