నకిలీ సీడ్ దందాలో అధికార పార్టీ లీడర్లు
మంచిర్యాల, వెలుగు: సాధారణంగా పత్తి పంటకు గులాబీ తెగులు సోకుతుంది. మంచిర్యాల జిల్లాలో మాత్రం విత్తు దశ నుంచే రైతు మెడకు చుట్టుకుంటోంది. కొంతమంది రూలింగ్ పార్టీ(గులాబీ) లీడర్లు, వారి బంధువులు, అనుచరులు నకిలీ విత్తనాలతో రైతులను ముంచుతున్నారు. ఇప్పటికే క్వింటాళ్ల కొద్దీ విత్తనాలను గ్రామాలకు తరలించి రైతులకు అంటగట్టారు. ఈ విషయం ఆఫీసర్లకు తెలిసినా చూసీచూడనట్టు వ్యవహరించారు. నకిలీ దందాను ఆదిలోనే అరికట్టడంలో విఫలమయ్యారు. తీరా ఇప్పుడు రైతుల ఇండ్లలో సోదాలు చేస్తూ ప్రతాపం చూపుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
భీమిని, నెన్నెల మండలాల్లో..
భీమిని, నెన్నెల మండలాలకు చెందిన కొంతమంది రూలింగ్పార్టీ లీడర్లు నకిలీ పత్తి విత్తనాల దందా సాగిస్తున్నారు. ముఖ్యంగా భీమినికి చెందిన ఒక మండలస్థాయి నేత పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీజన్ ప్రారంభానికి రెండు మూడు నెలల ముందే ఏపీలోని కర్నూలు, నంద్యాల, గుంటూరు ప్రాంతాల నుంచి భారీ మొత్తంలో నకిలీ సీడ్ భీమినికి చేరాయి. ఆ విత్తనాలను గుట్టుచప్పుడు కాకుండా గ్రామాలకు తరలించి తన బంధువులు, అనుచరులు, కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా అమ్మకాలు జరిపినట్లు తెలుస్తోంది. నెన్నెల మండలంలో కూడా అధికార పార్టీ లీడర్ల కనుసన్నల్లో నకిలీ విత్తన దందా సాగుతోంది. వీరి అనుచరులపై గతంలో కేసులు సైతం నమోదయ్యాయి.
మందమర్రి కేంద్రంగా..
ఆంధ్రాకు చెందిన ఓ ముఠా మందమర్రి కేంద్రంగా బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాల్లో నకిలీ దందా సాగిస్తున్నారు. కౌలు రైతుల ముసుగులో ఇక్కడికి వచ్చిన కొందరు వ్యవసాయాన్ని వదిలి నకిలీ సీడ్ బిజినెస్‌లో ఆరితేరారు. గతంలో పీడీ యాక్ట్ నమోదైన ఒక గవర్నమెంట్ టీచర్ సైతం తిరిగి ఇదే దందా చేస్తున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ అనుమతి లేని బీటీ3, నకిలీ సీడ్‌ను ఆంధ్రా, కర్నాటక, మహారాష్ట్రల నుంచి క్వింటాళ్ల కొద్దీ దిగుమతి చేసుకుంటున్నారు. ఈ విత్తనాలతో అధిక దిగుబడులు వస్తాయని, పత్తి మొక్కలు గడ్డిమందు కొట్టినా తట్టుకుంటాయని రైతులకు మాయమాటలు చెప్తున్నారు. లూజ్‌గా, ప్యాకెట్లలో రూ.2 వేలకు కిలో చొప్పున అమ్ముతున్నారు.
రైతులపై ప్రతాపం
ఏటా నకిలీ సీడ్ దందా జనవరి నుంచే మొదలవుతున్నప్పటికీ సంబంధిత ఆఫీసర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. కొద్దిరోజులుగా ఫెర్టిలైజర్స్ షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తూ హడావుడి చేస్తున్నారు. అడపాదడపా కేసులు పెట్టినా.. అధికార పార్టీ లీడర్ల వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలున్నాయి. నకిలీ విత్తనాల వ్యవహారంలో మందమర్రికి చెందిన ఒక వ్యక్తిని నెన్నెల పోలీసులు నాలుగు రోజుల కింద అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో మండలంలోని వివిధ గ్రామాల్లో రైతుల ఇండ్లలో సోదాలు చేశారు. మంగళవారం రాత్రి నందులపల్లికి చెందిన ఇందూరి అంకయ్య అనే రైతు ఇంట్లో క్వింటాల్ విత్తనాలు దొరికాయి. పోలీసులు స్టేషన్‌కు పిలవడంతో కేసు భయంతో అంకయ్య ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విత్తనాలను దళారులే రైతుల ఇండ్లలో దాచారా, లేక రైతులే కొన్నారా అనేది తెలియలేదు. రైతులు నకిలీ విత్తనాలను కలిగి ఉండడం కూడా నేరమే. కానీ క్వింటాళ్ల కొద్దీ విత్తనాలు రైతుల ఇండ్లకు చేరేదాకా ఆఫీసర్లు, టాస్క్‌ఫోర్స్ యంత్రాంగం ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి.
