10 లక్షల మంది కొత్త లబ్ధిదారుల ఎదురుచూపులు

10 లక్షల మంది కొత్త లబ్ధిదారుల ఎదురుచూపులు
  • 36 లక్షల మంది పాత పింఛన్​దారులకు ప్రతి నెలా లేటే..
  • పోస్టాఫీసులు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులు 

హైదరాబాద్, వెలుగు: నెల రోజులపాటు ఆసరా పింఛన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలతో హడావుడి చేసిన ప్రభుత్వం.. పింఛన్​ డబ్బులు మాత్రం టైమ్​కు ఇస్తలేదు. 10 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు ఆగస్టు నుంచే ఇస్తామని ప్రకటించినప్పటికీ.. ఇంతవరకూ అతీగతీ లేదు. వీళ్ల ఖాతాల్లో సెప్టెంబర్​ మొదటివారంలోనే డబ్బులు పడాల్సి ఉన్నా ఉలుకూ పలుకూలేదు. ఇక, సుమారు 36 లక్షల మంది పాత లబ్ధిదారులకు రెండేండ్లుగా ప్రతి నెలా ఇరవై నుంచి ఇరవై అయిదు రోజులు ఆలస్యంగా డబ్బులు అందుతున్నాయి. ఆగస్టు నెల పింఛన్​ పైసలు సెప్టెంబర్​ మొదటి వారంలోనే రావాల్సి ఉన్నా.. 24వ తేదీ దాటినప్పటికీ ఖాతాల్లో పడలేదు. దీంతో వారంతా పోస్టాఫీసులు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. 

ఉత్సవంలా నిర్వహించి..!

తెలంగాణ ఏర్పాటయ్యాక పింఛన్​ స్కీమ్​ను ఆసరా పెన్షన్ స్కీమ్​గా మార్చారు. పింఛన్​ ఐడీతో  లింక్​ అయిన పోస్టాఫీస్, బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడతాయి. పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందనే విషయాన్ని ప్రచారం చేసుకునేందుకు కేసీఆర్ ఫొటోతో పింఛన్​ కార్డులను ముద్రించి కొత్త వాళ్లతోపాటు పాతవాళ్లకు నెల రోజులు పంపిణీ చేశారు. కార్డుల పంపిణీని ఎమ్మెల్యేలు, మంత్రులు,  ప్రజాప్రతినిధులు ఉత్సవంలా నిర్వహించారు.  

లేటైన కొద్దీ తిప్పలు.. 

ప్రతి నెలా ఫస్ట్​ వీక్​లో లబ్ధిదారులకు అందాల్సిన ఆసరా పింఛన్లు.. నెలాఖరులో వస్తున్నాయి. రెండేండ్లుగా 15 నుంచి 25 తారీఖు మధ్యే పింఛన్లు ఇస్తున్నారు. దీంతో  మందు గోలీలకు, నిత్యావసర వస్తువులకు చేతిలో డబ్బుల్లేక వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఇతర లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పింఛన్​ వచ్చిందో లేదోనని తెలుసుకునేందుకు ప్రతి నెలా 15వ తేదీ నుంచి 25 వరకు రోజూ పోస్టాఫీసు, బ్యాంకుల చుట్టూ తిరిగిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. 

నిధులు లేకపోవడంతోనే..!

వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, బీడీ, గీత కార్మికులు, హెచ్​ఐవీ, బోదకాలు బాధితులు కలిపి మొత్తం  ఆస రా పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య 2018 నాటికి 39,42,371 ఉండగా.. నెలనెలా చనిపోయి న, ఇతర కారణాలతో మూడున్నరేండ్లలో 3,46,696 మంది పేర్లను ప్రభుత్వం తొలగించింది. ఈ ఏడాది జులై నాటికి ఆ సంఖ్య 35,95,675 తగ్గిపోయింది. 57 ఏండ్లు నిండినోళ్లు 5,97,207 మంది ఉండగా.. వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, బీడీ, గీత కార్మికులు, హెచ్​ఐవీ, బోదకాలు బాధితులు 3,87,864 మంది ఉన్నారు. మొత్తంగా ఆసరా లబ్ధిదారుల సంఖ్య 45,80,746కు పెరిగింది. వీరి ఖాతాల్లో ఈ నెల 1 నుంచి 10వ తారీఖులోపే నెలకు సుమారు రూ.వెయ్యి కోట్లు జమ చేయాల్సి ఉండగా.. నిధుల లేమితో జాప్యం చేస్తున్నట్లు తెలుస్తున్నది.  

అర్హత ఉన్నా.. జాబితాలో పేర్లు రాలే 

2018 ఎన్నికలకు ముందు 57 ఏండ్లు నిండినోళ్లకు కూడా ఆసరా పింఛన్​ ఇస్తామని టీఆర్ ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించి.. ఆ హామీని మూడేండ్లు పక్కన పెట్టింది. నిరుడు హుజూరాబాద్ ఎన్నికలకు ముందు ఆగస్టులో వీరికి మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిచ్చింది. దీంతో 9.50 లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్​లో మరోసారి అవకాశం ఇవ్వడంతో మరో 50 వేల మంది వరకు అప్లయ్​ చేసుకున్నారు. వీరుగాక అప్పటికే 3.15 లక్షల మంది వితంతువులు, దివ్యాంగులు, 65 ఏండ్లు నిండిన వృద్ధులు, ఒంటరి మహిళలు, 50 ఏండ్లు నిండిన గీత, చేనేత, బీడీ కార్మికులు, పైలేరియా, హెచ్ఐవీ పేషెంట్ల దరఖాస్తులు ఎంపీడీవోల లాగిన్ లో అప్రూవ్ అయి మంజూరు చేయడానికి రెడీగా ఉన్నాయి. మొత్తంగా  సంవత్సరం క్రితమే 13.15 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. కొత్త పింఛన్ల జాబితాలో 57 ఏండ్లు నిండినోళ్ల పేర్లు, వితంతువులు, దివ్యాంగుల పేర్లు ఊరికి 10 నుంచి 50 వరకు గల్లంతయ్యాయి. గల్లంతైన అర్హుల పేర్లను చేర్చే విషయమై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.