
- బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతాదయాకర్రెడ్డి
వనపర్తి, వెలుగు: బాలల హక్కులను పరిరక్షించేందుకు లైన్ డిపార్ట్మెంట్ అధికారులు నిబద్ధతతో కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి సూచించారు. గురువారం కమిషన్ సభ్యులు కంచర్ల వందన గౌడ్, మరిపల్లి చందన, బి అపర్ణ, గోగుల సరిత, ప్రేమలత అగర్వాల్, బి వచన్ కుమార్ తో కలిసి జిల్లాలో పర్యటించారు. శ్రీరంగాపూర్ అంగన్వాడీ కేంద్రం, వనపర్తిలోని బాల సంరక్షణ కేంద్రం, గర్ల్స్హై స్కూల్‌ను తనిఖీ చేశారు.
అనంతరం కలెక్టరేట్ లో కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్ తో కలిసి లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరేళ్లు వచ్చేంత వరకు పిల్లలకు పౌష్టికాహారం అందించి, ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖపై ఉందన్నారు. పిల్లల్లో లోపాలు ఉంటే ముందుగానే గుర్తించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని సూచించారు. పిల్లలు వైకల్యంతో ఉంటే ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ చేయించి వైకల్యాన్ని సరిదిద్దేలా చొరవ తీసుకోవాలన్నారు.
బాలామృతంపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని డీఈవోను ఆదేశించారు. అనంతరం జిల్లాలో ఉత్తమ మార్కులు సాధించిన అనాథ పిల్లలకు మెమెంటో, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. అడిషనల్ కలెక్టర్ యాదయ్య, డీడబ్ల్యూవో సుధారాణి, డీసీపీవో రాంబాబు పాల్గొన్నారు.
సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో సన్మానం..
వనపర్తి టౌన్: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్సీతా దయాకర్ రెడ్డిని సాహితీ కళావేదిక సభ్యులు సన్మానించారు. అధ్యక్షుడు పలుస శంకర్, డీఈవో అబ్దుల్ ఘని, ఆర్డీఎస్ నిర్వాహకురాలు చిన్నమ్మ థామస్, జనజ్వాల, గంధం నాగరాజు, యుగంధర్, లక్ష్మి పాల్గొన్నారు.