దసరాకు నిమిషానికి రూ. 1.5 కోట్ల స్మార్ట్‌‌ఫోన్లు కొన్నరు

దసరాకు నిమిషానికి రూ. 1.5 కోట్ల స్మార్ట్‌‌ఫోన్లు కొన్నరు

రూ.29 వేల కోట్లుగా ఆన్‌ లైన్ సేల్స్
ప్రీమియం ప్రొడక్ట్‌లకు పెరిగిన డిమాండ్

బిజినెస్ డెస్క్, వెలుగు : ఈ పండుగ సీజన్‌‌‌‌లో స్మార్ట్‌‌‌‌ఫోన్లు హాట్‌‌‌‌కేకుల్లా అమ్ముడుపోయాయి. అమెజాన్, ఫ్లిప్‌‌‌‌కార్ట్ వంటి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌లో అయితే ఇక చెప్పనక్కర్లేదు. ప్రతి నిమిషం రూ.1.5 కోట్ల విలువైన స్మార్ట్‌‌‌‌ఫోన్లు అమ్ముడైనట్టు ఈకామర్స్ మార్కెట్ రీసెర్చర్ రెడ్‌‌‌‌సీర్ కన్సల్టింగ్ డేటా వెల్లడించింది. రెడ్‌‌‌‌సీర్ కన్సల్టింగ్ డేటా ప్రకారం ఈ ఫెస్టివ్ సీజన్‌‌‌‌లో ఆన్‌‌‌‌లైన్ సేల్స్ రూ.29 వేల కోట్లుగా(4.1 బిలియన్ డాలర్లుగా) నమోదైనట్టు వెల్లడైంది. అంచనా వేసిన 4 బిలియన్ డాలర్ల కంటే కూడా ఈసారి సేల్స్ మించిపోయాయి.  గతేడాది ఫెస్టివ్ సీజన్‌‌‌‌లో ఆన్‌‌‌‌లైన్ అమ్మకాలు రూ.19,909 కోట్లుగా(2.7 బిలియన్ డాలర్లుగా) ఉన్నాయి. ఈ నవరాత్రి దసరా సీజన్‌‌‌‌లో స్మార్ట్‌‌‌‌ఫోన్ అండ్ కన్జూమర్ ఎలక్ట్రానిక్ బ్రాండ్స్, రిటైలర్స్ సేల్స్ గతేడాదితో పోలిస్తే 10–20 శాతం పెరిగినట్టు వెల్లడైంది. నవరాత్రి జోష్‌‌‌‌తో దివాళి సేల్స్ కూడా చాలా బాగుంటాయని రిటైలర్స్, కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మిడ్ రేంజ్, ప్రీమియం ప్రొడక్ట్‌‌‌‌లను కస్టమర్లు ఎక్కువగా కొనేందుకు ఆసక్తి చూపడంతో మొత్తంగా తమ వ్యాపారాలు పెరిగినట్టు ఎల్‌‌‌‌జీ, శాంసంగ్, షియోమి, వివో, సోనీ, పానాసోనిక్, క్రోమా, విజయ సేల్స్, గ్రేట్ ఈస్ట్రన్ రిటైల్, సంగీతా మొబైల్స్ చెప్పాయి. చాలా బ్రాండ్ల ఆన్‌‌‌‌లైన్ సేల్స్ రెండింతలు పెరిగినట్టు పేర్కొన్నాయి.

యావరేజ్ బిల్లు వాల్యు గతేడాదితో పోలిస్తే 10–15 శాతం పెరిగినట్టు తెలిపాయి. ఫైనాన్స్ స్కీమ్స్, ఎక్స్చేంజ్ ఆఫర్లతో ప్రజలు ఎక్కువగా ప్రీమియం ప్రొడక్ట్‌‌‌‌లను కొనేందుకు మొగ్గుచూపడంతో వీటి బిల్లు వాల్యు పెరిగినట్టు చెప్పాయి. షాపర్స్ స్టాప్, అరవింద్ ఫ్యాషన్స్ వంటి ఫ్యాషన్ రిటైలర్స్ కూడా ఈ నవరాత్రి సేల్స్‌‌‌‌తో తమ వ్యాపారాలు కాస్త రికవరీ అయినట్టు తెలిపాయి.  మొత్తం గ్రాస్ మర్చండైజ్ వాల్యు(జీఎంవీ)లో 47 శాతం స్మార్ట్‌‌‌‌ఫోన్లవే ఉన్నాయి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లియెన్సస్ నిలిచినట్టు రెడ్‌‌‌‌సీర్ పేర్కొంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొడక్ట్‌‌‌‌లకు బాగా డిమాండ్ పెరిగినట్టు చెప్పింది. ఫెస్టివ్ సేల్స్ తొలి వారంలో ఫ్లిప్‌‌‌‌కార్ట్ గ్రూప్ మొత్తం జీఎంవీలో 68 శాతం వాటాను దక్కించుకుంది. ఫ్లిప్‌‌‌‌కార్ట్, అమెజాన్ కలిపి 90 శాతం జీఎంవీని సొంతం చేసుకున్నట్టు రెడ్‌‌‌‌సీర్ పేర్కొంది. మిగిలిన జీఎంవీ స్నాప్‌‌‌‌డీల్, పేటీఎం మాల్, ఇతరుల నుంచి నమోదైనట్టు తెలిపింది. ‘మధ్య తరగతి ప్రజలు కరోనా మహమ్మారి కాలంలో ఎలాంటి ఖర్చులు పెట్టలేదు. కనీసం బయటికి వెళ్లి తినడం కూడా చేయలేదు. ఆ సేవింగ్స్‌‌‌‌తో ఇప్పుడు దసరా, దివాళి షాపింగ్ చేస్తున్నారు. ఎల్‌‌‌‌జీ సేల్స్ గత నవరాత్రి సీజన్‌‌‌‌ కంటే 31 శాతం పెరిగాయి’ అని ఎల్‌‌‌‌జీ ఇండియా వైస్‌‌‌‌ ప్రెసిడెంట్ విజయ్ బాబు అన్నారు.

గత నవరాత్రితో పోలిస్తే తాము కూడా 20 శాతం గ్రోత్ నమోదు చేశామని టాటాకు చెందిన ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌‌‌‌ఫోన్ రిటైల్ చెయిన్ క్రోమా చెప్పింది. ఫైనాన్సియల్ కంపెనీలు కూడా ప్రజలు ఖర్చు ల పెంచేందుకు చాలా సాయం చేశాయని, క్యాష్‌‌‌‌బ్యాక్‌‌‌‌లు, ఈఎంఐ కొనుగోళ్లు, ఆమోదగ్గ రేట్లలో లోన్లు ఆఫర్ చేశాయని క్రోమా మార్కెటింగ్ హెడ్ రితేష్ ఘోసల్ అన్నారు. కన్జూమర్లు 55 అంగుళాలు, ఆపైన ఉన్న ప్రీమియం టీవీలు, పెద్ద రిఫ్రిజిరేటర్లు, పూర్తిగా ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్లు, మైక్రోవేవ్ ఓవెన్స్ కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపారని శాంసంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజు పులాన్ చెప్పారు. అక్టోబర్ నెలలో తొలి 25 రోజుల్లో తమ ప్రీమియం సెగ్మెట్ 50 శాతం పెరిగినట్టు పేర్కొన్నారు. షియోమి ఇండియా కూడా ఈ ఫెస్టివ్ సీజన్‌‌‌‌లో 50 లక్షలకు పైగా స్మార్ట్‌‌‌‌ఫోన్లను అమ్మినట్టు కంపెనీ ఎండీ  మను కుమార్ జైన్ ట్వీట్ చేశారు.

చిన్న పట్టణాల నుంచే  పెద్ద మొత్తంలో షాపర్లు…

ఈ సారి ఆన్‌‌‌‌లైన్ సేల్స్‌‌‌‌లో కొత్త కస్టమర్లు పెరిగారు. చిన్న నగరాల నుంచి కూడా పెద్ద మొత్తంలో కస్టమర్లు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో కొనుగోలు చేశారు. ఫెస్టివ్ సేల్స్ తొలి వారంలో ఈకామర్స్ వెబ్‌‌‌‌సైట్లను 5.2 కోట్ల మంది షాపర్లు విజిట్ చేస్తే.. వారిలో 57 శాతం మంది అంటే 3.1 కోట్ల మంది కస్టమర్లు చిన్న నగరాలు, పట్టణాలకు చెందిన వారేనని రెడ్‌‌‌‌సీర్ డేటా పేర్కొంది. కరోనా లాక్‌‌‌‌డౌన్‌‌‌‌తో వలస కూలీలు మెట్రోల నుంచి తమ పట్టణాలకు వెళ్లడంతో, అక్కడ నుంచి కూడా ఈ సారి కొనుగోళ్లు ఎక్కువగా నమోదయ్యాయి.

ప్రతి ఫెస్టివ్ సేల్‌‌‌‌లో ఈకామర్స్ కస్టమర్లను ఆకట్టుకునే తొలి కేటగిరీగా స్మార్ట్‌‌‌‌ఫోన్లే ఉంటాయి. ఎందుకంటే ఆన్‌‌‌‌లైన్ సంస్థలు వీటిపై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తాయి. ఎలాంటి సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ లేదు, ఈ ఏడాది కూడా ఇదే ట్రెండ్ నడిచింది. అఫర్డబులిటీ, క్రెడిట్ ప్రొడక్ట్‌‌‌‌లు ఈ స్మార్ట్‌‌‌‌ఫోన్ సేల్స్ మరింత పెరిగేందుకు సహకరించాయి.

మ్రిగాంక్ గుట్గుటియా, డైరెక్టర్, రెడ్‌‌‌‌సీర్

దసరా సీజన్‌‌లో ఈకామర్స్ ప్లాట్‌ ఫామ్స్‌‌‌‌పై పెరిగిన సేల్స్ 55% 

రెడ్‌‌‌‌సీర్ కన్సల్టింగ్ అంచనా ప్రకారం ఆన్‌ లైన్ అమ్మకాలు 29వేల కోట్లు 

ఈ ఏడాది పెరిగిన ఆన్‌ లైన్ షాపర్స్ 85% 

గతేడాదితో పోలిస్తే పెరిగిన సగటు బిల్లు వాల్యూ 15%

For More News..

రైతుబంధు.. ఈసారి దుబ్బాకకే ముందు