
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : దివ్యాంగ స్టూడెంట్స్కు విద్యాబుద్దులు నేర్పించే భవిత సెంటర్లలో అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్జితేశ్వీ పాటిల్ ఆఫీసర్లను ఆదేశించారు. కొత్తగూడెం పట్టణం రైటర్ బస్తీలో భవిత సెంటర్ను ఆయన గురువారం సందర్శించారు. సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగ స్టూడెంట్స్కు భవిత సెంటర్ల ద్వారా ఉజ్వల భవిష్యత్ అందించాలన్నారు. బోధనకు అవసరమైన స్టడీ మెటీరియల్స్ తెప్పించాలని సూచించారు. ఫిజియో థెరపిస్టు కచ్చితంగా కేంద్రానికి వచ్చేలా చూడాలన్నారు. ఈ ప్రోగ్రాంలో ఎంఈవో డాక్టర్ ప్రభుదయాళ్, అధికారులు పాల్గొన్నారు.
ఈవీఎం గోడౌన్ తనిఖీ
కొత్తగూడెం పట్టణం ఆర్డీవో ఆఫీస్ సమీపంలోని ఈవీఎంల గోడౌన్ను కలెక్టర్ తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. గోడౌన్ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు.
మేకపాల ఉత్పత్తి, విక్రయ కేంద్రాల ఏర్పాటు జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో మేకపాల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర జితేశ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో పశువైద్య, పశుసంవర్ధక శాఖాధికారి, మండల స్థాయి పశువైద్యాధికారులు, జిల్లా వెటర్నరీ వైద్య సిబ్బందితో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలోని గిరిజనుల తో వద్ద ఉన్న మేకల సంతతిని అభివృద్ధి చేసి అధిక పాల దిగుబడి సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మేకపాల విశిష్టతను ప్రజలకు తెలియజేయడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మేకల మేత కోసం అవసరమైన మొక్కలను నాటడం ద్వారా అడవుల అభివృద్ధి కూడా జరుగుతుందన్నారు. బాతులు, కౌజు పిట్టల పెంపకంపై గిరిజనులతో పాటు మహిళలకు అవగాహన కల్పించాలని సూచించారు.
వైద్యులు అందుబాటులో ఉండాలి
వర్షాకాలం సీజన్లో హాస్పిటళ్లలో వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన వైద్యాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.