ఢిల్లీలో 10 లక్షలపైనే వీధి కుక్కలు...! సుప్రీంకోర్టు ఆదేశాల అమలు సాధ్యమేనా?

ఢిల్లీలో 10 లక్షలపైనే వీధి కుక్కలు...! సుప్రీంకోర్టు ఆదేశాల అమలు సాధ్యమేనా?
  • వీధి కుక్కలను రీలొకేట్ చేయాలన్న ఆర్డర్ పై భిన్నాభిప్రాయాలు 

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతో పాటు రాజధాని చుట్టుపక్కల వీధుల్లో ఒక్క శునకం కూడా ఉండకూడదని, వాటన్నింటినీ షెల్టర్  హోంలకు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశం అమానవీయం అని జంతు ప్రేమికులు గగ్గోలు పెడుతుండగా.. మరికొందరు సుప్రీం ఆదేశాన్ని స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉంటున్న వీధి కుక్కలన్నింటినీ ఒక్కసారిగా షెల్టర్ హోంలకు తరలించడం సాధ్యమా అన్న ప్రశ్న తలెత్తింది. సుప్రీంకోర్టు ఆదేశాన్ని ఇప్పటికిపుడు అమలు చేయడం సాధ్యం కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

ప్రస్తుతం ఢిల్లీలో 10 లక్షల వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా. ఇక్కడ చివరిసారిగా 2009లో డాగ్  సెన్సస్  నిర్వహించారు. అప్పుడు 5.6 లక్షల శునకాలు ఉన్నట్లు తేలింది.  ప్రస్తుతం 10 లక్షల శునకాలు ఉన్నాయని అనుకుంటున్నా వాస్తవానికి అంతకన్నా ఎక్కువే ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.  ఢిల్లీలో ఉన్న అన్ని కుక్కలను ఒక్కసారిగా షెల్టర్ హోంలకు తరలించడం సాధ్యం కాదని, ఇందుకు మ్యాన్  పవర్  కొరత కూడా ఉందని  అధికారులు చెబుతున్నారు. 

ఒక్కో షెల్టర్ హోం కనీసం 500 కుక్కలకు ఆశ్రయం ఇచ్చినా.. 10 లక్షల వీధి కుక్కలకు షెల్టర్ హోంలు ఏర్పాటు చేయాలంటే కనీసం 2 వేల హోంలు నిర్మించాలి.  ప్రస్తుతం ఢిల్లీలో 20 షెల్టర్ హోంలే ఉన్నందున.. ఇప్పటికిప్పుడు అన్ని షెల్టర్ల నిర్మాణం అసాధ్యమని చెప్తున్నారు.