ఆపరేషన్ సిందూర్ వేళబంకర్లో దాక్కోమన్నారు

ఆపరేషన్ సిందూర్ వేళబంకర్లో దాక్కోమన్నారు
  • పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అంగీకారం
  • ఈ ఆపరేషన్ గురించి 4 రోజుల ముందే తెలుసన్న నేత 

ఇస్లామాబాద్: పహల్గామ్ టెర్రర్ అటాక్ కు ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన మిలిటరీ ఆపరేషన్ తో ఆ దేశ అగ్రనాయకులు ఆందోళనకు గురయ్యారు. భారత్ దాడుల నేపథ్యంలో మిలిటరీ సెక్రటరీ తనను బంకర్ లోకి వెళ్లాలని సూచించానట్టు పాక్ అధ్యక్షుడు ఆసిఫ్‌‌ అలీ జర్దారీ చెప్పారు.  కానీ, ఆ సలహాను తాను తిరస్కరించానని తెలిపారు. ఈ మేరకు శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

 “మిలిటరీ సెక్రటరీ నా దగ్గరకు వచ్చి యుద్ధం మొదలైంది. బంకర్లకు వెళ్దామన్నారు. ప్రాణాలు పోవాలనుంటే ఇక్కడే పోతాయని నేను ఆయనకు చెప్పాను. నాయకులు బంకర్లలో చనిపోరు. యుద్ధభూమిలో మరణిస్తారు’’ అని తన ప్రసంగంలో చెప్పారు.  ఆపరేషన్ సిందూర్ గురించి తనకు నాలుగు రోజుల ముందే సమాచారముందని పేర్కొన్నారు. 

ఆసిఫ్ అలీ జర్దారీ కామెంట్లు అబద్ధం: ఎల్జీ (రిటైర్డ్) కేజేఎస్ థిల్లాన్

పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన కామెంట్లను భారత మిలిటరీ లెఫ్ట్ నెంట్ జనరల్ (రిటైర్డ్ ) కేజేఎస్ థిల్లాన్ ఖండించారు. పాక్ అగ్రనాయకులు, మిలిటరీ ఆఫీసర్లు బంకర్లలో దాక్కున్నారని వెల్లడించారు. “భారత్ దాడులు చేసినప్పుడు పాకిస్తాన్ అగ్రనాయకులు, మిలిటరీ కమాండర్లు బంకర్లలో దాక్కున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆసిమ్ మునీర్ కూడా బంకర్లలోకి వెళ్లి తలదాచుకున్నారు. ఆపరేషన్ సమయంలో పాక్ సైనికులు మాత్రమే పోరాడారు. వారే  చనిపోయారు. భారత్ చేపట్టనున్న ఆపరేషన్ గురించి తనకు నాలుగు రోజుల ముందే తెలుసని ఆసిఫ్ అలీ జర్దారీ చెప్పడం అబద్ధం.  ఆయనకు ముందుగానే ఆ విషయం తెలిస్తే ఒక్క మిస్సైల్ ను కూడా ఎందుకు అడ్డుకోలేకపోయారు’’ అని ప్రశ్నించారు.