క్వింటాల్​కు 10 కిలోలు కట్..తరుగు పేరుతో ముంచుతున్రు

V6 Velugu Posted on Jun 11, 2021

  • ఇది అనాయ్యమని అడిగితే కసురుకుంటునన్రు
  • సివిల్ సప్లై మంత్రి  జిల్లాలో అన్నదాతల ఆవేదన

‌‌‌‌ఇల్లందకుంట, వెలుగు: ‘‘కింటల్​కు అసలైతే రెండు కిలోల తరుగు తియ్యాలె.. కానీ 40 కిలోల బస్తాకు సెంటర్ల రెండు కిలోల చొప్పున తీసిన్రు. అక్కన్నే మోసమైంది.. మళ్లా రైస్​ మిల్లులో కింటల్​కు 6 నుంచి 10 కిలోల తరుగు తీస్తున్నరు. ఇదేం అన్యాయమని అడిగితే కసురుకుంటున్నరు.. తహసీల్దార్  మేడమ్​ మీరైనా జెర మా  కష్టాలు పట్టించుకోండ్రి..’’ అంటూ  రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు.  సివిల్ సప్లయ్స్​ మంత్రి గంగుల కమలాకర్​ సొంత జిల్లాలో జరిగిన ఈ ఘటన  రాష్ట్ర వ్యాప్తంగా రైతులను రైస్​మిల్లర్లు ఏ రేంజ్​లో దోచుకుంటున్నాయనేందుకు నిదర్శనంగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్​ జిల్లా ఇల్లందకుంటకు చెందిన రైతు దంసాని రామస్వామి లోకల్​గా ఏర్పాటుచేసిన ఐకేపీ సెంటర్​లో వడ్లను అమ్మేందుకు తెచ్చాడు. ఇక్కడ 40 కిలోల బస్తాకు రెండు కిలోలు, రైసు మిల్లులో క్వింటాల్​కు 6 కిలోల చొప్పున కోత పెట్టారు. తాను 463 వడ్ల బస్తాలు తీసుకొస్తే ఏకంగా 48 బస్తాలు కోతపెట్టారని  రామస్వామి ఆవేదన వ్యక్తం చేశాడు. మిగిలిన రైతులకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురుకావడంతో గురువారం సుమారు 25 మంది రైతులు  ఇల్లందకుంట తహసీల్దార్​ ఆఫీసుకు చేరుకొని ఆందోళనకు దిగారు. 

ఈ సందర్భంగా రైతు రామస్వామి మాట్లాడుతూ.. తన ఒక్కనివి 48 బస్తాల తరుగుతీశారని, ఈ మొత్తం 16 క్వింటాళ్ల వడ్లు అంటే రూ. 32 వేలు కటింగ్​పెట్టారని కన్నీళ్లుపెట్టుకున్నాడు. మిగిలిన రైతులందరూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. సివిల్​ సప్లయ్స్ మినిస్టర్​ గంగుల కమలాకర్​ సొంత జిల్లాలో తమకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఆయన కనీసం స్పందిచకపోవడం ఏమిటని రైతులు ప్రశ్నించారు. అటు సెంటర్ నిర్వాహకులు, ఇటు మిల్లుల ఓనర్లు కలిసి తమను దోచుకుంటున్నారని, ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఐకేపీ సెంటర్లలో క్వింటాల్​కు 4 కిలోల తరుగు తీశాక, మళ్లీ మిల్లుల్లో 6 నుంచి 10 కిలోలు కట్​ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐకేపీ సెంటర్లలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని,  ప్రభుత్వం రైతుబంధు ఇస్తోంది కదా, కోతలు పెడితే తప్పేంటని దబాయిస్తున్నారని రైతులు అన్నారు. ఈ సందర్భంగా తమ తక్ పట్టీ లను తహసీల్దార్​ సురేఖకు చూపించారు. ఆందోళన తీవ్రం కావడంతో తహసీల్దార్​ రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు. 

ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నరు

కొనుగోలు సెంటర్​కు  నేను 81 బస్తాల వడ్లు తెచ్చిన. దాంట్ల నుంచి 77 బస్తాలకే  లెక్క చేసిన్రు. ఇదేం పద్ధతని అడిగితే ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నరు. వడ్ల నాణ్యత  గురించి ఏఈవో వచ్చి చూసి, వడ్లు మంచిగున్నాయని చెప్పినప్పటికీ ఐకేపీ సిబ్బంది మాత్రం కోతలు పెట్టిన్రు.  ప్రభుత్వమే స్పందించాలి. 
- వొల్లల స్వామి, రైతు, ఇల్లందకుంట

చులకనగా చూస్తున్నరు..

కొనుగోలు కేంద్రంలో ఇష్టం వచ్చినట్లు కోతలు పెడుతున్నరు. ప్రశ్నిస్తే.. రైతు బంధు డబ్బులు ఇస్తలేదా, కట్ చేస్తే ఏమైతది? అంటున్నరు. సెంటర్​లో పనిచేసే ఆఫీసర్ దగ్గరి నుంచి హమాలీ దాకా అంతా చులకనగ చూస్తున్నరు. జిల్లాలోనే సివిల్ సప్లయ్స్​ మంత్రి గంగుల ఉన్నరు. మా బాధలు ఆయనకు పడ్తలేవు. - బోగం లక్ష్మయ్య, రైతు, ఇల్లందకుంట

Tagged Karimnagar, farmer, Gangula, Dharna, 10 kg , quintal grain, cut off, depreciation

Latest Videos

Subscribe Now

More News