బ్రిటన్ లో 10 లక్షల మందికి హల్యూసినేషన్​లు

బ్రిటన్ లో 10 లక్షల మందికి హల్యూసినేషన్​లు

సెంట్రల్​ డెస్క్​, వెలుగు:  లేనివి ఉన్నట్లుగా కండ్ల ముందు సడెన్ గా ప్రత్యక్షమైతయి. వస్తువులు, మనుషులు, జంతువులు, పాములు, పురుగులు, చెట్లు, గుట్టలు, వాటర్ ఫాల్స్.. ఇలా గతంలో చూసినవాటిలో ఏవో కొన్ని అకస్మాత్తుగా ముంగటికొస్తయి. కొన్ని బొమ్మల్లాగా కదలకుండా కన్పిస్తుంటే.. మరికొన్ని అటూ ఇటూ తిరుగుతూ కూడా కండ్ల ముందు కదలాడ్తుంటయి. ఇవన్నీ ఏదో మెంటల్ డిసీజ్ కారణంగా కలుగుతున్న హల్యూసినేషన్స్ కావు. బ్రిటన్ లో కంటి చూపు సడెన్ గా పోయినోళ్లకు వస్తున్న ‘చార్లెస్ బోనెట్ సిండ్రోమ్ (సీబీఎస్)’ అనే సమస్య వల్ల కలుగుతున్న భ్రమలు. బ్రిటన్ లో ఇప్పుడు దాదాపు పది లక్షల మంది ఇలాగే సీబీఎస్ బారిన పడి హెల్యూసినేషన్స్ కు గురవుతున్నారని ఇటీవల ‘ఎస్మేస్ అంబ్రెల్లా’ అనే చారిటీ సంస్థ వెల్లడించింది. సీబీఎస్ కారణంగా కొంత మందికి పాతకాలం టీవీ మాదిరిగా కండ్ల ముందు అన్నీ చుక్కలు లేదా నిలువు, అడ్డం గీతలు కన్పిస్తున్నాయని, కొందరికి రకరకాల షేప్ లలో రంగులు కన్పిస్తున్నాయని ఆ సంస్థ తెలిపింది. ఇంకొంతమందికి వస్తువులు, మనుషులు, జంతువులు నిజంగా ముందు ఉన్నట్లే స్వచ్ఛమైన రంగుల్లో కన్పిస్తున్నాయని, మరికొంతమందికి బ్లాక్ అండ్ వైట్ లోనూ ప్రత్యక్షమవుతున్నాయని పేర్కొంది. అలాగే ఈ సమస్య గురించి ఎంత మంది డాక్టర్లకు తెలుసని సర్వే కూడా చేయగా.. వెయ్యి మంది డాక్టర్లలో దాదాపు 37 శాతం మంది తమకు అసలు సీబీఎస్ గురించే తెలియదని చెప్పినట్లు ఎస్మేస్ అంబ్రెల్లా సంస్థ తన రిపోర్ట్ లో వివరించింది. 

ఎందుకీ భ్రమలు?  

కొంతమంది సడెన్​గా 60% లేదా అంతకంటే ఎక్కువగా లేదా పూర్తిగా చూపు కోల్పోతే సీబీ ఎస్ బారినపడతారని, దీనివల్లే హల్యూసినేషన్స్ వస్తుంటాయని సైంటిస్టులు చెప్తున్నారు. చూపు మామూలుగా ఉన్నోళ్లకు వెలుతురు కను పాప ద్వారా రెటీనాపై పడుతుంది. అక్కడ వెలుతురు విజువల్ మెసేజ్​గా మారి మెదడుకు చేరుతుంది. ఆ విజువల్ మెసేజ్​లను మెదడు అనలైజ్ చేయ గానే మనకు సీన్లు కనిపిస్తాయి. కాటరాక్ట్స్, గ్లకోమా, మాక్యులార్ డీజనరేషన్ వంటి సమస్యలతో కంట్లోకి చేరే వెలుతురును విజువల్ మెసేజ్​లుగా మార్చే సిస్టం పనిచేయదు. మెదడుకు విజువల్ డాటా అందక ఖాళీ ఏర్పడుతుంది. ఈ ఖాళీ నింపేందుకని ఆల్రెడీ స్టోర్​ అయి ఉన్న పాత ఇమేజెస్​ను మెదడు ఉపయోగిస్తుంది. దీంతో ఎదురుగా లేని వస్తువులు, మనుషులు కన్పించి విజువల్ హల్యూసినేషన్స్ కు దారితీస్తాయి. ఇవి కొన్ని సెకన్లు, లేదా నిమిషాలు లేదా గంటలు కూడా కొనసాగుతాయని చెప్తున్నారు. వస్తువులు, జంతువులు స్పష్టంగా కన్పిస్తున్నప్పటికీ.. వాటికి సంబంధించిన శబ్దాల వంటివి ఉండవు కాబట్టి ఇవి భ్రమలే అన్న విషయాన్ని సీబీఎస్ సమస్య ఉన్నవాళ్లు గుర్తించగలుగుతారని ఎక్స్ పర్ట్ లు పేర్కొంటున్నారు.


ట్రీట్​మెంట్​ లేదు.. మేనేజ్ చేయడమే..

సీబీఎస్ సమస్యను చార్లెస్ బోనెట్ అనే సైంటిస్ట్1760లోనే గుర్తించారట. అయితే, 1982లోనే మొదటిసారిగా ఈ సిండ్రోమ్ పేరిట పదం సైకియాట్రీలో ఉపయోగంలోకి వచ్చింది. ఎప్పుడో గుర్తించినా, ఇప్పటికీ ఈ సమస్యకు ప్రత్యేకంగా చికిత్సలంటూ ఏమీ లేవని బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్ హెచ్ఎస్) తన వెబ్ సైట్ లో వెల్లడించింది. వాస్తవానికి ఇది డిమెన్షియా వంటి మెంటల్ డిసీజ్ కాదని, కేవలం చూపు సంబంధమైన సమస్య వల్లే హల్యూసినేషన్లు వస్తుంటాయని తెలిపింది. సీబీఎస్ బారిన పడినవాళ్లు కొన్ని టెక్నిక్స్ ను ఫాలో అవుతూ హల్యూసినేషన్స్ తగ్గించుకోవచ్చని పేర్కొంది. కంటి ఎక్సర్ సైజులు చేయడం, ఇంట్లో వెలుతురు బాగా పడే లైట్లను వాడటం, వస్తువులను పెద్దగా చూసేందుకు భూతద్దాలను వాడటం, రెగ్యులర్ గా డాక్టర్లను కలిసి చెకప్ చేయించుకోవడం ద్వారా సీబీఎస్ భ్రమలను మేనేజ్ చేయవచ్చని వివరించింది.