తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో నీట మునిగిన పంట

తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో నీట మునిగిన పంట
  • వర్షాలతో రైతుల ఆశలపై నీళ్లు
  • కొట్టుకుపోయిన వరి
  • 5 లక్షల ఎకరాల్లో నీటిలోనే పత్తి
  • కందులు, పెసర్లు , నువ్వుల పంటలపైనా ఎఫెక్ట్

 

రాష్ట్రంలో కురిసిన వానలు రైతులను నిండా ముంచేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంటలపై తీవ్ర ప్రభావం పడింది. వరి, పత్తి పంటలు పెద్దఎత్తున నీట మునిగాయి. కందితో పాటు పెసర పంటకు తీవ్రంగా నష్టం జరిగింది. పంట పొలాల్లోకి ఇసుక మేటలు వేశాయి. వ్యవసాయ శాఖ మాత్రం పంట పొలాల్లోకి ఒండ్రు మట్టి వచ్చి చేరిందని, నేల సారవంత మైందని, భవిష్యత్తులో పంటలు బాగా పండుతాయని చెప్పడం గమనార్హం. 10 శాతం పంటలకు దెబ్బ వరదలకు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల ఎకరాల్లో వరి పంట కొట్టుకు పోయింది. మరో 3 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది. మరో 5 లక్షల ఎకరాల్లో పత్తి పంటపై ఎఫెక్ట్‌ పడింది. ప్రధానంగా భూపాలపల్లి, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, ములుగు, మహబూబా బాద్ జిల్లాల్లో వాగులు పొంగడంతో వరి పొలాలు వరదల్లో కొట్టుకు పోయాయి. మున్నేరు వాగు పొంగడంతో 50 కిలోమీటర్ల దూరం వరకు కాలువ రెండు పక్కల పదెకరాల పరిధిలో పొలాలను దెబ్బతీసుకుంటూ పోయింది. పాకాల, రామప్ప, లక్నవరం చెరువుల పరిధిలోని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పంట మునిగింది.

జిల్లాల వారీగా పంట నష్టం ఇలా..

కరీంనగర్: 168 గ్రామాలు వరదల వల్ల ప్రభావిత మైనట్లుఅధికారులు అంచనా వేశారు. వరి 25 వేల ఎకరాల్లో, పత్తి 4,128 ఎకరాల్లో నీట మునిగింది. 13,570 మంది రైతులు నష్టపోయారు.

వరంగల్ అర్బన్: 11,759 ఎకరాల్లో వరి, 4,643 ఎకరాల పత్తి పంట దెబ్బతింది. 11,419 మంది రైతులు నష్టపోయినట్లు ఆఫీసర్లు గుర్తించారు.

వరంగల్ రూరల్: వరి 29,195 ఎకరాలు, పత్తి 58,885, కంది 340, పెసర 578, సోయాబీన్ 62, మినుములు 58, వేరుశనగ 5,869, మొక్క జొన్న 302 ఎకరాల్లో నీట మునిగాయి. మొత్తంగా 56,274 మంది రైతులు నష్టపోయినట్లు ఆఫీసర్లు అంచనాలు తయారు చేశారు.

 జయశంకర్ భూపాలపల్లి: 26,049 మంది రైతులకు చెందిన 27,894 ఎకరాలు నీట మునిగాయి.

మహబూబాబాద్ జిల్లా: వరి 11,734 ఎకరాలు, పత్తి 2,418, పెసర 238, వేరుశనగ 14, మొక్క జొన్న 491, నువ్వులు 5 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. జిల్లాలో మొత్తంగా 17,375 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.

పెద్దపల్లి జిల్లా: 2,250 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో 2 వేల ఎకరాల్లోవరి, 250 ఎకరాల్లోపత్తి పంట దెబ్బతిన్న ట్లు గుర్తించారు.

కామారెడ్డి: 400 ఎకరాల్లోపెసర, 180 ఎకరాల్లో వరి, 120 ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది.

 నారాయణపేట: 41,867 ఎకరాల్లో పంటనష్టం అయినట్లు ప్రాథమిక అంచనా వేశారు. అందులో 22,551 ఎకరాల్లోపత్తి, 18,900 ఎకరాల్లో కంది తోపాటు ఇతర పంటలకు నష్టం జరిగింది.

ఖమ్మం: 20,701 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పెసరకు 19,803 ఎకరాల్లో నష్టం వాటిల్లింది.

 భద్రాద్రి కొత్తగూడెం: 13,837 ఎకరాల్లో వరి, 7,221 ఎకరాల్లో పత్తి దెబ్బతిన్నది.

 సిద్దిపేట: 8 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వీటిలో వరి 5 వేల ఎకరాల్లో, పత్తి 2,300, మొక్క జొన్న 180 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. 4 వేల మంది రైతులు నష్టోయారు. మరో 2 వేల ఎకరాల్లో కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది.

 వనపర్తి: 5,015 ఎకరాల్లో పత్తి, 952 వరి, 155 ఎకరాలు వేరుశనగ, 11 ఎకరాలలో కంది వరద నీటిలో కొట్టుకుపోయింది. మొత్తం 705 మంది రైతులకు నష్టం జరిగింది.

ఆసిఫాబాద్: 7 మండలాలు, 58 గ్రామాల్లో 1,083 ఎకరాల్లో పంట నష్టం జరిగింది.

 జనగామ: వరి 4,300 ఎకరాలు, పత్తి 3,100 ఎకరాలు, పెసర 515 ఎకరాలు కలిపి మొత్తంగా 7,915 ఎకరాల్లో పంట నష్టం జరిగింది.

 మహబూబ్‌నగర్: 12,764 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో 7,972 ఎకరాల్లోపత్తి, 4,306 ఎకరాల్లో కందికి నష్టం జరిగింది.

నాగర్ కర్నూలు: 183 ఎకరాల్లో పంట నష్టం జరిగింది.

జగిత్యాల: 502 ఎకరాల పంట నీటమునిగింది.

నల్గొండ: 3,865 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. 11 మండలాల్లో 52 గ్రామాల్లో తుఫాన్ ప్రభావం ఉంది. మంచిర్యాల: 2 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 650 ఎకరాల్లో వరి, 1,350 ఎకరాల్లో పత్తి దెబ్బతిన్నాయి.

యాదాద్రి: 7 మండలాల్లోని 43 గ్రామాల్లో వర్షం ప్రభావంతో 760 ఎకరాల్లో పంట నష్టం జరిగింది.