ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశాం : అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్

ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశాం :  అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్

వనపర్తి, వెలుగు : జిల్లాలో ఖరీఫ్​సీజన్​కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశామని అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్​ తెలిపారు. మంగళవారం తన ఛాంబర్​లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్​ సీజన్​లో నాలుగు లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశామన్నారు. ఇప్పటివరకు 2,34,995 మెట్రిక్​ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. 

ఇందులో 2,09,918 టన్నులు సన్నరకాలు కాగా, 25,077 దొడ్డు రకం అని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 390 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, 151 సెంటర్లను క్లోజ్ చేశామని తెలిపారు. జిల్లాలో 184 రైస్​మిల్లులు ఉండగా, పెండింగ్​లేని, డీ ఫాల్టర్లు కాని 63 మిల్లుల్లో 53కు రా రైస్​, 10 మిల్లులకు బాయిల్డ్​రైస్ ధాన్యాన్ని కేటాయించామన్నారు. బ్యాంకు గ్యారంటీ ద్వారా రూ.20.77 కోట్లు వచ్చాయని చెప్పారు. 

ధాన్యం ఎక్కువగా ఉండడంతో మహబూబ్​నగర్​, గద్వాల, సిద్దిపేట జిల్లాలకు 20 వేల టన్నుల చొప్పన ధాన్యాన్ని తరలించామన్నారు. జిల్లాలో సెంటర్లకు ఇంకా 50 వేల టన్నుల వరకు ధాన్యం రావచ్చని పేర్కొన్నారు. మొత్తం 45,480 మంది రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేశామని, అందుకు రూ.561కోట్లకు రూ.447 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశామని వివరించారు. సమావేశంలో డీఎస్​వో కాశీవిశ్వనాథ్, డీఎం జగన్మోహన్, డీటీ పరమేశ్​పాల్గొన్నారు.