పసిపాపలకు రక్షణ లేదు.. సీఎం ఏం చేస్తున్నడు

పసిపాపలకు రక్షణ లేదు.. సీఎం ఏం చేస్తున్నడు
  • నిరుద్యోగులు సూసైడ్​చేసుకుంటుంటే అయ్యో అనలేదు
  • పసిపాపలకు రక్షణ లేదు.. సీఎం ఏం చేస్తున్నడు
  • అయ్యాకొడుకులు మాటలు చెప్పే మొనగాళ్లే
  • చేవెళ్ల నుంచి యాత్ర స్టార్ట్​ ​చేసిన షర్మిల

హైదరాబాద్, వెలుగు: బీసీలు ఎప్పుడూ బర్లు, గొర్లు కాయాలా అని వైఎస్సార్​టీపీ చీఫ్ వైఎస్​షర్మిల నిలదీశారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆరేండ్ల పసిపాపకు రక్షణ లేదంటే కేసీఆర్​ ఉరేసుకోవాలని మండిపడ్డారు. పోలీస్​స్టేషన్​లో మహిళలను చంపేస్తుంటే అడిగిన పాపాన పోలేదన్నారు. వేలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా అయ్యో అనలేదని విమర్శించారు. కేసీఆర్​దృష్టిలో కౌలు రైతు రైతే కాదని.. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నా కనికరం లేదని అన్నారు. 

తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యమకారులకు విలువుందా, ఏనాడైనా గౌరవించారా అని ప్రశ్నించారు. ప్రజా ప్రస్థానం పేరుతో షర్మిల 400 రోజుల పాటు చేపట్టనున్న యాత్ర రంగారెడ్డి జిల్లా చేవెళ్ల శంకర్​పల్లి చౌరస్తా నుంచి బుధవారం ప్రారంభమైంది. తొలి రోజు 10 కిలోమీటర్ల పాద యాత్ర చేసిన షర్మిల రాత్రి కందాడ గ్రామంలో బస చేశారు. యాత్ర స్టార్టవడానికి ముందు చేవెళ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల, వైఎస్ ​విజయమ్మ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. సీఎం కేసీఆర్​ అహంకారాన్ని దించేందుకు తాను పాదయాత్ర చేపట్టానని షర్మిల చెప్పారు. దళితులు, బీసీ ఆత్మగౌరవం కోసం, నిరుద్యోగుల కోసం, ఉచిత విద్య, వైద్యం, మహిళల మానప్రాణాల కోసం యాత్ర చేస్తున్నానన్నారు. 
ఢిల్లీలోనే దండాలు.. ఈడనేమో గొప్పలు 
‘రాష్ట్రంలో సమస్యలే లేవని తండ్రీ కొడుకులు అంటున్నరు. కేసీఆర్​కు దమ్ముంటే నాతో కలిసి యాత్ర చేయాలె. పాలన మీద నమ్మకముంటే సవాల్​ స్వీకరించాలె. సమస్యలు లేవని తేలితే ముక్కు నేలకు రాస్త. యాత్ర మానేసి ఇంటికెళ్తా. ఉన్నాయని తేలితే సీఎం పదవికి కేసీఆర్​ రాజీనామా చేసి దళితునికి పదవి అప్పజెప్పాలె’ అని షర్మిల సవాల్ ​విసిరారు. ‘రాష్ట్రంలో మద్యం అమ్మకాలు 300 శాతం పెరిగాయి. మహిళలపై అత్యాచారాలూ 300 శాతం పెరిగాయి. అయ్యా కొడుకులు మాటలు చెప్పే మొనగాళ్లే’నని విమర్శించారు. ‘మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్​ నాశనం చేశారు. ఏడేండ్లుగా ఆయన్ను ప్రశ్నించేటోళ్లు రాష్ట్రంలో లేరు. అందుకే తాను ఆడింది ఆట అన్నట్టు వ్యవహరిస్తున్నరు’ అని మండిపడ్డారు. ఢిల్లీలో ప్రధాని మోడీకి వంగి వంగి దండాలు పెట్టే కేసీఆర్.. ఇక్కడికొచ్చి కేంద్రాన్ని అది అడిగా, ఇదడిగానని గొప్పలకు పోతారన్నారు. 
దేశంలో అధ్వానపు సీఎం.. కేసీఆర్​
ఇంటికో ఉద్యోగమని మోసం సీఎం మోసం చేశారని షర్మిల అన్నారు. లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీ ఉంటే నోటిఫికేషన్లు ఇవ్వకుండా హమాలీ పని చేసుకోవాలని మంత్రులు సలహా ఇస్తున్నారని మండిపడ్డారు. ‘రూ.30 వేల కోట్ల ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రూ.లక్షా 30 వేల కోట్ల కాళేశ్వరంగా ఎలా మారింది? ప్రాజెక్టుల ఖర్చు పెంచి జేబులు నింపుకున్న కేసీఆర్.. నీళ్లను సముద్రంపాలు చేశారు. దళిత సీఎం, డబుల్​ బెడ్రూమ్, మూడెకరాల భూమి అని ఎన్నో హామీలిచ్చి దళితులను మోసం చేశారు. అసెంబ్లీ సాక్షిగా దళిత, గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారు’ అని విమర్శించారు. దేశంలో అధ్వానపు సీఎం ఎవరంటే కేసీఆరేనని సర్వేలు చెబుతున్నాయన్నారు. కరోనా వస్తే ప్రజలను గవర్నమెంట్​హాస్పిటల్​కు వెళ్లమని చెప్పి తాను కార్పొరేట్​హాస్పిటల్​కు వెళ్లారని విమర్శించారు. పీనుగుల మీదు పైసలు ఏరుకునే రకం కేసీఆర్​ అని మండిపడ్డారు. రాష్ట్రంలో దళితులపై 800 శాతం దాడులు పెరిగాయన్నారు.  
కాంగ్రెస్​అరువు తెచ్చుకున్న అధ్యక్షుడు రేవంత్ 
కాంగ్రెస్​ అరువు తెచ్చుకున్న అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి అని షర్మిల విమర్శించారు. తమను ఎన్జీవో అంటున్నారని, ఆయనలాగా తమకు బ్లాక్​ మెయిలింగ్​ చేతకాదని, ప్రజాప్రతినిధులను కొనుక్కోవడం రాదని మండిపడ్డారు. ఎవరిది ఎన్జీవోనో, ఎవరిది రాజకీయమో, ఎవరిది కంపెనీయో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ఓటుకు నోటు దొంగ రేవంత్​ పిలక కేసీఆర్​ చేతుల్లో ఉందన్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలకే కాదు, తల కూడా కోయగలరని అన్నారు. ప్రజాప్రస్థాన యాత్రకు వచ్చి తన కూతురును దీవించిన ప్రతి ఒక్కరికీ వైఎస్​ విజయమ్మ కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్​లాగే షర్మిలనూ ఆదరించాలని కోరారు. వైఎస్సార్​ పాదయాత్ర చేపట్టి 18 ఏండ్లు అయిందని, ఇపుడు షర్మిల చేపడతున్న యాత్ర కూడా రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పుతుందని అన్నారు.