కేసీఆర్ పాలన తాలిబాన్లను తలపిస్తోంది

కేసీఆర్ పాలన తాలిబాన్లను తలపిస్తోంది

వనపర్తి, వెలుగు: ఇచ్చిన హామీల్లో ఒక్కటన్నా సీఎం కేసీఆర్ నెరవేర్చలేదని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. తన 8 ఏండ్ల పాలనలో కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని ఫైర్ అయ్యారు. ఎన్నికలొస్తే ఓట్లు వేయించుకోవడం, ఆ తర్వాత ఫామ్ హౌస్ లో పడుకోవడమే కేసీఆర్ కు తెలుసునని విమర్శించారు. ‘‘ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది.  కేసీఆర్ మళ్లీ బయటకు వస్తారు. మాయమాటలు చెబుతారు. ఆయనను నమ్మి ఓటేస్తే మోసపోతరు” అని ప్రజలను హెచ్చరించారు. శనివారం వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి మండలంలో షర్మిల పాదయాత్ర చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కేసీఆర్ పాలన తాలిబాన్లను తలపిస్తోందని, టీఆర్ఎస్ నాయకులు తాలిబాన్ల లెక్క వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొంటున్నారని ఫైర్ అయ్యారు. ‘‘కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. తర్వాత తన సొంత ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ లో చేరారు. ఆయనను నమ్మి ఓటు వేసిన ప్రజలకు ద్రోహం చేశారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కొల్లాపూర్ లో అభివృద్ధి ఏది? 

కొల్లాపూర్ లో ఇప్పటి వరకు గెలిచిన ఎమ్మెల్యేలందరూ శ్రీశైలం ముంపు బాధితులకు పరిహారం ఇప్పించలేకపోయారని షర్మిల మండిపడ్డారు. ‘‘ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి.. కేసీఆర్ పంచన చేరా రు. అభివృద్ధి కోసమే పార్టీ మారానని చెప్పిన ఎమ్మెల్యే.. వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లో ఎక్కడా అభివృద్ధి పనులు చేపట్టలేదు. చిన్నంబావి మండల ప్రజలకు మాయమాటలు చెప్పి నట్టేట ముంచిన మహాఘనుడు హర్షవర్ధన్ రెడ్డి” అని విమర్శించారు. చిన్నమారు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వెంటనే చేపట్టి, సాగు నీరు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.